25 కాపు సంఘాల నేతల ధ్వజం
సాక్షి, హైదరాబాద్: కాపుల్ని చీల్చి రిజర్వేషన్ల ఉద్యమాన్ని నీరు గార్చేందుకు సీఎం చంద్రబాబు, ఆయనకు తాబేదార్లుగా ఉన్న కొందరు కాపు నేతలు కుట్రలు చేస్తున్నారని బుధవారమిక్కడ సమావేశమైన 25 కాపు సంఘాలు ధ్వజమెత్తాయి. విజయవాడలో మంగళవారం జరిగిన కాపు నేతల సమావేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిందేనని, దానికి హాజరయిన నేతలందరూ అధికార పార్టీ అనుకూలురు, పైరవీకారులేనని మండిపడ్డాయి. కాపు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం లేని ఏ చర్చల్నీ కాపులు, బలిజలు, తెలగ, ఒంటర్లు అంగీకరించబోరని స్పష్టం చేశాయి.
తునిలో ఆదివారం జరిగిన విధ్వంసం వెనుక అధికార పార్టీ నేతలు, ప్రభుత్వంలోని పెద్దల హస్తం ఉందని ఆరోపించాయి. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని మేనిఫెస్టోలో పెట్టి మాట తప్పిన చంద్రబాబు ఆదేశాల మేరకు కొందరు ఓ ముఠాను తయారు చేసి కాపు గర్జనకు పంపిన ఫలితమే హింసాకాండని ఆరోపించాయి. లోయర్ ట్యాంక్ బండ్‌లోని ఏపీ కాపు, బలిజ, తెలగ, ఒంటరి సంఘం భవనంలో సంఘం అధ్యక్షుడు ఎంహెచ్ రావు అధ్యక్షతన సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి నగరంలోని 25కి పైగా సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు హాజరయ్యారు. హాజరైన ప్రముఖుల్లో మాజీ ఐఏఎస్ అధికారులు ఎం.గోపాలకృష్ణ, కేవీరావు, ఏవీ రత్నం, న్యాయవాదుల సంఘం నాయకుడు చిదంబరం, కాపునాడు నాయకుడు కఠారి అప్పారావు, రవికుమార్ తదితరులు ఉన్నారు. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్, పోలీసు స్టేషన్ల దగ్ధం వెనుక ప్రభుత్వ వర్గాలే ఉన్నాయని, కాపులకు చెడ్డపేరు తెచ్చేలా ప్రభుత్వమే రైలును దగ్ధం చేయించిందనే దానికి తమ వద్ద ఆధారాలున్నాయని ఓ నాయకుడు వివరించారు. యనమల రామకృష్ణడు, ఆయన సోదరుడి హస్తముందని ఆయన ఆరోపించారు. రైలు దగ్ధం కాబోతున్నట్టు హైదరాబాద్‌కు కూడా ముందస్తు సమాచారం వచ్చిందని తెలిపారు.
చంద్రబాబు కుట్రతోనే విధ్వంసం
Published Thu, Feb 4 2016 4:05 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
Advertisement
Advertisement