- జిల్లా అదనపు జడ్జి బి.రామారావు
కైకలూరు : ప్రణాళికాబద్ధంగా లక్ష్యాన్ని నిర్ధారించుకుని కష్టపడి పనిచేస్తే విజయం తనంతట తానే వరిస్తుందని జిల్లా 11వ అధనపు జడ్జి బొడ్డెపల్లి రామారావు చెప్పారు. కైకలూరు కోర్డులో అందుతున్న సేవలు, రికార్డులను వార్షిక తనిఖీల్లో భాగంగా ఆయన శుక్రవారం పరిశీలించారు. అనంతరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు.
బార్ అధ్యక్షులు గురజాడ ఉదయశంకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జడ్జి మాట్లాడుతూ సమాజంలో న్యాయవ్యవస్థ ఎంత సమర్థవంతంగా పనిచేస్తే పరిపాలన అంత బాగుంటుందన్నారు. న్యాయవాద వృత్తి ఎంతో పవిత్రమైనదని చెప్పారు. వీరికి నాణేనికి రెండు వైపుల మాదిరిగా... కేసుకు సంబంధించి రెండు పక్షాల వాదనలు తెలుస్తాయన్నారు. ఎప్పటి కప్పుడు మారుతున్న చట్టాలను లాయర్లు అవగాహన చేసుకోవాలని కోరారు.
బార్ సభ్యులు రెండు నెలలకు ఒక పర్యాయం శిక్షణా తరగతులు నిర్వహించుకుంటే వృత్తి నైపుణ్యం మరింత పెరుగుతుందన్నారు. పూర్వకాలంలో వ్యాసమహర్షి రచించిన గ్రంథంలో న్యాయవ్యవస్థ గురించి చక్కగా వివరించారన్నారు. బ్రిటీష్ పాలకులు వాటిని అధ్యయనం చేసి ఇంగ్లిష్‌లో తర్జుమా చేశారని చెప్పారు. వేద కాలం నుంచే చట్టాలు భారతదేశంలో ఉన్నాయని, శ్లోకాలతో సహా ఉదాహరణలతో ఆయన వివరించడం ఆకట్టుకుంది. సీనియర్ న్యాయవాధులు తుమ్మలపల్లి బాలకృష్ణారావు, గొర్తి ప్రభాకరదీక్షితులు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయాలని కోరారు.
కైకలూరు కోర్టు ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ జి.లక్ష్మీ వరప్రసాద్, ఏపీపీ బాబురావు, ఏజీపీ కారే శరత్‌బాబు, ప్రభుత్వ ఉచిత న్యాయ సలహాదారు మోరు శ్రీనివాసరావు, సీఐ డి.వెంకటేశ్వరరావు, టౌన్ ఎస్సై దాడి చంద్రశేఖర్, న్యాయవాధులు ఏవీ.రమణ, టి.శ్రీనివాసరావు, విఎస్‌ఆర్.మూర్తి, బి.ప్రసాదరావు, ఆర్.రత్నారావు, ఇందిరా, లక్ష్యణరావు, ఎంఎస్‌ఎస్.రాజు, పవన్ పాల్గొన్నారు.
కొల్లేరు పక్షుల అందాలు అద్భుతం...
ఆటపాక పక్షుల కేంద్రం వద్ద పక్షులు ఎంతో అద్భుతంగా ఉన్నాయని జడ్జి బి.రామారావు అన్నారు. కైకలూరు కోర్డు తనిఖీ నిమిత్తం వచ్చిన ఆయన ఆటపాక పక్షుల కేంద్రాన్ని సందర్శించారు. బోటు షికారు చేసి పక్షుల ఆందాలను దగ్గరుండి తిలకించారు. శ్రీ శ్యామలాంబ అమ్మవారి దేవస్థానాన్ని దర్శించుకున్నారు.