డబ్బు జబ్బు
సాక్షి, కర్నూలు : ఠాగూర్ చిత్రంలోని ఆస్పత్రి సన్నివేశం అందరికీ తెలిసిందే.. శవానికి వైద్యం చేస్తున్నట్లు నటించి లక్షలాది రూపాయలు లాగే వైద్యుల ఉదంతం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. నిజ జీవితంలో కూడా ‘ఠాగూర్’ తరహా వైద్యులు కోకొల్లులుగా ఉన్నారు.. మానవత్వాన్ని మరచిపోయి ప్రవర్తించే వైద్యులు కర్నూలులో గల్లీగల్లీకి తయారయ్యారు.
తుమ్ములు, దగ్గులకు కూడా వేలకు వేలు బిల్లులు లాగే పరిస్థితి దాపురించింది. పరీక్షలు, ఎక్స్‌రేలు, స్కానింగ్‌లు, అవసరానికి మించి మందులు రాస్తూ.. రోగులను దోపిడీ చేస్తున్నారు.. పైసలు పోయినా ప్రాణం దక్కుతుందా? అంటే అదీలేదు.. ప్రభుత్వ ఆస్పత్రుల తరహాలోనే, ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలవుతున్నాయి.
కర్నూలు జిల్లా వ్యాప్తంగా 197 ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లు ఉన్నాయి. మరో 99 వరకు సింగిల్ కౌంటర్ ఆస్పత్రులు ఉన్నాయి. మరో 26 డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నాయి. 12 సిటీ స్కాన్, 5 ఎంఆర్‌ఐ స్కాన్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో కర్నూలు నగరంలోనే 200 వరకు ఉన్నాయి. ఈ ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం అత్యంత ఖరీదైపోయింది.
‘వైద్యో నారాయణో హరి!’ అనే నానుడి కనుమరుగైంది. మానవత్వానికి చిరునామా అనేది లేకుండా పోయింది. దినసరి లక్ష్యాలు పెట్టుకుని మరీ వైద్యులు ముందుకు సాగుతున్నారు. రోజుకు రూ. 30 వేల నుంచి రూ. 50 వేలు జేబులో వేసుకోనిదే ఇళ్లకు వెళ్లలేని వైద్యులు కూడా కర్నూలులో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ప్రాణభయంతో ఆస్పత్రికి వెళ్లిన రోగులకు డాక్టర్లు చుక్కలు చూపిస్తున్నారు. చిన్నాచితకా రోగాలకు సైతం లక్షల రూపాయల్లో బిల్లులు వేస్తున్నారు. ముందస్తుగా డబ్బులు డిపాజిట్ చేస్తేనే చికిత్స ప్రారంభిస్తున్నారు.
లేకపోతే మెడలు పట్టి మరీ ఆస్పత్రి నుంచి గెంటేస్తున్నారు. కొన ఊపిరితో ఉన్న పేషెంట్లపై కూడా కనికరం చూపే పరిస్థితి లేదు. మెడికల్ షాపుల నిర్వహణ కూడా వైద్యులే చేస్తున్నారు. కుటుంబ సభ్యులను కూర్చోబెడుతున్నారు. అవసరానికి మించి మందులు రాస్తూ, టర్నోవర్‌ను గణనీయంగా పెంచుకుంటున్నారు. మెడికల్ స్టోర్ ఇతరులది ఉంటే.. వారిని ‘ఏటీఎం’ తరహాలో వినియోగించుకుంటున్నారు. మందుల విక్రయాలు, ల్యాబుల్లో చేసే పరీక్షలపై వైద్యులు కమీషన్ తీసుకుంటున్నారు.
‘శాంపిల్ మెడిసిన్స్’, శాంపిల్ కిట్స్‌ను కూడా సొమ్ము చేసుకుంటున్నారు. కన్సల్టెన్సీ ఫీజును రూ. 50 నుంచి అమాంతంగా 150లకు పెంచేశారు. అతితక్కువ మంది వైద్యులు రూ. 100 తీసుకుంటున్నారు. నెలలోపు రెండోసారి వస్తే ఉచితంగానే చూసేవారు. ఇప్పుడా గడువును వారం నుంచి రెండు వారాలకు తగ్గించారు. దీంతో రెండోసారి వచ్చేవారు మళ్లీ రూ. 150 వెచ్చించి కొత్త టోకెన్ తీసుకోవాల్సి వస్తోంది. మందుల కంపెనీలతో కూడా వైద్యులు కుమ్మక్కయ్యారు. కమీషన్లు పుచ్చుకుంటూ వారు సూచించిన మందులనే పేషెంట్లకు అంటగడుతున్నారు.
‘ఐసీయూ’ చికిత్స ఖరీదైపోయింది. రూ. లక్షలు ధారపోస్తే తప్ప ‘ఐసీయూ’లో బెర్తు దొరికే పరిస్థితి లేదు. రోగితో ఎవరిని ఉంచకుండా, ఆస్పత్రి సిబ్బందే అంతా చూసుకుంటారు. ఈక్రమంలో కొనుగోలు చేసిన మందుల్లో 25 శాతం వినియోగిస్తున్నారు. మిగిలిన 75 శాతం మందులను దొడ్డిదారిలో మెడికల్ స్టోరుకు తరలిస్తున్నారు. ఒకే ప్రిస్కిప్షన్‌పై రూ. 4 వేల విలువైన మందులు రాసే యూరాలజిస్టులు, ఫిజీషియన్లు కూడా లేకపోలేదు. ఆరోగ్యశ్రీని కూడా దుర్వినియోగం చేస్తున్నారు. తక్కువ ట్రీట్‌మెంట్ చేసి ఎక్కువ బిల్లును ప్రభుత్వం నుంచి రికవరీ చేసుకుంటున్నారు. పర్యవేక్షించాల్సిన వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మామూళ్లతో సరిపెట్టుకుంటున్నారు.
ఆదివారం నరకయాతన..
ఆదివారం వచ్చిందంటే చాలు.. వైద్యం చేసే దిక్కులేకుండా పోతోంది. శనివారం సాయంత్రం కాగానే, వైద్యులు హైదరాబాద్ వెళ్లిపోతున్నారు. అక్కడ రిలాక్స్ అయి సోమవారం తిరిగి జిల్లాకు వస్తున్నారు. అత్యవసర వైద్యం కోసం వచ్చే వారిని పట్టించుకునే నాధుడే ఉండడం లేదు. ఆస్పత్రుల్లో ఇన్ పేషెంట్లను ఉదయమొకసారి, సాయంత్రమొకసారి వైద్యులు స్వయంగా చూస్తుంటారు. కాని ఆదివారం సెలవు పేరుతో శనివారం నుంచి సోమవారం వరకు ఇన్ పేషెంట్లను పట్టించుకునే దిక్కులేదు. ఒకరిద్దరు కంపౌండర్లను ఉంచేసి వెళ్తున్నారు. వైద్యుని దర్శనం కోసం గంటల తరబడి ఎదురుచూడడం ఇక నిత్యకృత్యమైపోయింది.
ప్రాణాలు.. గాలిలో దీపాలు..
ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం ఖరీదైనప్పటికీ ప్రాణాలకు కూడా భద్రతలేదు. ప్రాణభయంతో ఆస్పత్రికి వెళ్లిన రోగుల పరిస్థితి గాలిలో దీపంలా తయారవుతోంది. నగరంలోని నరసింగరావు పేటలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోమ్, మెటర్నిటి ఆసుపత్రిలో తొమ్మిది నెలల పాటు గర్భిణీకి వైద్యసేవలందించారు.వేలాది రూపాయలు వసూలు చేశారు. చివరి నిమిషంలో బిడ్డ అడ్డం తిరిగిందని మరో ఆసుపత్రికి పంపించారు. వేరే ఆసుపత్రికి తరలించేలోపే కడుపులో శిశువు మృతి చెందింది. బంధువు లు ఆసుపత్రి ఎదుట ధర్నా చేపట్టారు.
గాయత్రి ఎస్టేట్‌లోని మరో ప్రైవే టు ఆసుపత్రిలో ప్రసూతి కోసం చేరితే రూ.70 వేలు బిల్లు వేసి మృత శిశువును చేతిలో పెట్టారని బంధువులు ఆందోళన చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి సర్ది చెప్పారు. అలాగే నగరంలోనే ఇంకో ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటూ వైద్యం వికటించడంతో ఓ మహిళ మృతి చెందింది. ఆసుపత్రి వద్ద గొడవ జరిగింది. ఇలాంటి ఇలాంటి సంఘటనలు జిల్లావ్యాప్తంగా నిత్యం ఒకటి, రెండు జరుగుతున్నాయి.