సంక్షేమానికి తూట్లు... సోకులకు కోట్లా! | money wastage for chandrababu office renovation | Sakshi
Sakshi News home page

సంక్షేమానికి తూట్లు... సోకులకు కోట్లా!

Published Thu, Sep 11 2014 2:08 AM | Last Updated on Wed, Aug 29 2018 7:09 PM

money wastage for chandrababu office renovation

* నిధులు లేవంటూ ఇంత దుబారా చేస్తారా?
సీఎం ‘మరమ్మతుల’ ఖర్చుపై విమర్శలు
* సచివాలయంలో సీఎం చంద్రబాబు కార్యాలయం మరమ్మతులకు రూ. 25 కోట్లకు పెరిగిన వ్యయం
* తొలుత సీఎం కోసం సౌత్ హెచ్‌లో రూ. 10 కోట్లతో మరమ్మతులు.. ఆ ఖర్చంతా వృథా
* ఎల్ బ్లాకు కార్యాలయంలో సదుపాయాలు, మరమ్మతులకు రూ. 15 కోట్లు విడుదల
* సీఎం క్యాంపు కార్యాలయం లేక్‌వ్యూ, నివాసంలో సదుపాయాలకు మరో రూ. 10 కోట్లు
* ఒకవైపు సంక్షేమ నిధులకు కోతలు పెట్టి.. రాజధాని నిర్మాణానికి విరాళాలు కావాలంటూ..
* తాత్కాలిక కార్యాలయాల మరమ్మతులకే 35 కోట్ల వ్యయంపై విస్తుపోతున్న యంత్రాంగం
* ఆర్థికమంత్రి చాంబర్‌లో టీవీ కోసం రూ. 4.10 లక్షలు వ్యయం చేయడంపైనా విమర్శలు
 
సాక్షి, హైదరాబాద్: ఒకపక్క రాష్ట్ర ప్రజలకు లోటు బడ్జెట్‌ను ప్రవేశపెట్టి.. మరోపక్క పేదల సంక్షేమానికి బడ్జెట్‌లో కోతలు పెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అదే సమయంలో ముఖ్యమంత్రి, మంత్రుల కార్యాలయాల్లో హంగుల కోసం కోట్ల రూపాయలను నీళ్లప్రాయంగా ఖర్చుచేస్తుండటం పట్ల రాష్ట్ర అధికార యంత్రాంగం విస్తుపోతోంది. సచివాలయంలో తొలుత సౌత్ హెచ్ బ్లాకులో ముఖ్యమంత్రి తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు పేరుతో రూ. 10 కోట్ల రూపాయలను వ్యయం చేశారు. అయితే.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆ కార్యాలయం వాస్తు బాగా లేదనే పేరుతో సీఎం కార్యాలయాన్ని ఎల్ బ్లాకులోని 8, 7 అంతస్థులకు మార్చిన విషయం తెలిసిందే.

ఇక్కడ సీఎం కార్యాలయంలో వసతులు, మరమ్మతుల కోసం ఏకంగా రూ. 15 కోట్లు వ్యయం చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని సచివాలయాన్ని కేవలం పది సంవత్సరాల పాటు మాత్రమే తాత్కాలిక రాజధానిగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. అలాంటిది ఇక్కడ సీఎం కార్యాలయం కోసం ఇన్ని కోట్ల రూపాయలు వ్యయం చేయడం పట్ల అధికార యంత్రాంగం విస్మయం వ్యక్తం చేస్తోంది.

ఇక్కడ వ్యయం చేసిన ప్రతి పైసా వృథాయేనని, తిరిగి పైసా కూడా రాదని తెలిసి కూడా కోట్ల రూపాయలను ఈ విధంగా వ్యయం చేయడం ఏమిటనేది అధికారుల ప్రశ్నగా ఉంది. సచివాలయంలో సీఎం కార్యాలయం పేరుతో రూ. 25 కోట్లు వెచ్చించారని.. ఇక సీఎం క్యాంపు కార్యాలయమైన లేక్‌వ్యూ, ముఖ్యమంత్రి ఇంటికి మరమ్మతుల కోసం మరో రూ. 10 కోట్లు ఖర్చు చేశారని అధికార వర్గాలు తెలిపాయి.
 
