తెనాలి: 1965 ఇండో–పాకిస్తాన్ యుద్ధంతో ప్రాణాలు కోల్పోయిన సైనికుడి కుటుంబంపై ప్రభుత్వం నిరాదరణ చూపుతోంది. మాజీ సైనికుల కోటాలో వ్యవసాయ భూమిని ఇచ్చినట్టే తిరిగి స్వాధీనం చేసుకుంటోంది. ఆ భూమి కోసం కన్న తల్లి 52 ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉంది.
ఆమె పేరు తోట వెంకాయమ్మ. వయసు 87 ఏళ్లు. భర్త 30 ఏళ్ల క్రితమే మరణించాడు. గంగానమ్మపేటలో ఇల్లు మినహా మరేం లేదు. ఎదిగి, స్థిరపడిన బిడ్డల వద్ద ఉంటోంది. ఆమె నలుగురు కుమారుల్లో ఒకరైన తోట వీరనాగప్రసాద్ సైన్యంలో చేరాడు. 1965లో పాకిస్తాన్‌తో యుద్ధంలో మరణించాడు. 1966లో ప్రభుత్వం చినగంజాంలో వర్షాధారమైన 2.5 ఎకరాల (సర్వే నంబరు.701/1) భూమి కేటాయించింది. ప్రస్తుతం ప్రకాశం జిల్లా పరిధిలోని ఈ ఊరు అప్పట్లో గుంటూరు జిల్లాలోనే ఉండేది. వీరనాగప్రసాద్ అవివాహుతుడు కావటంతో ఆ భూమిని తల్లి వెంకాయమ్మకు ఇచ్చారు. ప్రభుత్వం అవసరాలకంటూ మూడేళ్లకు ఆ భూమిని వేరొకరికి ఇచ్చేసి, అక్కడే సర్వే నంబరు 704/2లో 2.5 ఎకరాల భూమిని కేటాయించారు. 1982లో దానినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, సర్వే నంబరు 396/4, 396/5లో 2.85 ఎకరాల చెరువు భూమి ఇచ్చారు. ఒండ్రు మట్టితో ఉండే ఆ భూమి సుభిక్షమైందని నమ్మించారు.
కోర్టు చుట్టూ తిప్పిన ప్రభుత్వం
అయితే చెరువు భూమి పంచాయతీదేనని, రెవెన్యూకు సంబంధం లేదని వెంకాయమ్మ కుటుంబ సభ్యులను ఆ భూమిలోకి ప్రవేశించకుండా నిరోధించారు. న్యాయస్థానాన్నీ ఆశ్రయించారు. తన ప్రమేయంలేని వ్యవహారంలో కోర్టు వాయిదాలకు వెంకాయమ్మ తిరగాల్సి వచ్చింది. చేతి చమురూ వదిలింది. కోర్టులో ఫలితం పంచాయతీకి అనుకూలంగా రావటంతో ప్రభుత్వమిచ్చిన భూమినీ కోల్పోయింది. ఇదే విషయాన్ని వెల్లడిస్తూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి ప్రకాశం జిల్లా కలెక్టర్ కె.దేవానంద్, వెంకాయమ్మ కుటుంబం తెనాలివాసులు అయినందున వారికి గుంటూరు జిల్లాలోనే వ్యవసాయ భూమిని కేటాయించాలంటూ 2009 ఏప్రిల్ 13న లేఖ రాశారు. 2016 ఫిబ్రవరి 15న వీరి అభ్యర్థనపై చర్యల కోసం తెనాలి ఆర్డీవో కార్యాలయానికి చేరింది.
తహసీల్దార్లను ఆదేశించినా..
వీరనాగప్రసాద్ కుటుంబానికి భూమిని కేటాయించేందుకు డివిజనులో అనువైన భూములపై నివేదికను కోరుతూ ఆర్డీవో తహసీల్దార్లకు ఆదేశాలు పంపారు. ఇప్పటికీ నివేదిక ఏ దశలో ఉందో తెలీదు. గత సోమవారం తన మరో కుమారుడితో సహా ఆర్డీవో కార్యాలయానికి వచ్చిన వెంకాయమ్మ, ‘మీకోసం’లో తన సమస్యను మరోసారి విన్నవించుకున్నారు. సాధ్యమైనంత త్వరగా తమకు వ్యవసాయ భూమిని కేటాయించాలని అభ్యర్థించారు. ఆర్డీవో జి.నరసింహులు సానుకూలంగా పరిశీలిస్తానని హామీనిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment