
పెద్ద మాదిగనంటూ
మండపేట : ‘పెద్ద మాదిగనని చెప్పి ఓట్లు అడిగాడు. గద్దెనెక్కాక మొత్తం జాతిని మోసగిస్తున్నాడు. వర్గీకరణతో రుణం తీర్చుకుంటానని చెప్పి ఇప్పుడు వ్యతిరేక శక్తులతో చేరి వంచన చేస్తున్నాడు. గెలిపించిన మనమే అంతు చూడాల్సిన సమయం వచ్చింది. మాదిగల సత్తా ఏమిటో ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియజేద్దాం’ అంటూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్‌పీఎస్) వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ అన్నారు. వచ్చే నెల 14న విజయవాడలో జరగనున్న ‘మరో విశ్వరూప మహాసభ’ సన్నాహక కార్యక్రమంలో భాగంగా శనివారం రాత్రి తూర్పు గోదావరి జిల్లా మండపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కృష్ణమాదిగ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్గీకరణకు కట్టుబడి ఉన్నానంటూ ఎన్నికల సందర్భంగా రాష్ర్టవ్యాప్తంగా ప్రతి సెంటర్‌లోనూ చెప్పుకొచ్చిన చంద్రబాబు, ఇప్పుడు వర్గీకరణ చేయలేనని, ప్రత్యామ్నాయం ఏమిటని తనను అడుగుతున్నారని అన్నారు.
వర్గీకరణను తీవ్రంగా వ్యతిరేకించిన జూపూడి ప్రభాకర్‌ను ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రోద్బలంతో పార్టీలో చేర్చుకుని మాదిగలకు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. బీసీలకు వర్గీకరణకు అడ్డుపడని యనమల.. ఎస్సీ వర్గీకరణకు ఎందుకు అడ్డుపడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణలో మాదిగలకు శత్రువనుకున్న సీఎం కేసీఆర్.. వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి మిత్రుడైతే.. ఆంధ్రాలో మిత్రుడనుకున్న చంద్రబాబు మాట మార్చి శత్రువయ్యాడని విమర్శించారు. రెండు దశాబ్దాలుగా వర్గీకరణ కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నామని, మరోమారు సత్తా చాటేందుకు మాదిగలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఫిబ్రవరి 14న విజయవాడలో నిర్వహించ తలపెట్టిన ‘మరో విశ్వరూప మహాసభ’కు మాదిగలు, ఉపకులాలవారు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర కార్యదర్శి దూలి జయరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘ నాయకులు ఓరుంగటి ధర్మజ్ఞాని, ముమ్మిడివరపు చినసుబ్బారావు, దొండపాటి సుధాకర్, డి.సుబ్బారావు, నిడగట్ల వెంకట్రావు, బొడ్డపాటి సురేష్‌కుమార్, కొత్తపల్లి ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ, విజయవాడ సభను విజయవంతం చేయాలని కోరారు.