
'దారి మళ్లించి అయినా రైళ్లను నడుపుతాం'
విజయవాడ : సీమాంధ్రలో విద్యుత్ ఉద్యోగుల సమ్మె ప్రభావం దక్షిణ మధ్య రైల్వేపై పడింది. దాంతో ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా ఇతర సబ్ స్టేషన్ల నుంచి విద్యుత్ సరఫరాను పునరుద్దరించుకుంటోంది. పరిస్థితి చేయి దాటిపోతే దారి మళ్లించి అయినా రైళ్లను నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
కాగా విజయవాడ-గూడూరు మధ్య ప్యాసింజర్ రైలుతో పాటు, విజయవాడ-మచిలీపట్నం మధ్య రెండు ప్యాసింజర్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది. మరోవైపు పూర్తిస్థాయిలో గూడ్స్ రవాణా నిలిచిపోయింది. కాగా శ్రీకాకుళంలో విద్యుత్ సరఫరా అంతరాయంతో ఆముదాలవలస వద్ద విశాఖ ఎక్స్ప్రెస్తో పాటు రెండు గూడ్స్ రైళ్లు నిలిచిపోయాయి.
రైల్వే లైన్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో విజయవాడ, గుంతకల్ తదితర డివిజన్లలో ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోయాయి. నిన్న తెల్లవారుజామున 5.30 నుంచి 6.30 గంటల మధ్య రైళ్లు ఒక్కటి కూడా కదలలేదు. ఇప్పటికే బస్సులు లేకపోవడంతో రైళ్లపైనే ఆధారపడుతున్న ప్రయాణికులు, దీంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇదిలాఉండగా, చెన్నై నుంచి పది డీజిల్ ఇంజన్లను రప్పించి నెల్లూరు జిల్లా పడుగుపాడు లూప్‌లైన్లో ఉంచారు.
రద్దయిన రైళ్లు: విద్యుత్ అంతరాయం వల్ల సోమవారం కూడా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ‘చెన్నై-విజయవాడ, పినాకిని ఎక్‌సప్రెస్: చెన్నై- విజయవాడ, శతాబ్ది ఎక్‌సప్రెస్: విజయవాడ-బిట్రగుంట, బిట్రగుంట-చెన్నై, చెన్నై-గూడూరు, విజ యవాడ-యశ్వంత్‌పూర్, యశ్వంత్‌పూరు-విజయవాడ(8వతేదీ), గుంటూరు-కాచిగూడ, నర్సాపూర్-తిరుపతి, తిరుపతి- మచిలీపట్నం’ రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది.
రైళ్ల సమాచారం తెలుసుకోవడానికి విజయవాడ డివిజన్ పరిధిలోని కొన్ని రైల్వేస్టేషన్లలో హెల్ప్లైన్ సెంటర్లను ప్రారంభించినట్లు రైల్వే ముఖ్య పౌర సంబంధాల అధికారి ఎఫ్.ఆర్.మైకేల్ తెలిపారు.
విజయవాడ:0866-2576796, 0866-2575038, 9701373073
నెల్లూరు:0861-234866, 2345864
ఒంగోలు:08592-280202, 280203
రాజమండ్రి:0883-2420541, 24205543