
కాపుల కోసం మళ్లీ పోరు: ముద్రగడ
సాక్షి, హైదరాబాద్/ఖమ్మం అర్బన్: కాపులకు రిజర్వేషన్ల కోసం అవసరమైతే మళ్లీ పోరాటానికి సిద్ధమవుతామని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. ఆదివారం ఆయన హైదరాబాద్ వెళుతూ ఖమ్మంలో కాసేపు ఆగారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు తాను గెలిచిన ఆరు నెలల్లో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తానని ఎన్నికల సమయంలో హామీనిచ్చారని గుర్తు చేశారు. కానీ అవసరం తీరాక దీనిని విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులను బీసీల్లో చేర్చాలంటూ గతంలో తాను పోరుకు దిగితే.. కమిషన్ ద్వారా న్యాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు.
ఇందుకు ఈనెల చివరి వరకు గడువు పెట్టారని పేర్కొన్నారు. ఒకవేళ కమిషన్ నివేదిక అనుకూలంగా లేకుంటే మళ్లీ పోరు తప్పదని హెచ్చరించారు. వచ్చేనెల 11న అన్ని జిల్లాల కాపు నేతలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు వివరించారు. పేద కాపులకు న్యాయం జరగాలన్నదే తమ ధ్యేయమన్నారు. కాగా, ముద్రగడ ఆదివారం రాత్రికి హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన సోమ, మంగళవారాల్లో అల్లు అరవింద్ సహా పలువురు సినీ ప్రముఖులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు ఈనెల 30న తన ఇంట్లో ముద్రగడకు విందు ఏర్పాటు చేశారు.