సాక్షి ప్రతినిధి, విజయనగరం: మంత్రి మృణాళిని పంతమే నెగ్గింది. ఆమె ఆనుకున్నట్టుగానే జరిగింది. ఆమే వైద్య ఆరోగ్యంపై సమీక్ష నిర్వహిం చారు. కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు ఆదేశాలతో జెడ్పీ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి చేసిన ప్రయత్నం విఫలమైంది. తన ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహిద్దామని యత్నించినా పరిస్థితులు అనుకూలించలేదు. ఆవేదన చెందారో, అక్కసుతో ఉన్నారో తెలియదుగాని సోమవారం జరిగిన వైద్య ఆరోగ్య సమీక్షకు చైర్‌పర్సన్ హాజరు కాలేదు. ఆమె వర్గంగా ముద్రపడిన ఎమ్మెల్యేలు కె.ఎ.నాయుడు, మీసాల గీత కూడా గైర్హాజరయ్యారు. మొన్నటి రహస్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి సైతం మంత్రి సమీక్షకు దూరంగా ఉండిపోయారు. దీన్నిబట్టి టీడీపీలో ఎవరెటో తేలిపోయింది.
గతనెల 28న వైద్యారోగ్య సమీక్ష నిర్వహించేందుకు జెడ్పీ చైర్‌పర్సర్ ప్రయత్నించి విఫలమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా నిర్వహించి తీరుతామని బీష్మించినా ఆ సమయానికి జెడ్పీ సీఈఓ తప్ప మరెవ్వరూ హాజరు కాలేదు. జేసీ, డీఎంఅండ్‌హెచ్‌ఓ, వైద్యులు అటువైపే రాలేదు. దీనికంతటికీ మంత్రి ఆదేశాలే కారణమన్నది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే, సమీక్షను రద్దు చేసుకోమని మంత్రి ఆదేశించినట్టు సాక్షాత్తు కలెక్టరే తనకు ఫోన్ చేసినట్టు చైర్‌పర్సన్ వెల్లడించారు. ఆ రాత్రే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ మృతి చెందడంతో వైద్యారోగ్య సమీక్ష నిర్వహిద్దామనుకున్న సమావేశం సంతాపసభగా మారిపోయింది. ఒకవేళ పరిస్థితులు అనుకూలించి సమావేశం నిర్వహించినట్టయితే అధికారుల్లేని సమీక్షగా మిగిలిపోయేది. ఇక, డోంట్ కేర్ అన్నట్టుగా మంత్రి మృణాళిని వ్యవహరిస్తున్నారు.
తాను చెప్పినట్టే వైద్య ఆరోగ్య సమీక్ష జరగాలని అధికారుల్ని ఆదేశించారు. ఎవరొచ్చినా, రాకపోయినా పర్వాలేదన్నట్టుగా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఎమ్మెల్యేలు పతివాడ నారాయణస్వామినాయుడు, కోళ్ల లలితకుమారి, బొబ్బిలి చిరంజీవులు, ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌తో పాటు నాలుగు మున్సిపాల్టీల చైర్మన్లు, అధికారులు హాజరయ్యారు. ఈ సమీక్షకు దూరమైనవారంతా చైర్‌పర్సన్ గ్రూపుగా భావిస్తున్న వారే. నేతల మధ్య అంతర్గత పోరు తారస్థాయికి చేరిపోయిందని,మున్ముందు మరింత ఇబ్బందికరంగా అధికారులు లోలోపల ఆందోళన చెందుతున్నారు.
నెగ్గిన మంత్రి పంతం
Published Tue, Aug 4 2015 3:47 AM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM
Advertisement
Advertisement