=పలువురి పట్టాలు రద్దు చేసిన కలెక్టర్
=మరో మూడు కేసుల నమోదు
=వివాదాలన్నీ మూడు గ్రామాల్లోనే
=అధికారుల చెంతకు రైతుల పరుగులు
జిల్లాలో ఇనామ్ భూముల వివాదాలు పెరుగుతున్నాయి. తాజాగా మరో మూ డు కేసులు తెరపైకి వచ్చాయి. ఈ పరిస్థితుల్లో రైత్వారీ పట్టాలు పొందిన రైతుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
చిత్తూరు(జిల్లాపరిషత్), న్యూస్‌లైన్: గతంలో రాజులు, జమిందార్లు వివిధ కులాల వా రికి ఇనామ్‌గా భూములు కేటాయించారు. ఇవి కాలక్రమంలో చేతులు మారుతూ వచ్చాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇనామ్ రద్దు చట్టం అమలులోకి వచ్చింది. భూమి అనుభవదారులకే రైత్వారీ పట్టాలిస్తూ వచ్చారు. జిల్లాలో ఇనామ్ భూములను అక్రమ పద్ధతుల్లో పొందిన వారికి సంబంధించి రైత్వారీ పట్టాలను రద్దు చేస్తూ కలెక్టర్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.
తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామంలోని 28 సర్వే నంబర్ల పరిధిలో సుమారు 15.5 ఎకరాలకు సంబంధించి 11 మందికి ఇచ్చిన ఇనామ్ పట్టాలను రద్దు చేశారు. రేణిగుంట మండలంలోని ఎర్రమరెడ్డిపాళెంలోని 8 సర్వే నంబర్ల పరిధిలో 65.37 ఎకరాలకు 129 మంది అక్రమంగా పొందిన పట్టాలను కలెక్టర్ రద్దు చేశారు. అదే విధంగా చిత్తూరు కలెక్టరేట్‌లోని ఇనామ్ డెప్యూటీ తహశీల్దార్ ఆర్.ముస్తాఫాఖాన్ సస్పెండ్ అయ్యారు. ఈ క్రమంలో భూములు తమపేరుతో ఉన్నాయా లేవా అని గతంలో ఇనామ్ భూములకు రైత్వారీ పట్టాలు పొందిన రైతులు ఇనామ్ డెప్యూటీ తహశీల్దార్ కార్యాలయానికి పరుగులు తీస్తున్నారు.
మూడు కేసుల నమోదు!
కలెక్టర్ రాంగోపాల్ ఆదేశాలు జారీ చేసిన వారం రోజుల వ్యవధిలో మూడు కేసులు నమోదైనట్లు సమాచారం. ఇవి తిరుపతి పరిసర ప్రాంతాలైన తిరుచానూరు, రేణిగుంట మండలాల్లోనే దాఖలు కావడం గమనార్హం. సదరు కేసుల్లో గతంలోనే పట్టాలు ఇచ్చి ఉండవచ్చని అధికారులు తెలిపారు.
మూడు గ్రామాల్లోనే వివాదాలు
జిల్లాలో ఇనామ్ గ్రామాలు 9 ఉన్నాయని, వాటిల్లో 3 గ్రామాల్లోనే వివాదాలు నెలకొన్నాయని ఇనామ్ డీటీ సత్యవతి తెలిపారు. ఇందులో తిరుపతి రూరల్ మండలంలోని తిరుచానూరు, రేణిగుంట మండలంలోని ఎర్రమరెడ్డిపాళెం, బైరె డ్డిపల్లె మండలంలోని కైగల్ గ్రామాలు ఉన్నాయన్నారు. తిరుచానూరు, ఎర్రమరెడ్డిపాళెం గ్రామాల్లో వివాదాలు ఎక్కువగా పుట్టుకు వస్తున్నాయని వివరించారు. అలాగే తిరుపతి రూరల్‌లోని కొంకాచెన్నయ్యపల్లెలో చిన్నపాటి వివాదాలు ఉన్నాయని తెలిపారు. ములకలచెరువు, మదనపల్లె, పెనుమూరు మండలాల్లోని ఎస్.ఆర్.పట్టెడ(సంజీవరాయుని పట్టెడ), కదిరినాథునికోట, నడిగడ్డ తిమ్మపల్లె, అమ్మవారిపల్లె, పన్నయ్యగారిపల్లెల్లో ఎలాంటి వివాదాలూ లేవని అధికారులు అంటున్నారు.
తెరపైకి మరిన్ని ‘ఇనామ్’ వివాదాలు
Published Sun, Dec 15 2013 4:07 AM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM
Advertisement
Advertisement