
తెలంగాణ ప్రాంతం ఉద్యమాలకు పురిటిగడ్డ
తెలంగాణ అనేది కొత్త రాష్ట్రం కాదని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ శుక్రవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో వెల్లడించారు. తెలంగాణ ప్రాంతం ఉద్యమాలకు పురిటిగడ్డ అని ఆయన అభివర్ణించారు. అలాగే ఎన్నో చారిత్రక ఉద్యమాలకు తెలంగాణ ప్రాంతం పుట్టినిల్లు అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం అనేది ఆత్మగౌరవానికి సంబంధించిన అంశంగా ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ ఎంత మాత్రం వ్యతిరేకం కాదని రాజనర్సింహ స్పష్టం చేశారు. ఆరు దశాబ్దాలుగా తెలంగాణ ఉద్యమం కొనసాగుతోందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. 60 ఏళ్ల తెలంగాణ కల త్వరలో సాకారం కానుందని తెలిపారు. హైదరాబాద్ నగరం తెలంగాణ ప్రాంతంలో అంతర్భాగమేనని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగ, విద్యా రంగాల్లో తెలంగాణ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరిగిందని రాజనర్సింహ ఆరోపించారు. విశాలాంధ్ర కావాలని తెలంగాణ ప్రజలు ఇప్పుడు కోరుకోవడం లేదని రాజనర్సింహ పేర్కొన్నారు.