ఆసుపత్రి ముందు ధర్నా చేస్తున్న యలమంద బంధువులు
గుంటూరు ఈస్ట్: వైద్యం పేరుతో విడతల వారీగా రూ. 6 లక్షలు ఖర్చు చేయించి, చివరికి రోగి బతకడని చెప్పిన ఓ ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యానికి కొమ్ముకాస్తూ రోగి బంధువులను బెదిరించి తన అనుచరులతో దాడి చేయించాడో టీడీపీ నేత. ఈ ఘటన గుంటూరు ఓల్డ్ క్లబ్ రోడ్డులో శనివారం కలకలం రేపింది. నూజెండ్ల మండలం కొండ్రపాడు గ్రామానికి చెందిన దాలి యలమందరావు కౌలు రైతుగా జీవనం సాగిస్తుంటాడు. అతను మే 18న రోడ్డు ప్రమాదంలో పక్కటెముకల లోపల గాయమయింది. స్థానిక ఆర్‌ఎంపీ వైద్యుడి సిఫారసుతో అదే రోజు రాత్రి యలమందరావును బంధువులు గుంటూరు సిటీ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం 24న వైద్యులు డిస్చార్జ్ చేశారు. అయితే ఒక్కరోజుకే మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురవడంతో 26 రాత్రిన తిరిగి ఆస్పత్రికి తీసుకొచ్చారు. 30న యలమందరావు ఆరోగ్య పరిస్థితి విషమించిందంటూ వైద్యులు డయాలసిస్ ప్రారంభించారు. అప్పటికే రూ. 6లక్షలు కట్టించుకున్నారు. ఆ తర్వాత 31న యలమందరావు బతికే అవకాశం తక్కువగా ఉందని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు.
ఆ సమయంలోనూ వైద్య పరీక్షలు అంటూ రూ. 20 వేలు కట్టించుకున్నారు. యలమందరావు బంధువులు ఆస్పత్రికి వచ్చి వైద్యం పేరుతో లక్షల రూపాయలు కట్టించుకొని ఇలా చేయడమేంటని వైద్యులను ప్రశ్నించారు. దీంతో వాగ్వావాదం జరిగింది. ఆస్పత్రి యాజమాన్యంతో సంబంధాలు కలిగిన టీడీపీ నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ కలుగ చేసుకుని యలమంద బంధువులను బెదిరించాడు. యలమంద బావమరిది వెంకటేశ్వర్లు, మరో ఇద్దరిని గదిలోకి పిలిచి తలుపులు వేసి తీవ్ర పదజాలంతో దూషించాడు. ప్రభాకర్ అనుచరులు 30 మంది ఆస్పత్రి దగ్గరకు వచ్చి రోగి బంధువులపై దాడి చేశారు. మహిళలు, పిల్లలను కూడా చితకబాదారు. కొత్తపేట పోలీసులు ఇరువర్గాల వారిని స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. డేగల ప్రభాకర్, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని రోగి బంధువులు అక్కడ ధర్నా చేశారు. ఈ ఘటనపై కొత్తపేట ఎస్‌హెచ్‌ఓ మధుసూదనరావు వివరణ ఇస్తూ.. ఘర్షణ నివారించడానికి ఇరువర్గాలను స్టేషన్‌కు తరలించామని చెప్పారు. యలమందకు ఉచితంగా వైద్యం చేయడానికి ఆస్పత్రి యాజమాన్యం అంగీకరించడంతో కేసు నమోదు చేయలేదని చెప్పారు.
గతంతోనూ ఎస్‌హెచ్‌వోపై దౌర్జన్యం
నగరంలోని అనేక ఆస్పత్రులు, ఇతర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మెడికల్ షాపులు నిర్వహిస్తున్న డేగల ప్రభాకర్ టీడీపీ అధికారం ఉన్న సమయంలో అనేక దౌర్జన్యాలు చేసేవాడు. మాజీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్‌కు అనుచరుడిగా ఉంటూ అనేక దారుణాలు చేశాడు. గతంలో కొత్తపేట భగత్‌సింగ్ సెంటర్‌లో ఓ ఆస్పత్రిని ఖాళీ చేయించే విషయంలో భవన యజమానిని బంధించాడు. దీనిని అడ్డుకోవడానికి వెళ్లిన అప్పటి ఎస్‌హెచ్‌ఓపై దాడికి దిగగా అతడు డేగల ప్రభాకర్‌పై కేసు నమోదు చేయడానికి ప్రయత్నించారు. చిన్నబాబు జోక్యంతో ఎస్‌హెచ్‌వో మిన్నకుండిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment