‘మోరి’లో నగదే మోర్
♦ వారం క్రితం నగదు రహిత స్మార్ట్ విలేజ్‌గా ప్రకటించిన ప్రభుత్వం
♦ పలువురికి మరుగుదొడ్లు లేకపోయినా ఓడీఎఫ్ గ్రామంగా ప్రకటన
సాక్షి ప్రతినిధి, కాకినాడ: మోరి... తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ఒక మారుమూల గ్రామం. జీడిపప్పు తయారీ, చేనేత రంగాల్లో ఈ గ్రామం పేరుగాంచింది. గ్రామస్థుల్లో 60 శాతం మంది ఈ రంగాలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇక్కడ 1,189 కుటుంబాలు ఉన్నాయి. 4,381 మంది జనాభా ఉన్నారు. గత నెల 29వ తేదీన మోరి గ్రామాన్ని రాçష్ట్ర ప్రభుత్వం నగదు రహిత స్మార్ట్ విలేజ్‌గా ప్రకటించింది. పనిలో పనిగా రాష్ట్రంలోనే తొలి నగదు రహిత గ్రామం, బహిరంగ మలమూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ్) గ్రామంగా కూడా ప్రకటించింది. క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నట్లు స్పష్టమైంది. నగదు రహిత గ్రామంగా ప్రకటించిన తరువాత కూడా మోరిలో దాదాపు అన్నీ లావాదేవీలు నగదుతోనే జరుగుతున్నాయి.
శిక్షణ తర్వాతా గందరగోళమే...
మోరిని నగదు రహిత గ్రామంగా ప్రకటించడానికి నెల రోజుల ముందు నుంచే డ్వాక్రా మహిళలకు అధికారులు శిక్షణా తరగతులు నిర్వహించి, అవగాహన కల్పించారు. అయినా నగదు రహిత లావాదేవీలపై వారు ఆసక్తి చూపడం లేదు. డ్వాక్రా సంఘాల్లో 813 మంది మహిళలు సభ్యులుగా ఉండగా.. వీరిలో 250 మంది నిరక్షరాస్యులు. సొంతంగా స్మార్ట్‌ఫోన్లు కొనుక్కున్న వారు 95 మంది. 649 మందికి ప్రభుత్వం స్మార్ట్‌ఫోన్లు కొనిచ్చింది. ఇచ్చిన ఫోన్లు రెండు రోజులు పనిచేశాయని, మూడో రోజు నుంచే మూలనపడ్డాయని మహిళలు చెప్పారు. స్మార్ట్‌ఫోన్లు ఎందుకు ఇచ్చారో అర్థం కావడం లేదని కొందరు, వాటిని ఎలా వాడాలో తెలియదని ఇంకొందరు చెబుతున్నారు.
రేషన్ దుకాణాల్లోనూ నగదే
మోరిలో ఉన్న మూడు చౌకధరల దుకాణాల పరిధిలో 1,183 రేషన్ కార్డులున్నాయి. నగదు రహిత గ్రామంగా ప్రకటించక ముందు నుంచీ రేషన్ దుకాణాల్లో పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) యంత్రాల ద్వారా నగదు రహితంగా లావాదేవీలు జరుపుతున్నారు. కానీ, అవి కూడా పూర్తిగా పనిచేయడం లేదు. గతంలో రోజుకు 100 మందికి రేషన్ పంపిణీ చేసే డీలర్లు నగదు రహిత విధానంలో పాతిక మందికి కూడా సరుకులు ఇవ్వలేకపోతున్నారు. సర్వర్ సమస్యతో మిషన్లు పనిచేయక నగదుతోనే లావాదేవీలు నిర్వహిస్తున్నారు
264 మందికి మరుగుదొడ్లులేవు
బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా ప్రకటించిన మోరిలో వ్యక్తిగత మరుగుదొడ్లు లేని వారు 264 మంది ఉన్నారు. వీటిని ప్రభుత్వం మంజూరు చేయగా ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. అయినా, బహిరంగ మలమూత్ర విసర్జనరహిత గ్రామంగా ప్రకటించేశారు.
70 శాతం నగదుతోనే..
‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు మా మెడికల్ షాపులోనే నగదు రహిత లావాదేవీలను ప్రారంభించారు. మా వద్దకు రోజూ 90 నుంచి 100 మంది కస్టమర్లు వస్తుంటారు. 30 శాతం మంది మాత్రమే నగదు రహితంగా మందులు కొనుగోలు చేస్తుండగా, 70 శాతం మంది నగదుతోనే కొంటున్నారు’’
– మనోజ్, గంగన్న మెడికల్ స్టోర్స్, మోరి
స్మార్ట్‌ఫోన్ రెండు రోజులే పని చేసింది
‘‘నేను మా ఇంటి వద్దనే కాఫీ హోటల్ నడుపుతున్నాను. మా కస్టమర్లలో ఎక్కువ మంది కూలీలు. వారు ఆదరాబాదరగా టిఫిన్ చేసి, టీ తాగి వెళ్లిపోతుంటారు. వారికి నగదు రహిత లావాదేవీలపై అవగాహన ఉండదు. వీటికని ప్రభుత్వం ఇచ్చిన స్మార్ట్‌ఫోన్ రెండు రోజులే పని చేసింది’’
– బళ్ల పద్మావతి, హోటల్ నిర్వాహకురాలు