శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తున్న సీఎం
సీఎంపై కేంద్ర మాజీ మంత్రి దాసరి ఫైర్
సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు ఒక వైపు శాంతి అంటూ కొంగజపం చేస్తూ మరో వైపు మంత్రులతో రెచ్చగొట్టే ప్రకటనలు చేయిస్తూ ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాపునేత ముద్రగడ పద్మనాభం దీక్ష విషయంలో ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు నివాసంలో కాపు ప్రముఖులు సమావేశమై ముద్రగడ దీక్ష, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం దాసరి నారాయణరావు మీడియాతో మాట్లాడుతూ తాము నిగ్రహం పాటిస్తుంటే ప్రభుత్వంలోని కొందరు వ్యక్తులు రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముద్రగడ ప్రాణాలతో చెలగాటం ఆడుతూ మంత్రులు చేసే వ్యాఖ్యానాలకు, ప్రకటనలకు చంద్రబాబే బాధ్యత వహించాలన్నారు. ముద్రగడ ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తామంతా రాజమండ్రికి వెళ్తే శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుందనే ఉద్దేశంతోనే తమ కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసుకున్నామన్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలు ముద్రగడకు హామీ ఇవ్వడంతో ఆయన ఒక బాటిల్ సెలైన్ ఎక్కించుకున్నారని, ఇక దీక్ష విరమించినట్లేనని హోంమంత్రి ప్రకటించడం, ఆరు రోజులు దీక్ష చేసినా వైద్య పరీక్షల్లో అన్నీ సాధారణంగానే ఎలా ఉన్నాయోనంటూ మరో మంత్రి వెటకారంగా మాట్లాడారన్నారు.
ఇది ముద్రగడ నిజాయితీని, తమ జాతిని అవమానించడమేనని దాసరి ఘాటుగా స్పందించారు. పద్ధతి మార్చుకుని ప్రభుత్వం స్పందించకపోతే తామంతా వెళ్లి నేరుగా ముద్రగడను కలుస్తామన్నారు. కాగా మీడియా పీకపై ప్రభుత్వం కత్తి పెట్టిందని, ఎమర్జెన్సీలోకూడా ఇంతలా నియంత్రణ విధించలేదన్నారు.తమ సమావేశ వివరాలను కొన్ని చానళ్లలో అర నిమిషం కూడా ప్రసారం చేయలేదని, వాళ్లందరి బాధలేంటో కాపు సామాజికవర్గానికి తెలుసన్నారు. ముద్రగడ దీక్ష గురించి ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు దాసరి వెల్లడించారు. రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, సి.రామచంద్రయ్య, వైఎస్సార్సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.