సాక్షి, విశాఖపట్నం: కొన్ని వారాలపాటు ఇరాన్ చెరలో చిక్కిన భారత ప్రభుత్వ నౌక ‘ఎంటీ దేశ్‌శాంతి’ ఎట్టకేలకు బుధవారం విశాఖపట్నం పోర్టుకు చేరుకుంది. 140 టీఎంటీల ముడిచమురుతో ఈ నౌక ఇరాక్ నుంచి వస్తుండగా పర్షియన్ సింధుశాఖలో ఇరాన్ నౌకాదళం గత నెల 12న అడ్డుకుని బందర్ అబ్బాస్‌కు తరలించింది. నౌక నుంచి లీకవుతున్న చమురుతో సముద్రజలాలు కలుషితమయ్యాయంటూ అదుపులోకి తీసుకుంది. దీనిపై భారత విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఇరాన్ నౌకను విడిచిపెట్టింది. నౌక బుధవారం విశాఖకు రాగానే ముంబై నుంచి వచ్చిన నౌకా రవాణా అధికారుల బృందం పరిశీలించి, అన్నీ సక్రమంగా ఉన్నట్లు నిర్ధారించింది. ‘దేశ్‌శాంతి’లోని రూ.160 కోట్ల విలువైన 40 టీఎంటీల ముడి చమురు విశాఖలోని హెచ్‌పీసీఎల్ రిఫైనరీకి అందాల్సి ఉంది.