మంత్రులు ఏం మాట్లాడినా చంద్రబాబుదే బాధ్యత
హైదరాబాద్: కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి పాటిస్తోందని కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణ రావు విమర్శించారు. శుక్రవారం సాయంత్రం కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు నివాసంలో కాపు ప్రముఖులు సమావేశమై ముద్రగడ దీక్ష, అనంతరం చేపట్టాల్సిన కార్యచరణపై చర్చించారు. అనంతరం దాసరి మీడియాతో మాట్లాడుతూ తాము నిగ్రహం పాటిస్తుంటే ప్రభుత్వంలోని కొందరు వ్యక్తులు రెచ్చగొడుతున్నారని అన్నారు.
ముద్రగడ ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని దాసరి ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంత్రులు ఏం మాట్లాడినా చంద్రబాబుదే బాధ్యతని స్పష్టం చేశారు. మంత్రులే శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారని విమర్శించారు. అవసరమైతే తామందరం రాజమండ్రికి వెళ్లి ముద్రగడను కలుస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలు హామీ ఇవ్వడంతో ఆయన ఒక బాటిల్ సెలైన్ ఎక్కించుకున్నారని, దాంతో ఇక ఆయన దీక్ష విరమించేసినట్లేనని హోం మంత్రి ప్రకటించారని.. అంతేకాక, ఆరు రోజులు దీక్ష చేసినా వైద్య పరీక్షలలో అన్నీ సాధారణంగానే ఎలా ఉన్నాయోనంటూ వెటకారంగా మాట్లాడారని దాసరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముద్రగడ నిజాయితీని, జాతి నిజాయితీని అవమానించడమే అవుతుందన్నారు. ఈ విమర్శలు మంత్రులు చేసినవా.. వాళ్ల వెనక ఉండి ముఖ్యమంత్రి చేయించినవా అని ప్రశ్నించారు. మంత్రుల మీద చర్యలేవీ తీసుకోలేదంటే ఆ బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని అన్నారు. సీఎం ఒకవైపు శాంతిభద్రతలు కావాలంటారు, మరోవైపు మంత్రులతో ప్రకటనలు ఇప్పించి శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తారని విమర్శించారు. ముద్రగడ ప్రాణాలతో చెలగాటం ఆడటానికి ఏ మంత్రి ఎలాంటి ప్రకటన ఇచ్చినా దానికి బాధ్యత చంద్రబాబుదేనని స్పష్టం చేశారు.
ఎమర్జెన్సీ రోజుల్లో కూడా మీడియాపై ఇంతలా నియంత్రణ విధించలేదని దాసరి విమర్శించారు. కీలకమైన అంశంపై తామంతా సమావేశమై విషయం చెబుతుంటే.. కొన్ని చానళ్లలో అర నిమిషం కూడా రాలేదని, వాళ్ల బాధలేంటో తనకు తెలుసని దాసరి అన్నారు. మీడియాపై ప్రభుత్వం కత్తిపెట్టిన విషయం తమకు తెలుసునని పేర్కొన్నారు. ముద్రగడ దీక్ష గురించి ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని దాసరి చెప్పారు. ఈ సమావేశంలో దాసరితో పాటు చిరంజీవి, సీ రామచంద్రయ్య, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, తోట చంద్రశేఖర్, జీఎస్ రావు తదితరులు పాల్గొన్నారు.