ఆ రూ. 35 కోట్లతో కొత్త కార్యాలయమే కట్టుకోవచ్చు..
ఒకపక్క రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ప్రజల నుంచి విరాళాలు వసూలు చేస్తూ.. మరోపక్క ఈ విధంగా హైదరాబాద్‌లో తాత్కాలిక కార్యాలయాల కోసం ఏకంగా రూ. 35 కోట్లు వ్యయం చేయడం అధికార యంత్రాంగాన్ని నివ్వెరపరుస్తోంది. ఇదే రూ. 35 కోట్ల ఖర్చుతో రాష్ట్ర నూతన రాజధానిలో ఏకంగా సకల హంగులతో సరికొత్తగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని నిర్మించుకోవచ్చునని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. పైగా.. ఈ మరమ్మతుల పనులన్నీ కూడా నామినేషన్ పేరుతో ఇచ్చేశారని, వీటికి లెక్కా పత్రం లేకుండా పోయిందని చెప్తున్న అధికారులు.. కేవలం మరమ్మత్తుల కోసం ఇంత పెద్ద మొత్తం ఎలా ఖర్చవుతుందన్న సందేహాలూ వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్ చాటున ఇందులో సగానికిపైగా సగం కమిషన్ల రూపంలో చేరాల్సిన వారికి చేరి ఉంటాయనే అనుమానాన్ని కూడా అధికార యంత్రాంగం వ్యక్తంచేస్తోంది.

మంత్రి చాంబర్‌లో టీవీ ధర రూ. 4.10 లక్షలు...
ముఖ్యమంత్రి సదుపాయాలకే ఇంత వ్యయమైతే.. ఆయన మంత్రివర్గ సహచరులు కూడా అదే బాటలో నడుస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు చాంబర్‌లో టీవీ కోసం ఏకంగా రూ. 4.10 లక్షలు వ్యయంచేశారు. ఎల్‌ఈడీ టీవీ ఏర్పాటు కోసం ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పి.వి.రమేశ్ ఈ నెల 1వ తేదీన రూ. 4.10 లక్షలు విడుదల చేశారు. అలాగే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికే ఏకంగా రూ. 30 కోట్ల ప్రభుత్వ ధనాన్ని వ్యయం చేశారని, జిల్లా కలెక్టర్ల సదస్సు పేరుతో మరో రూ. 60 లక్షలు వ్యయం చేశారని కూడా అధికారులు గుర్తుచేస్తున్నారు.

ఒకపక్క బడ్జెట్‌లో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, పేదల పింఛన్లు, సబ్సిడీ బియ్యానికి నిధుల కేటాయింపుల్లో కోతలు పెట్టారని.. మరోపక్క రాజధాని కోసం ప్రజల నుంచి చందాలు వసూలు చేస్తూ.. ఇంకో పక్క హైదరాబాద్‌లో తాత్కాలిక కార్యాలయాల కోసం ఇన్ని కోట్ల రూపాయలను వ్యయం చేయడాన్ని ప్రభుత్వం ఏ విధంగా సమర్థించుకుంటుందో అర్ధంకావడం లేదని అధికార వర్గాలతో పాటు, ఆర్థిక నిపుణులూ తీవ్రంగా తప్పుపడుతున్నారు.
 
 సచివాలయంలో సీఎం కార్యాలయాల మరమ్మతుల కోసం ఏపీ సర్కారు విడుదల చేసిన నిధుల వివరాలివీ...
 - సౌత్ హెచ్ బ్లాకులో సీఎం కార్యాలయం కోసం 26-04-2014న జీవో 426 జారీతో రూ. 3.29 కోట్లు విడుదల
 - సౌత్ హెచ్ బ్లాకులో సీఎం కార్యాలయం కోసం 05-05-2014న జీవో 440 జారీతో రూ. 1.71 కోట్లు విడుదల
 - సౌత్ హెచ్ బ్లాకులో సీఎం కార్యాలయం కోసం 14-05-2014న జీవో 447 జారీతో రూ. 4.93 కోట్లు విడుదల
 - ఎల్ బ్లాక్‌లో సీఎం కార్యాలయం కోసం 28-06-2014న జీవో 541 జారీతో రూ. 10 కోట్లు విడుదల
 - ఎల్ బ్లాక్‌లో సీఎం కార్యాలయం కోసం 11-08-2014న జీవో 605 జారీతో రూ. 5 కోట్లు విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement