'జైల్లో దీక్ష చేస్తాను.. బెయిల్ తీసుకోను'
కాకినాడ: తనను అరెస్ట్ చేస్తే జైల్లో దీక్ష కొనసాగిస్తాను తప్ప బెయిల్ తీసుకోననని కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా తుని ఘటనకు మూల కారకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని ఆయన ఆరోపించారు. ముద్రగడ బుధవారం సాక్షి మీడియాతో మాట్లాడారు. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేసేవరకూ తానూ దీక్ష కొనసాగిస్తానని చెప్పారు.
రేపు(గురువారం) ఉదయం 9 గంటల నుంచి కిర్లంపూడిలో నిరవధిక దీక్ష చేపడుతున్నట్టు చెప్పారు. కాపులను ముక్కలు చేసి తనను ఒంటిరి చేయాలన్నది చంద్రబాబు కుట్ర' అని విమర్శించారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా తిప్పి కొడతామని సాక్షితో ముద్రగడ చెప్పారు. అయితే రేపటి నుంచి నిరవధిక దీక్షకు ముద్రగడ సిద్ధమవుతున్న నేపథ్యంలో కిర్లంపూడిలో భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. ఆయన ప్రధాన అనుచరులను హౌస్ అరెస్ట్‌కు పోలీసులు యత్నిస్తున్నారు. మీడియాపైనా కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. లైవ్ వెహికల్స్‌ను ముద్రగడ ఇంటి ఆవరణలోపెట్టొదని పోలీసులు హుకుం జారీ చేశారు.