ప్రభుత్వ ముద్రణాలయ అభివృద్ధికి కృషి
కర్నూలు (ఓల్డ్‌సిటీ): పాత బస్టాండు సమీపంలోని ప్రభుత్వ ముద్రణాలయ అభివృద్ధికి కృషి చేస్తానని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక అన్నారు. ఫ్లోరింగ్, డ్రైనేజీ, మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులిస్తానని హామీ ఇచ్చారు. ఉద్యోగ సంఘాల నాయకుల ఆహ్వానం మేరకు శనివారం ఆమె ముద్రణాలయాన్ని పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న ముద్రణాలయాన్ని, నిరుపయోగంగా ఉన్న మరుగుదొడ్లు, డ్రైనేజీ వ్యవస్థను, కుంగిపోయిన బండ పరుపును పరిశీలించారు. దీనిపై స్పందించి నిధులు మంజూరు చేస్తున్నట్లు ఎంపీ ప్రకటించారు.
ప్రతిపాదనలు పంపాలని అసిస్టెంట్ మేనేజర్ కె.సురేందర్‌బాబును కోరారు. ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ కర్నూలులో దివ్యాంగుల కోసం నిర్మించతలపెట్టిన సెన్సరీ పార్క్‌ను సీతారామనగర్‌లోని ప్రభుత్వ ముద్రణాలయ స్థలంలో కాకుండా వేరేచోట నిర్మించాలని ఎంపీతో విన్నవించుకున్నారు. స్థల విస్తీర్ణం ఏడెకరాలు కాదని, 4.34 ఎకరాలు మాత్రమేనని, గతంలోనే ప్రెస్ కొత్త భవనం నిర్మాణానికి రూ. ఏడు కోట్ల నిధులు కూడా మంజూరైనట్లు తెలిపారు. ఎంపీ బుట్టా రేణుక వెంటనే స్పందించి మానిటరీ సర్వే కమిటీ అధికారి (దివ్యాంగ సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ పర్సనల్ సెక్రటరీ) రమేశ్ కుమారంతో ఫోన్లో మాట్లాడారు.
సెన్సరీ పార్కు కోసం శుక్రవారం పరిశీలించిన స్థలం బదులుగా వేరే స్థలాన్ని చూడాలని కోరారు. అనంతరం ఆమె ఉద్యోగులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని మీరు జిల్లా కలెక్టర్‌తో కూడా విన్నవించుకోవాలని సూచించారు. ఆమె వెంట మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, రాష్ట్ర మైనారిటీ, ఎస్సీసెల్ విభాగాల కార్యదర్శులు రహ్మాన్, సి.హెచ్.మద్దయ్య, పార్టీ నగర అధ్యక్షుడు పి.జి.నరసింహులు యాదవ్, పార్టీ నాయకులు బోదేపాడు భాస్కర్‌రెడ్డి, వైఎస్‌ఆర్ ట్రేడ్ యూనియన్ నాయకులు కటారి సురేశ్‌కుమార్, కిశోర్, మౌలాలి, సవారి, లాలు, బుజ్జి, గవర్నమెంట్ ప్రెస్ వైఎస్‌ఆర్‌టీయూసీ నాయకులు రవీంద్రస్వామి, బి.ఎస్.శ్రీనివాసులు, మహేశ్వరరెడ్డి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.