
క్రీడాకారులను ప్రోత్సహించాలి : డీఎస్పీ
నూజివీడు, న్యూస్‌లైన్ : విద్యార్థి దశనుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని నూజివీడు డీఎస్పీ ఆరుమళ్ళ శంకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. స్థానిక ధర్మఅప్పారావు కళాశాల ఆవరణంలో శ్రీరాజా వెంకటాద్రి అప్పారావు బహద్దూర్ 38వ స్మారక రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలను గురువారం ఆయన ప్రారంభించారు. పోటీల్లో 11 జిల్లాలనుంచి 32 జట్లు పాల్గొన్నాయి.
డీఎస్పీ మాట్లాడుతూ మెరుగైన సౌకర్యాలు కల్పించి విద్యార్థి దశలోనే తర్ఫీదునిచ్చినపుడు గ్రామస్థాయి నుంచీ మేటి క్రీడాకారులు తయారవుతారన్నారు. నేడు తల్లిదండ్రులు చదువుకు ఇచ్చినంత ప్రాధాన్యత క్రీడలకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల ఆలోచనా విధానంలో మార్పుతేవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ప్రభుత్వ పరంగా క్రీడల అభివృద్ధికి తగిన ప్రోత్సాహం అవసరమని చెప్పారు. బాస్కెట్ పోటీలకు పుట్టినిల్లు అయిన నూజివీడులో 38ఏళ్లుగా టోర్నమెంటు నిర్వహించడం గర్వకారణమన్నారు. ప్రభుత్వం క్రీడల్లో రాణించిన వారికి ఉద్యోగాల్లో 3శాతం రిజర్వేషన్ కల్పిస్తుందని చెప్పారు. రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్న ఈ పోటీలను విజయవంతం చేయడంలో స్థానికుల పాత్ర ఎంతో ఉందన్నారు. ఈ పోటీల గురించి విస్తృతమైన ప్రచారం ఎంతో అవసరమని తెలిపారు. డీఏఆర్ కళాశాల చైర్మన్ ఎంఎంఆర్‌వీ అప్పారావు మాట్లాడుతూ బాస్కెట్‌బాల్‌కు నూజివీడు పుట్టినిల్లన్నారు.
దీని అభివృద్ధికి తన శాయశక్తులా కృషిచేస్తానన్నారు. అనంతరం క్రీడాకారులను డీఎస్పీ శంకర్‌రెడ్డికి పరిచయం చేశారు. టోర్నమెంట్లో భాగంగా ప్రారంభమ్యాచ్ ఏబీఏ నూజివీడు, చిత్తూరు జట్ల మధ్య జరిగింది. స్థానిక పీజీ సెంటరు ప్రత్యేకాధికారి మండవ వెంకట బసవేశ్వరరావు, కోస్తాంధ్ర కార్యదర్శి ప్రసాద్, డీఏఆర్ ప్రిన్సిపాల్ గొల్లు వెంకటరామారావు, పీడీ అంజాద్‌ఆలీ తదితరులు పాల్గొన్నారు.