వేలాది రూపాయల జీతం ఇస్తున్నా కార్పొరేట్ కార్యాలయాల్లో ఇమడలేకపోతున్న రోజులివి. పని ఒత్తిడితో ఎంతో మంది యువకులు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో కోకొల్లలు.
సాక్షి ప్రతినిధి, కర్నూలు: వేలాది రూపాయల జీతం ఇస్తున్నా కార్పొరేట్ కార్యాలయాల్లో ఇమడలేకపోతున్న రోజులివి. పని ఒత్తిడితో ఎంతో మంది యువకులు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో కోకొల్లలు.
ఈ పరిస్థితుల్లో అటెండర్ స్థాయి అయినా ఫర్వాలేదు.. అది ప్రభుత్వ ఉద్యోగం అయితే చాలనుకునే నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతోంది. వేలాది రూపాయల జీతం అక్కర్లేదు.. మానసిక ప్రశాంతత కావాలనే భావన పెరిగిపోతోంది. ఫలితంగా ఎలాంటి ప్రభుత్వ నోటిఫికేషన్ వెలువడినా దరఖాస్తులు వెల్లువలా దాఖలవుతున్నాయి. చిన్న ఉద్యోగమైనా.. పీజీలు, ఎంటెక్‌లు, ఎంసీఏ పూర్తి చేసిన వారు సైతం పోటీ పడుతున్నారు. పదో తరగతి అర్హతతో భర్తీ చేస్తున్న పోస్టులకు సైతం ఇలాంటి వారు ముందువరుసలో నిలుస్తున్నారు.
తాజాగా వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడటంతో అందరి దృష్టీ వీటిపైకి మళ్లింది. ఇదే అదనుగా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మధ్యవర్తులు బయలుదేరారు. నిరుద్యోగుల ఆశలతో బేరసారాలు మొదలుపెట్టారు. ఇలాంటి ముఠా ఒకటి ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడింది. హైటెక్ సాంకేతిక పరిజ్ఞానంతో మాల్ ప్రాక్టీస్‌కు సర్వం సిద్ధం చేసుకున్న ముఠా గుట్టు శుక్రవారం రట్టయింది. కర్నూలు, నంద్యాల కేంద్రంగా వీరు తమ కార్యకలాపాలకు తెర తీసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది. ఇదిలాఉండగా కర్నూలులోనూ ఉద్యోగం ఇప్పిస్తామంటూ మరో ముఠా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన మధ్యవర్తికి డబ్బు ముట్టజెప్పేందుకు సిద్ధమవుతున్న ఓ నిరుద్యోగి స్నేహితుడు శుక్రవారం ‘సాక్షి’ కార్యాలయానికి సమాచారం అందించారు. నగరానికి చెందిన ఆటోవాలా కుమారుడైన రాామకృష్ణ వీఆర్వో పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. తండ్రికి పరిచయమైన ఓ వ్యక్తి కుమారుడి వివరాలు తెలుసుకుని ఉద్యోగం వచ్చే మార్గం చెబుతానన్నాడు. నగరంలో పలుకుబడి ఉన్న వ్యక్తి పేరు చెప్పి.. రూ.6 లక్షలు ఖర్చు పెట్టుకుంటే ఉద్యోగం వచ్చేసినట్లేనని నమ్మబలికాడు.
పరీక్షకు ముందు రూ.3 లక్షలు.. ఉద్యోగం ఖాయమయ్యాక మరో రూ.3 లక్షలు ఇచ్చేలా కుదుర్చుకున్నారు. ఒప్పందంలో భాగంగా శనివారం రూ.3 లక్షలు ఇచ్చేందుకు వారు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని రామకృష్ణ మిత్రుడు నారాయణరెడ్డి ‘సాక్షి’ దృష్టికి తీసుకురావడంతో.. పోలీసులు ఓ ముఠాను పట్టుకున్న విషయాన్ని వారికి తెలియజెప్పి మాయగాళ్ల ఉచ్చులో మోసపోకుండా కాపాడగలిగింది. జిల్లా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, ఎస్పీ రఘురామిరెడ్డి సైతం నిరుద్యోగులు మోసగాళ్ల మాయలో పడి డబ్బు పోగొట్టుకోవద్దని సూచించారు.