degala prabakar
-
టీడీపీ నగర అధ్యక్షుడి గూండా గిరి
గుంటూరు ఈస్ట్: వైద్యం పేరుతో విడతల వారీగా రూ. 6 లక్షలు ఖర్చు చేయించి, చివరికి రోగి బతకడని చెప్పిన ఓ ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యానికి కొమ్ముకాస్తూ రోగి బంధువులను బెదిరించి తన అనుచరులతో దాడి చేయించాడో టీడీపీ నేత. ఈ ఘటన గుంటూరు ఓల్డ్ క్లబ్ రోడ్డులో శనివారం కలకలం రేపింది. నూజెండ్ల మండలం కొండ్రపాడు గ్రామానికి చెందిన దాలి యలమందరావు కౌలు రైతుగా జీవనం సాగిస్తుంటాడు. అతను మే 18న రోడ్డు ప్రమాదంలో పక్కటెముకల లోపల గాయమయింది. స్థానిక ఆర్ఎంపీ వైద్యుడి సిఫారసుతో అదే రోజు రాత్రి యలమందరావును బంధువులు గుంటూరు సిటీ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం 24న వైద్యులు డిస్చార్జ్ చేశారు. అయితే ఒక్కరోజుకే మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురవడంతో 26 రాత్రిన తిరిగి ఆస్పత్రికి తీసుకొచ్చారు. 30న యలమందరావు ఆరోగ్య పరిస్థితి విషమించిందంటూ వైద్యులు డయాలసిస్ ప్రారంభించారు. అప్పటికే రూ. 6లక్షలు కట్టించుకున్నారు. ఆ తర్వాత 31న యలమందరావు బతికే అవకాశం తక్కువగా ఉందని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆ సమయంలోనూ వైద్య పరీక్షలు అంటూ రూ. 20 వేలు కట్టించుకున్నారు. యలమందరావు బంధువులు ఆస్పత్రికి వచ్చి వైద్యం పేరుతో లక్షల రూపాయలు కట్టించుకొని ఇలా చేయడమేంటని వైద్యులను ప్రశ్నించారు. దీంతో వాగ్వావాదం జరిగింది. ఆస్పత్రి యాజమాన్యంతో సంబంధాలు కలిగిన టీడీపీ నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ కలుగ చేసుకుని యలమంద బంధువులను బెదిరించాడు. యలమంద బావమరిది వెంకటేశ్వర్లు, మరో ఇద్దరిని గదిలోకి పిలిచి తలుపులు వేసి తీవ్ర పదజాలంతో దూషించాడు. ప్రభాకర్ అనుచరులు 30 మంది ఆస్పత్రి దగ్గరకు వచ్చి రోగి బంధువులపై దాడి చేశారు. మహిళలు, పిల్లలను కూడా చితకబాదారు. కొత్తపేట పోలీసులు ఇరువర్గాల వారిని స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. డేగల ప్రభాకర్, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని రోగి బంధువులు అక్కడ ధర్నా చేశారు. ఈ ఘటనపై కొత్తపేట ఎస్హెచ్ఓ మధుసూదనరావు వివరణ ఇస్తూ.. ఘర్షణ నివారించడానికి ఇరువర్గాలను స్టేషన్‌కు తరలించామని చెప్పారు. యలమందకు ఉచితంగా వైద్యం చేయడానికి ఆస్పత్రి యాజమాన్యం అంగీకరించడంతో కేసు నమోదు చేయలేదని చెప్పారు. గతంతోనూ ఎస్‌హెచ్‌వోపై దౌర్జన్యం నగరంలోని అనేక ఆస్పత్రులు, ఇతర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మెడికల్ షాపులు నిర్వహిస్తున్న డేగల ప్రభాకర్ టీడీపీ అధికారం ఉన్న సమయంలో అనేక దౌర్జన్యాలు చేసేవాడు. మాజీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్‌కు అనుచరుడిగా ఉంటూ అనేక దారుణాలు చేశాడు. గతంలో కొత్తపేట భగత్‌సింగ్ సెంటర్లో ఓ ఆస్పత్రిని ఖాళీ చేయించే విషయంలో భవన యజమానిని బంధించాడు. దీనిని అడ్డుకోవడానికి వెళ్లిన అప్పటి ఎస్హెచ్ఓపై దాడికి దిగగా అతడు డేగల ప్రభాకర్‌పై కేసు నమోదు చేయడానికి ప్రయత్నించారు. చిన్నబాబు జోక్యంతో ఎస్‌హెచ్‌వో మిన్నకుండిపోయారు. -
‘డేగల’పై ఐటీ అధికారుల కన్ను
సాక్షి, గుంటూరు: గుంటూరులో పన్ను ఎగవేతదారులైన బడాబాబుల ఇళ్లు, వ్యాపారాలపై ఐటీ అధికారులు రెండు రోజులుగా సోదాలు చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఫిరంగిపురం మండల అధ్యక్షుడు డేగల ప్రభాకర్ ఇల్లు, ఫార్మసీ కార్యాలయాల్లో బుధ, గురువారాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో రియల్ ఎస్టేట్‌కు చెందిన అత్యంత విలువైన డాక్యుమెంట్లతో పాటు, భారీగా ఆస్తులు, బ్యాంకు పాస్‌పుస్తకాలు, వ్యాపార సంబంధిత డాక్యుమెంట్లు బయటపడినట్లు తెలుస్తోంది. లక్ష్మీపురం, కొత్తపేట, పెదకాకాని రోడ్లలోని వ్యాపార సముదాయాలతో పాటు లాల్పురం రోడ్డులోని వెంచర్లకు సంబంధించిన కార్యాలయాలు, ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు చేసి సోదాలు చేస్తున్నారు. డేగలకు చెందిన సెవన్‌హిల్స్ ఫార్మసీ సముదాయాన్ని నవంబరు 1న ప్రారంభిస్తున్న మంత్రి కామినేని, పక్కన డేగల ప్రభాకర్, కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ, మద్దాళి గిరి తదితరులు ఆదాయ పన్ను ఎగవేత దారుల జాబితాలో డేగల పేరు ఉండటంతో గత కొన్ని రోజులుగా నిఘా ఉంచిన ఐటీ అధికారులు బుధవారం మధ్యాహ్నం నుంచి ఏక కాలంలో డేగలతో పాటు ఆయన భాగస్వాముల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. నగరంలో అత్యంత రద్దీగా ఉండే కొత్తపేటలో సెవన్‌హిల్స్ ఫార్మసీ పేరుతో అత్యంత అధునాతన సౌకర్యాలతో కూడిన ఫార్మసీ భవనాన్ని 2 నెలల క్రితం ఆర్భాటంగా ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్‌తో పాటు, అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. డేగల ప్రభాకర్ తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌కు సన్నిహితుడు. డేగలకు చెందిన భవనంలోనే శ్రావణ్‌కుమార్ ప్రస్తుతం తన కార్యాలయాన్ని సైతం నడుపుతున్నారు. ఇటీవల గుంటూరు నగర టీడీపీ అధ్యక్ష పదవికి సైతం డేగల పోటీ పడ్డాడు. అధికార పార్టీకి చెందిన డేగల ప్రభాకర్ వ్యాపార సముదాయాలపై ఐటీ దాడులు జరగడం నగరంలో చర్చనీయాంశమైంది. అనతి కాలంలోనే.. కోట్లకు పడగలెత్తిన డేగల ఫిరంగిపురం మండలం 113 త్యాళ్లూరుకు చెందిన డేగల ప్రభాకర్ సామాన్య కుటుంబంలో జన్మించాడు. పదిహేనేళ్ల క్రితం గుంటూరులోని మెడికల్ షాపులో గుమాస్తాగా పనిచేసిన డేగల రెండేళ్లలో సొంతంగా మెడికల్ షాపును పెట్టారు. అనంతరం ప్రాప్రగండ డిస్ట్రిబ్యూషన్ పేరుతో డీలర్‌షీప్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం గుంటూరులోని సుమారు 20 ఆస్పత్రుల్లో ఉన్న మెడికల్ షాపులు డేగల బినామీ పేర్లతో నిర్వహిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం డేగల ప్రభాకర్ భార్య 113 త్యాళ్లూరు గ్రామ సర్పంచ్‌గా ఉన్నారు. కేంద్రం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న తరువాత మెడికల్ షాపుల్లో పాత నోట్లు తీసుకునేందుకు అనుమతులు ఇచ్చింది. ఆ సమయంలో గుంటూరుకు చెందిన పలువురు వైద్యులు ఇతని బినామీలకు చెందిన మెడికల్ షాపుల్లో భారీ ఎత్తున డబ్బులు మార్చారనే ఆరోపణలు వినిపించాయి. పలు రియల్ ఎస్టేట్ వెంచర్లలో డేగలకు భాగస్వామ్యం ఉన్నట్లు విచారణలో తేలినట్లు తెలిసింది. ఐటీ సోదాలు జరుగుతుండటంతో మూసివేసిన డేగలకు చెందిన సెవన్‌హిల్స్ ఫార్మసీ సముదాయం -
పోలీసుల అదుపులో కిడ్నాపర్లు
డోన్‌టౌన్, న్యూస్‌లైన్ : ఓ యువకున్ని ఎత్తుకెళ్లి రూ. 15 లక్షలు డిమాండ్ చేస్తూ తల్లిదండ్రులను ముప్పుతిప్పలు పెడుతున్న ఓ ముఠాను శుక్రవారం డోన్ పోలీసులు అరెస్టు చేశారు. కిడ్నాపర్ల చెర నుంచి ఆ యువకునికి విముక్తి కల్పించి తండ్రికి అప్పగించారు. పోలీసుల వివరాల మేరకు.. మండలంలోని దొరపల్లెకు చెందిన ఎల్లప్ప కుమారుడు మధు హైదరాబాద్‌లో చిరువ్యాపారం చేసుకుంటూ గత నెల 20వతేదీన కిడ్నాప్‌కు గురయ్యాడు. అదే సమయంలో అతని వెంట ఉన్న మరో బాలుడు జంగాల నాగరాజు తప్పించుకున్నాడు. మధును ఎత్తుకెళ్లిన కిడ్నాపర్లు రూ. 15లక్షలు ఇస్తే వదిలిపెడతామని ఫోన్ చేసి బెదిరిస్తుండడంతో తండ్రి ఎల్లప్ప, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ తిరుమలేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు మొదలెట్టిన పోలీసులు డబ్బులు డిమాండ్ చేసేందుకు కిడ్నాపర్లు వాడిన సెల్‌ఫోన్ నెంబర్ల ఆధారంగా కేసును చేధించారు. డోన్‌కు చెందిన జంగాల ఇప్పి నాగశెట్టి, జంగాల ఈర్లపల్లి చంద్రయ్య, దేవనకొండ మండలం పి.కోటకొండకు చెందిన బోయ పంపన్న, బోయ గడివేముల వెంకటేష్, బోయ కోలంట్ల రామాంజనేయులు, బోయ గిడ్డయ్య, కమ్మరికౌలుట్లయ్య దొరపల్లె క్రాస్‌రోడ్డు వద్ద 44వ నెంబర్జాతీయ రహదారిపై సఫారీ వాహనంలో సంచరిస్తుండగా అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్న సీఐ డేగలప్రభాకర్, ఎస్ఐలు మోహన్‌రెడ్డి, సతీష్, సిబ్బందిని అభినందించారు.