మట్టిలో మనీ దందా
- లాటరైట్ తవ్వకాలకు ఎడాపెడా అనుమతి
- ఎన్నికలకు ముందు శరవేగంగా ఉత్తర్వులు
- జిల్లా మంత్రి సహకారంతో జీఓల జారీ
- వారంలోనే 39 ఎకరాలకు పైగా లీజు
- రాయల్టీని పట్టించుకోని జిల్లా యంత్రాంగం
ఎన్నికలు సమీపిస్తున్న వేళ మట్టిలో మనీ దందాకు రంగం సిద్ధం చేశారు. ములుగు మండలం రామచంద్రాపురం వేదికగా దండుకునేందుకు పలువురు వ్యాపారులు గ‘లీజు’ పనులకు సన్నద్ధమయ్యూరు. ‘మాకు అనుకూలంగా అనుమతులు ఇప్పిస్తే... ఎన్నికల నిధులు సమకూరుస్తాం’ అని జిల్లాకు చెందిన ఓ మంత్రితో ఒప్పందం చేసుకుని భవిష్యత్‌కు బాటలు వేసుకుంటున్నారు. లాటరైట్ మాటున ఐరన్‌ఓర్ తరలించే స్వకార్యాన్ని చక్కబెట్టుకుంటున్నారు. మూడు రోజుల వ్యవధిలో సర్కారు నుంచి 39 ఎకరాలకు పైగా భూమిని 20 ఏళ్లపాటు దక్కించుకున్న తీరే ఇందుకు నిదర్శనం.
సాక్షి ప్రతినిధి, వరంగల్: లాటరైట్ (ఎర్రమట్టి) తవ్వకాల కోసం భూములను లీజుకు ఇవ్వడం... తీసుకోవడం కొత్త కాదు. కానీ... ఒకే వారంలో ఏకంగా 39.30 ఎకరాలను 20 ఏళ్లపాటు లీజుకు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ఎవరికైనా అనుమానం కలిగించేదే. ఈ అంశం ఇప్పుడు జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఎన్నికల సమయూన్ని అదునుగా భావించిన కొందరు వ్యాపారులు... జిల్లాకు చెందిన ఓ మంత్రి సహకారంతో ఉత్తర్వులు ఇప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది.
భవిష్యత్‌లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా... అనుకున్న ప్రకారం అవసరమైన విస్తీర్ణంలో భూములను లీజుకు తీసుకునే వ్యూహాన్ని వ్యాపారులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. లాటరైట్ పేరిట ముడి ఇనుము (ఐరన్‌ఓర్)ను తవ్వుకునేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారు. లీజు అనుమతులు ఇచ్చినందుకు ప్రతిఫలంగా ఎన్నికల అవసరాలకు నిధులు సమకూర్చేలా ఒప్పందం చేసుకోవడంతో ఒకరి వెనుక ఒకరికి వరుసగా అనుమతులు వస్తున్నట్లు సమాచారం.
గత ఏడాది ఆగస్టు, సెప్టెంబరులోనూ ఇలాగే 57 ఎకరాల్లో మట్టి తవ్వకాలకు రాష్ట్ర సర్కారు 20 ఏళ్లపాటు లీజు అనుమతులు ఇచ్చింది. ఇదే వరుసలో ప్రస్తుతం మరో నాలుగు జీఓలు విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. వ్యాపారులు అడిగిందే తడవుగా, మంత్రి సహకారంతో వరుసపెట్టి లీజు అనుమతులు ఇస్తున్న సర్కారు, జిల్లా యంత్రాంగం.... రాయల్టీ వసూలును మా త్రం పట్టించుకోవడంలేదు. ఎర్రమట్టి పేరుతో ముడి ఇనుమును తవ్వుకుంటు న్నా... పట్టనట్లుగా వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.
ప్రజాప్రతినిధుల అండదండలు
లాటరైట్ ఖనిజాన్ని నిర్మాణాలకు వినియోగించడం వేల సంవత్సరాల నుంచి ఉంది. ఈ ఖనిజాన్ని మొదట ఇటుకల రూపంలో సేకరించి ఇళ్లు కట్టినట్లు చెబుతుంటారు. ములుగు మండలం మల్లంపల్లి, రామచంద్రాపురం ప్రాంతం లాటరైట్‌కు ప్రసిద్ధి. 500 ఎకరాల వరకు ఇక్కడ ఎర్రమట్టి గనులు ఉన్నట్లు అంచనా. ఇక్కడ తవ్వుతున్న లాటరైట్‌లో అధిక ధర వచ్చే ఐరన్‌ఓర్, బాక్సైట్ ఉంటుందని గనుల శాఖ అధికారులే అంటున్నారు. లీజుదారులు మాత్రం కేవలం సిమెంట్ తయారీలో వినియోగిస్తారని చెబుతున్నారు. ఇక్కడ 30 వరకు కంపెనీలు లాటరైట్ లీజులను పొందాయి. వీటి పరిధిలో 200 ఎకరాల భూములు ఉన్నాయి. అయితే ప్రజాప్రతినిధులు, అధికారుల అండదండలతో లీజుదారులు మైనింగ్ నిబంధనలను పక్కనబెట్టడం ఇక్కడ ఆనవాయితీగా మారింది.
రాయల్టీ ఎగవేత, పరిధి దాటి తవ్వకాలు
లాటరైట్ తవ్వకాలకు టన్నుకు రూ.35 చొప్పున ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. మల్లంపల్లి మైనింగ్ కేంద్రంగా ప్రతి రోజూ దాదాపు 200 లారీలు ఇక్కడి క్వారీల నుంచి ముడి సరుకును రవాణా చేస్తున్నాయి. అనుమతులు పొందేందుకు అడ్డదారుల్లో వెళ్తున్న సంస్థలు రాయల్టీ చెల్లింపుల్లోనూ ఇదే రకంగా వ్యవహరిస్తున్నాయి. లాటరైట్ రవాణాకు సంబంధించి 10 టైర్ల లారీలో 17 టన్నులు, 12 టైర్ల లారీలో 21 టన్నులు తరలించాలి. ఇక్కడి వ్యాపారులు మాత్రం ఒక్కో లారీలో 50 టన్నుల వరకు తరలిస్తున్నారు.
లారీకి రూ.800 నుంచి రూ.వెయ్యి వరకు రాయల్టీ ఎగ్గొడుతున్నారు. ఇలా ఎగవేస్తున్న మొత్తం నెలకు రూ.60 లక్షల వరకు ఉంటోందని అంచనా. రాయల్టీ ఎగవేతతోనే ఆగకుండా తమకు కేటాయించని భూముల్లోనూ ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుపుతూ మరో రకంగా సర్కారు ఆదాయానికి గండికొడుతున్నారు.
పూర్తి స్థాయిలో రాయల్టీని వసూలు చేయడం, లీజుదారులు హద్దులు దాట కుండా నియంత్రించడంలో జిల్లా గనుల శాఖ అధికారులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. ఎర్రమట్టి లీజుదారులు తమకు కేటాయించిన భూముల పక్కన ఉన్న ప్రాంతాల్లోనూ తవ్వకాలు జరపడంపై సర్వేలు జరపాలని గతంలో జాయింట్ కలెక్టర్ స్థాయిలో నిర్ణయించారు. ఇది ఇప్పటికీ పూర్తికాపోవడంతో జిల్లా యంత్రాంగం తీరుపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.