మీ ‘వైస్రాయ్’ నాటకాలు గుర్తుకొస్తున్నాయి
సీఎం చంద్రబాబుకు ఎంపీ కేవీపీ లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: కమీషన్లు దండుకునేందుకే కేంద్రం వద్ద ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి.. పోలవరం పనుల బాధ్యత తీసుకున్నారంటూ సీఎం చంద్రబాబుపై కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రారావు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే కేంద్రం షరతులపైనా నోరు మెదపడం లేదని మండిపడ్డారు. కాఫర్ డ్యాంను ప్రధాన డ్యాంగా చూపుతూ ప్రజల్ని మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా చూస్తుంటే చంద్రబాబు వైస్రాయ్ నాటకాలు గుర్తుకొస్తున్నాయని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును తాను అడ్డుకుంటున్నట్టు నిరూపిస్తే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి.. వైదొలుగుతానని సవాల్ విసిరారు.
పోలవరం ప్రాజెక్టు గురించి సీఎం చంద్రబాబుకు కేవీపీ బహిరంగ లేఖ రాశారు. దీనిని ఆదివారం ఆయన మీడియాకు విడుదల చేశారు. ‘నేను ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నానని నిరూపిస్తే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి.. వైదొలుగుతా. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కేంద్ర జలవనరుల శాఖ అనుమతించిన డిజైన్‌ల స్థాయికి పూర్తిగా ప్రాజెక్టును నిర్మించి.. గ్రావిటీ ద్వారా కుడి, ఎడమ కాలువలకు 2019కల్లా నీళ్లు ఇవ్వగలిగితే.. నా శేష జీవితాన్ని మీకు భారతరత్న ఇప్పించేందుకు కృషి చేస్తాను..’ అని కేవీపీ పేర్కొన్నారు.