మానవతా విలువల కంటే ఆర్థిక విలువలే గొప్పవైపోతున్నాయి. అనుబంధాలు ఆర్థిక బంధాల మధ్య ఇరుక్కుపోతున్నాయి. ఆఖరుకు పేగు బంధం కూడా డబ్బు కట్టలకు లోకువైపోతోంది. సంతల్లో మేక పిల్లలను అమ్మినట్లు రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలను పురిటిలోనే అమ్మేస్తున్నారు. అమ్మా అన్న పిలుపు వినక ముందే అమ్మానాన్నలను మార్చేస్తున్నారు. జిల్లాలో ఈ దౌర్భాగ్యపు వ్యాపారం జోరుగా సాగుతోంది. అమ్మ ఒడే అంగడిగా మారుతోంది. పేదరికం, అధిక సంతానం దీనికి ప్రధానకారణంగా నిలుస్తోంది.
విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్: అప్పుడే కళ్లు తెరిచిన పసిగుడ్డు పచ్చనోట్లకు బలైపోతోంది. రక్తం పంచిన వారికి దూరమైపోతోంది. కష్టాల పేరుతో కొందరు తల్లిదండ్రులు కన్న బిడ్డలను అమ్మకానికి పెడుతున్నా రు. ప్రేమ అనే మాట మరిచిపోయి బంధాన్ని పక్కకు నెట్టి పసిపిల్లలను అంగడి సరుకులా విక్రయిస్తున్నారు. ఆడపిల్లకు ఇంత రేటు, మగపల్లవాడికి మరో రేటు అని చెప్పి సంతలో సరుకులు అమ్మినట్లు విక్రయిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రులు, ఘోషా ఆస్పత్రి ఈ దౌర్భాగ్యపు వ్యాపారానికి కేంద్రాలవుతున్నాయి. ఈ ఆస్పత్రుల్లోని కింది స్థాయి సిబ్బందే దళారుల అవతారం ఎత్తి శిశు విక్రయాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ప్రతీనెలా కనీసం ఐదు నుంచి ఆరుగురు పిల్లలను ఇలా విక్రయిస్తున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంలో రూ.3 లక్షలకు పైగా చేతులు మారుతున్నట్టు తెలిసింది. ఎక్కువగా మగ పిల్లల విక్రయాలే సాగుతున్నట్టు తెలిసింది. వారసుడు వస్తాడన్న భావనతో మగ పిల్లలను తెచ్చుకోడానికే అధికశాతం మంది ఆసక్తి చూపుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ఈ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవలి కాలంలో ఇలాంటి కేసులు చాలా వెలుగులోకి వచ్చాయి. బాలల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన చైల్డ్‌లైన్ 1098 సంస్థకు ఇటీవల కొంతమంది ఫోన్‌లు చేసి సమాచారం అందిస్తుండడంతో శిశు విక్రయాలు గట్టు రట్టు అవుతోంది.
ఆడపిల్లకు *20వేలు, మగపిల్లవాడికి *50 వేలు
జంతువులైనా తమ బిడ్డలను వదిలి ఉండలేవు. కానీ ఇక్కడ కొంతమంది తల్లిదండ్రులు జంతువుల స్థాయిలో కూడా వ్యవహరించడంలేదు. ఆర్థిక కారణాలతో కొంత మంది విక్రయిస్తుంటే... పిల్లలపై అయిష్టతతో మరి కొంత మంది విక్రయాలకు పెడుతున్నట్లు సమాచారం. జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేటు ఆస్పత్రులతో పాటు, ఘోషా ఆస్పత్రిలో శిశు విక్రయాలు అధికంగా జరుగుతున్న ట్లు తెలిసింది. ఆస్పత్రుల్లో పనిచేస్తున్న దిగువస్థాయి సిబ్బం ది కమిషన్‌లకు కక్కుర్తి పడి పిల్లలు విక్రయానికి దళారుల అవతారం ఎత్తుతున్నారు. విక్రయించిన దాంట్లో 40 శాతం వరకు ఆస్పత్రి సిబ్బందే తీసుకున్నట్టు సమాచారం. దీంతో ఇటీవల చైల్డ్‌లైన్ 1098కు కొంత మంది ఫోన్‌లో ఫిర్యాదు చేస్తున్నారు.
