
సాక్షి, విశాఖపట్నం: కరోనా వైరస్ నివారణలో ప్రభుత్వానికి అండగా ఉండేందుకు ముందుకొచ్చిన పారిశ్రామిక వేత్తలకు ఎంపీ విజయసాయిరెడ్డి అభినందనలు తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నియంత్రణకు ఐఏఎస్ అధికారుల నుంచి.. కాంట్రాక్ట్ ఉద్యోగి వరకు ప్రభుత్వానికి తమ వంతు సాయం చేశారని పేర్కొన్నారు. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని చెప్పారు. రాష్ట్రంలో 58 ప్రైవేట్ ఆసుపత్రులతో పాటు 19 వేలకు పైగా పడకలను అత్యవసర చికిత్స కోసం అందుబాటులో ఉంచామని వెల్లడించారు. కరోనా బాధితులకు వైద్యం చేసే వైద్యుల రక్షణ కోసం పీపీఈ కిట్స్‌ను విశాఖ జిల్లాలోనే తయారు చేసుకోగలుగుతున్నామని పేర్కొన్నారు.
(కోవిడ్-19 నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష)
రాష్ట్రంలో ప్రతి పేదవానికి వాలంటీర్ల ద్వారా రేషన్‌తో పాటు రూ.1000 సాయం అందించామని చెప్పారు. భౌతిక దూరం పాటించడంతోనే కరోనా నియంత్రణ సాధ్యమని ఆయన సూచించారు. పేదలెవరూ ఆకలితో ఉండకుండా పారిశ్రామికవేత్తలు ఇంకా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కరోనా వైరస్ నివారణకు విశాఖ పారిశ్రామికవేత్తలు రూ.4 కోట్ల నిధులను జిల్లా కలెక్టర్‌కు అందించారన్నారు. సీఎం సహాయ నిధికి రూ. కోటి రూపాయిలకి పైగా విరాళాలు ఇచ్చారని వెల్లడించారు. సీఎస్‌ఆర్ నిధులతో శానిటైజర్లు, మాస్క్‌లు, వైద్య పరికరాలను ఇవ్వాలని ఆయన కోరారు. కరోనాపై పోరాటంలో ప్రభుత్వంతో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలకు ఎంపీ విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment