కాంగ్రెస్ వైపు మోత్కుపల్లి చూపు?
హైదరాబాద్: రాజ్యసభ సీటు ఆశించి భంగపడిన టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు సమాచారం. మంత్రి జానారెడ్డి మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. మోత్కుపల్లి ఎంట్రీకి కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దళిత నేతను ఆహ్వానిస్తే ఇమేజ్ పెరుగుతుందని జానారెడ్డి వాదనలతో అధిష్టానం కూడా ఏకీభవించినట్లు తెలుస్తోంది. మోత్కుపల్లి రాకతో జిల్లాలో తనకూ కలిసి వస్తుందని జానారెడ్డి భావిస్తున్నారు.
మరోవైపు మోత్కుపల్లికి రాజ్యసభ సీటు దక్కకపోవడంపై నల్గొండ జిల్లాకు చెందిన ఆ పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కాలంగా పార్టీ కోసం కష్టపడుతున్న మోత్కుపల్లిని కాదని మరొకరికి రాజ్యసభ సీటు ఇవ్వడం మంచిది కాదని టీడీపీ నేతలు భావిస్తున్నారు. రాజ్యసభ సీటు దక్కకపోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబుపై మోత్కుపల్లి ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు. భవిష్యత్తు కార్యాచరణ కోసం నల్గొండ జిల్లా టీడీపీ నేతలు మోత్కుపల్లి నివాసానికి చర్చలు జరిపారు. మరి మోత్కుపల్లి సైకిల్ దిగి 'చేయి'అందుకుంటారో లేదో అనేది ప్రస్తుతానికి ఉత్కంఠే.