ఒక్కరు తగ్గినా దీక్ష విరమించను
- ఆ 13 మందీ విడుదల కావలసిందే..
- తేల్చి చెప్పిన ముద్రగడ పద్మనాభం
- మరింత క్షీణించిన కాపునేత ఆరోగ్యం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘లెక్కకు ఒక్కరు తగ్గినా దీక్ష విరమించేది లేదు. ఎన్నిరోజులైనా దీక్ష చేస్తా. ప్రాణాల కంటే ఇచ్చిన మాటే ముఖ్యం. నా మానాన నన్ను ఇలా వదిలేయండి. అందరినీ విడుదల చేసి తీసుకువచ్చి చూపించినప్పుడు మాత్రమే దీక్ష విరమిస్తా. అంతవరకు నన్ను బలవంత పెట్టొద్దు..’ అని ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం శుక్రవారం స్పష్టం చేశారు. తుని ఘటనలో అరెస్టు చేసిన 13 మందిని విడుదల చేయాలనే డిమాండ్‌తో ఆయన ఆమరణ దీక్ష చేపట్టి శుక్రవారం నాటికి తొమ్మిది రోజులైంది. ముద్రగడతో పాటు ఆయన భార్య, కుమారుడు, కోడలు అదే ఆస్పత్రిలో దీక్షలో ఉన్నారు.
ముద్రగడ ఆరోగ్యం శుక్రవారం చాలా విషమంగా మారింది. శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో ముద్రగడతోపాటు కుటుంబ సభ్యులందరి మూత్రపిండాల్లో కీటోన్స్ 4+గా నమోదైందని జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ టి.రమేశ్‌కిశోర్ తెలిపారు. ఈ స్థితిలో రాజమహేంద్రవరంలోనే ఉంచి వైద్యం చేసినా ప్రాణాపాయమని వైద్యులు చెబుతున్నారు. ముద్రగడతో దీక్ష విరమింపజేసి ఆయన ప్రాణాలు దక్కించుకోవాలని కాపు జేఏసీ నేతలు, బంధువులు రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.
బెయిలొచ్చిందని ఒప్పించేయత్నం..
తుని ఘటనలో ప్రభుత్వం అరెస్టు చేసిన 13 మందిలో శుక్రవారం 10 మందికి బెయిల్ మంజూరైంది. ఉద్యమంలో క్రియాశీలకపాత్ర పోషించిన నేతలు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణుమూర్తి, వి.వై.దాసుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్ అయ్యూయి. 10 మందికి బెయిల్ మంజూరైందని, శనివారం మిగిలిన వారికి బెయిల్ లభిస్తుందని తెలిపి ముద్రగడను ఏదోరకంగా ఒప్పించి దీక్ష విరమింపచేయాలని కాపు జేఏసీ నేతలు, కుటుంబసభ్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ 13 మందిలో ఒక్కరు తగ్గినా కుదరదని, వారు వచ్చాకే విరమిస్తానని చెప్పి ముద్రగడ ఆమరణ దీక్షను కొనసాగిస్తున్నారు. సాయంత్రం కలెక్టర్ అరుణ్‌కుమార్ సహా అధికారులు వచ్చి దీక్ష విరమణపై చర్చలు జరిపినా కొలిక్కి రాలేదు.
బంధువుల ఆందోళన : ఫ్లూయిడ్స్ పెడుతున్నా ముద్రగడ ఆరోగ్యాన్ని నియంత్రించడం కష్టమవుతోందని వైద్యులు చెబుతున్నారు. ముద్రగడతో పాటు కోడలు సిరి ఆరోగ్యం మరింత ఆందోళనకరంగా ఉంది. ఆమె నోట మాట రావడంలేదని ముద్రగడ వియ్యంకుడు సోమేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.