సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ ఉచ్చరించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన తరువాత.. ఇక దీనిలో నేరాన్ని వర్తింపజేసే అంశం ఎక్కడ ఉందని వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. నాన్ బెయిలబుల్ కేసు, మూడేళ్ల జైలు శిక్ష తదితర అంశాలతో కూడిన ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టం చేశారు. ట్రిపుల్ తలాక్ బిల్లుపై గురువారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘మా పార్టీ లింగ సమానత్వాన్ని కోరుకుంటోంది. మహిళా సాధికారత కోసం నిలబడింది. మహిళాభ్యున్నతికి పాటుపడుతోంది.
ఏపీ నూతన సీఎం ప్రారంభించిన అన్ని పథకాలు మహిళల అభ్యున్నతికి దోహదపడేవే. ఆయన మతసామరస్యం కోసం నిలబడే వ్యక్తి. సాధ్యమైన అన్ని మార్గాల్లో మహిళా సాధికారత కోసం మేం నిలబడుతాం. అయితే ప్రస్తుత రూపంలో ఈ బిల్లును మేం గట్టిగా వ్యతిరేకిస్తున్నాం. దీనికి మద్దతు ఇచ్చే పరిస్థితుల్లో లేం. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఎన్‌ఐఏ బిల్లు, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక బిల్లు తదితర ఏ బిల్లుకైనా మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీనిపై మాకు అభ్యంతరాలు ఉన్నాయి.
2017 ఆగస్టులో సుప్రీం కోర్టు ట్రిపుల్ తలాక్ చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. నాన్ బెయిలబుల్ కేసు వర్తింపజేయడం ఆర్టికల్ 14ను ఉల్లంఘించడమే అవుతుంది. హిందూ అయినా ముస్లిం అయినా క్రైస్తవులైనా చట్టం అందరికీ సమానంగా ఉండాలి. వివాహ బంధాల విషయంలో ఇబ్బందులు ఉన్నప్పుడు ఇప్పటికే గృహహింస నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్ 498ఏ తదితర చట్టాలున్నాయి. గృహహింస చట్టంలోని సెక్షన్ 20 ప్రకారం మహిళకు మెయింటెనెన్స్ చెల్లించాలి. భర్త జైలులో పడితే మహిళలకు సామాజిక ఆర్థిక సహకారం ఎలా అందుతుంది. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ సబ్ కా విశ్వాస్ అని చెబుతున్న ప్రభుత్వం దీనిలో మాత్రం విశ్వాస్ లేకుండా చేసింది. కొన్ని అభద్రతలు యువతను తీవ్రవాదం వైపు ప్రేరేపిస్తున్నాయి. ప్రభుత్వం పునఃపరిశీలించి అభ్యంతరాలను పరిష్కరించి బిల్లును పాస్ చేయాలి. మేం మహిళల సాధికారత, అభ్యున్నతి కోసం నిలబడుతున్నాము’ అని మిథున్‌రెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment