
'చంద్రబాబు పద్ధతి మార్చుకోవాలి'
సాక్షి, కిర్లంపూడి: రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. బుధవారం కాపు జేఏసీ నేతలతో సమావేశమై ఆయన భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. డిసెంబర్ 6 వరకు పాదయాత్ర వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. త్వరలో మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. రెండు నెలల్లో మంజునాథ నివేదిక వస్తుందని సీఎం చంద్రబాబు చెప్పినందున, ప్రభుత్వానికి రెండు నెలల గడువు ఇస్తున్నామన్నారు. అంబేద్కర్ వర్థంతి డిసెంబర్ 6లోపు రిజర్వేషన్ అమలు చేయకుంటే ముఖ్యమంత్రికి తడాఖా చూపిస్తామని హెచ్చరించారు.
డిసెంబర్ 6 తర్వాత నిరసన కార్యక్రమాలు చాలా తీవ్రంగా ఉంటాయన్నారు. ప్రభుత్వం ఏంచేసినా వెనక్కు తగ్గబోమని స్పష్టం చేశారు. ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, నిజాలు చెప్పే వ్యక్తిని ఆ స్థానంలో చంద్రబాబు నియమించాలని సూచించారు. పోలీసులతో పాలించే ప్రభుత్వాలు ఎల్లకాలం ఉండవని, చంద్రబాబు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలన్నారు. ఉద్యమకారులపై అణచివేత ఆపాలని ముద్రగడ డిమాండ్ చేశారు.