‘మాతా, శిశు మరణాలు తగ్గించాలి... ఇవి ఎక్కడా చోటు చేసుకోకూడదు...’ వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల సమీక్షలో ఉన్నతాధికారులు ఎప్పుడూ చెప్పే మాటలివి.
నెల్లూరు (అర్బన్): ‘మాతా, శిశు మరణాలు తగ్గించాలి... ఇవి ఎక్కడా చోటు చేసుకోకూడదు...’ వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల సమీక్షలో ఉన్నతాధికారులు ఎప్పుడూ చెప్పే మాటలివి. జిల్లా అధికారులు దీనిపై వారానికో, పదిహేను రోజులకో సమావేశాలు పెట్టి మరీ ఏమేం చర్యలు తీసుకోవాలో చెబుతుంటారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గతేడాదితో పోల్చుకుంటే జిల్లాలో మాతా, శిశు మరణాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే యంత్రాంగం ఎలా పనిచేస్తుందో అర్థమవుతోంది.
ఇప్పటికే 38 నమోదు
జిల్లావ్యాప్తంగా 74 పీహెచ్‌సీలుండగా ఇందులో 24 /7 పీహెచ్‌సీలు 28 ఉన్నాయి. వీటిలో, ఏరియా ఆసుపత్రుల్లో, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇప్పటి వరకు మాతా మరణాలు 38 చోటుచేసుకోగా శిశు మరణాలు 420 వరకు ఉన్నాయి. గతేడాదిలో మాతా మరణాలు 36, శిశు మరణాలు 487 చోటు చేసుకున్నాయి. ఈ సంవత్సరానికి సంబంధించి ఇంకా అధికారులు మార్చి నెల లెక్కలు తీసుకోవాల్సి ఉంది. పూర్తిస్థాయిలో వీటి తగ్గింపునకు తీసుకున్న చర్యలు దాదాపుగా శూన్యమనే చెప్పొచ్చు. జిల్లావ్యాప్తంగా హైరిస్క్ మదర్స్ గుర్తింపు చాలా తక్కువగా ఉంది.
సాధారణంగా హైరిస్క్ మదర్స్‌ను గుర్తించి వారికి 9వ నెల వచ్చే లోపు నాలుగు సార్లు డాక్టర్ పరిశీలించాల్సి ఉంటుంది. వారికి ఎస్కార్ట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఏ ఆసుపత్రిలో డెలివరీ చేయించుకోవాలో చెప్పేందుకు బర్త్‌ప్లానింగ్ వేయాలి. అయితే జిల్లావ్యాప్తంగా ఎక్కడా ఇది సరిగ్గా అమలు కావడంలేదు. సుమారు నెలరోజుల క్రితం సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ఎంసీటీఎస్ (మదర్ అండ్ చైల్డ్ ట్రాకింగ్ సిస్టమ్)పై సమీక్ష నిర్వహించినప్పుడు ఈ విషయం బయటపడింది.
హైరిస్క్ మదర్స్‌ను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో క్లస్టర్ల పరిధిలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. అలాగే డబుల్ ఎంట్రీలు ఉన్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులే ఒప్పుకుంటున్నారు. హైరిస్క్ మదర్‌కు ఎస్కార్ట్ ఏర్పాటు చేస్తే మాతా, శిశు మరణాలు చాలావరకు తగ్గుతాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ఎస్కార్ట్ పెట్టడం ద్వారా వారి ఆరోగ్య పరిస్థితి ఏంటి అనే విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. జిల్లాస్థాయిలో సమావేశాలు పెట్టి మరీ డీఎంహెచ్‌ఓ ఎస్కార్ట్‌ను ఏర్పాటుచేయాలని చెబుతున్నప్పటికీ అధికారులు దీనిని సీరియస్‌గా తీసుకోవడంలేదు. అలాగే కొన్ని మాతా, శిశు మరణాల వివరాలను జిల్లా కార్యాలయానికి చేరవేయడం లేదనే ఆరోపణలున్నాయి. ఈనెలాఖరులోగా కలెక్టర్ మరోమారు మాతా, శిశు మరణాలపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మరణాలు తగ్గాలంటే ఉన్నతాధికారులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.