సాక్షి, తూర్పుగోదావరి: కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ బుధవారం కేంద్ర ఉక్కు, పెట్రోలియం - సహజ వాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను అధికారికంగా కలిశారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఓఎన్‌జీసీ కార్యకలాపాలపై ఆమె ఈ సందర‍్భంగా కేంద్రమంత్రితో చర్చించారు. ధర్మేంద్ర ప్రధాన్ కాకినాడ పార్లమెంట్ నియోజక వర్గాన్ని సందర్శించి.. అభివృద్ధికి కృషి చేయాలని కాకినాడ పార్లమెంట్ ప్రజల తరఫున ఎంపీ గీతా కోరారు.
జిల్లాలో కాకినాడ కేంద్రంగా కేజీ బేసిన్ ఆపరేషన్ కార్యకలాపాలు, ఓఎన్‌జీసీ ఈస్ట్రన్ ఆఫ్‌షోర్ అసెట్స్, కైర్న్ ఎనర్జీ లిమిటెడ్, రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్, ఆయిల్ ఇండియా లిమిటెడ్ కంపెనీల కార్యకలాపాలు కాకినాడ ప్రధాన కార్యాలయంగా (హెడ్ క్వార్టర్) జరుగుతున్నాయని ప్రధాన్‌కు...వంగా గీతా వివరించారు. అయితే కాకినాడ హెడ్ క్వార్టర్‌ను మార్చి వేరే చోటుకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారనే విషయంపై ఆమె... పెట్రోలియం మంత్రితో చర్చలు జరిపారు. మొత్తం కార్యకలాపాలు కాకినాడ కేంద్రంగా కొనసాగించాలని, కాకినాడను హెడ్ క్వార్టర్‌గా గుర్తించాలని కేంద్రమంత్రికి విన్నవించారు. అయితే కాకినాడనే హెడ్ క్వార్టర్‌గా గుర్తిస్తామని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. త్వరలోనే మళ్లీ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తానని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment