హామీలు నెరవేర్చకపోతే తీవ్ర ఉద్యమం
ముద్రగడ పద్మనాభం హెచ్చరిక
కిర్లంపూడి/కాకినాడ: ఎన్నికల్లో కాపులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేయకపోతే ఉద్యమం తీవ్రతరం చేసేందుకు వెనుకాడబోమని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం హెచ్చరించారు. ఆయన ఆదివారం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కాపులను బీసీల్లో కలుపుతానని, కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏటా రూ.వెయ్యి కోట్లతో కాపుల అభివృద్ధికి పాటుపడతానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు కేవలం రూ.50 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకోవడం దారుణమని విమర్శించారు. వచ్చే జనవరి 31న తూర్పు గోదావరి జిల్లాలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి వంటి కాపు జాతి కులాలతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వంపై తేవాల్సిన ఒత్తిడికి కార్యాచరణ రూపొందిస్తామని ముద్రగడ తెలిపారు.
1984లో ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసినపుడు రామకృష్ణ స్టూడియోలో చంద్రబాబు రాత్రింబవళ్లు కూర్చొని బస్సులు, రైళ్లు, కార్యాలయాలు, బ్యాంకులను తగులబెట్టించేలా రెచ్చగొట్టి మరీ చేయించిన ఆందోళనను మరచిపోరాదని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి కారణం కాపుల మద్దతే అన్న సంగతిని విస్మరిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవని తేల్చిచెప్పారు.
చంద్రబాబుకు ముద్రగడ బహిరంగ లేఖ
కాపు కులస్తులను బీసీల్లో చేర్చి ఏటా రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తామన్న హామీని నిలుపుకోవడమా లేక కాపు జాతిని రోడ్డుపైకి లాగడమా అనే విషయంలో నిర్ణయం మీ చేతుల్లోనే ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. ఈ మేరకు ముద్రగడ ఆదివారం సీఎంకు మరోసారి బహిరంగ లేఖ రాశారు.