శిశు విక్రయాలకు సంబంధించిన కొన్ని సంఘటనలు:
గత ఏడాది ఆగస్టులో పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి లో జన్మించిన శిశువును గుర్ల మండలానికి చెందిన వ్యక్తి రూ. 60 వేలుకు విక్రయించారు. దీనికి ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్న ఆయానే మధ్యవర్తిగా వ్యవహరించింది. దీనికి గాను ఆమెకు రూ. 15 వేల విలువ చేసే పట్టుచీర ఇచ్చినట్టు సమాచారం. గత ఏడాది అక్టోబర్ నెలలో పట్టణంలోని ఘోషా ఆస్పత్రిలో ఎల్.కోటకు చెందిన మహిళ మగ శిశువుకు జన్మని చ్చింది. ప్రసవానంతరం తల్లి చనిపోవడంతో శిశువును తండ్రే రూ. 80 వేలు విక్రయించేశాడు. దీనిపై చైల్డ్‌లైన్ 1098 కు ఫిర్యాదు అందింది. దీనిపై విచారణ జరుగుతోంది. గత ఏడాది నవంబర్‌లో గజపతినగరానికి చెందిన వెంకటరమణ, వెంకలక్ష్మిలకు చెందిన నాలుగో సంతానం అయిన కుమారుడిని అదే గ్రామానికి చెందిన వ్యక్తికి *60 వేలకు విక్రయించారు. ఈ విషయాన్ని పత్రికలు ప్రచురించడంతో ఐసీడీఎస్ అధికారులు, బాలల సంవరక్షణ విభాగం, చైల్డ్‌లైన్ అధికారులు గ్రామానికి వెళ్లి శిశువును స్వాధీనం చేసుకుని శిశు గృహాలో చేర్చారు. ఈ విక్రయంతో అంగన్‌వాడీ ఆయాకు సంబంధం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఆ పిల్లవాడు శిశుగృహాలో ఉన్నాడు.
గజపతినగరం మండలం గంగచోళ్ల పెంట గ్రామానికి చెందిన వెంకటరమణ, గౌరీలు చత్తీస్‌గఢ్‌కు చెందిన ఆడశిశువును రూ. 20 వేలు వరకు కొనుగోలు చేసినట్టు సమాచారం. దీనిపై ఓ వ్యక్తి చైల్డ్‌లైన్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో చైల్డ్‌లైన్ సభ్యులు గ్రామానికి వెళ్లి పాపను శిశు గృహాలో చేర్చారు. భోగాపురం మండలానికి చెందిన దంపతులు రూ. 20 వేలకు స్థానిక ఘోషా ఆస్పత్రిలో కొనుగోలు చేసినట్టు చైల్డ్‌లైన్ 1098కు ఈనెల 1వ తేదీన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీనిపై చైల్డ్‌లైన్ సభ్యులు విచారణ చేపడుతున్నారు. ఇవి వెలుగులోకి వచ్చిన వివరాలు, రానికి చాలా ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది.ఇదే విషయాన్ని ఐసీడీఎస్ పీడీ టీవీ శ్రీనివాస్ వద్ద‘ న్యూస్‌లైన్’ ప్రస్తావించగా శిశు విక్రయాలు చేయడం చట్ట రీత్యా నేరమని చెప్పారు. ఇటీవల జరిగిన శిశువుల విక్రయాలపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అమ్మ ఒడే...అంగడి!
Published Sat, Jan 4 2014 2:52 AM | Last Updated on Sat, Sep 2 2017 2:15 AM
Advertisement
Advertisement