kapu agitation
-
చంద్రబాబుకు ముద్రగడ ఘాటు లేఖ
-
చంద్రబాబుకు ముద్రగడ ఘాటు లేఖ
కాకినాడ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మరోసారి ఘాటు లేఖ సంధించారు. ‘ మీరు మేధావి అని అందరూ భావించారు. కానీ మీ మేధావితనంతో మీకు కావాల్సిన వారికి, మీ కుటుంబానికి కోట్ల రూపాయలు దోచిపెట్టారని అర్ధమైంది. మా జాతికి ఇచ్చిన హమీలను అమలు చేయమని అడిగితే అన్నదమ్ముల్లాంటి మా సోదరులతో తిట్టించి పబ్బం గడుపుకుంటున్నారు. మా జాతిలో కొందరి ఆర్ధిక మూలలను దెబ్బతీశారు. కొందరిపై తప్పుడు కేసులు పెట్టి రౌడీ షీట్లు తెరిపించారు.’ అని లేఖ ద్వారా విమర్శించారు. ‘ కామన్ వెల్త్ ఆటల్లో రెండు సార్లు స్వర్ణం సాధించిన కాపు క్రీడాకారుడు వెంకట రాహుల్‌కు ఎందుకు అభినందనలు చెప్పలేదో లోకానికి చెప్పండి. మీ సంతానం తెలుగు నేర్చుకోవడానికి ప్రజల ఆస్తి కోట్ల రూపాయలు ఖర్చు చేయడం సిగ్గుగా లేదా. హమీలు అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టాడానికి మీరు చేస్తున్న గోబెల్స్ ప్రచారం రాష్ర్టానికే కాదు..దేశానికే ప్రమాదం. మీ మోసం కన్నా క్యాన్సర్ వ్యాధే మంచిది. మీ మోసానికి మందులు కూడా ఉండవు. ఇలా మోసం చేసే పార్టీని ప్రజలు భూస్ధాపితం చేస్తే మంచిది. ఏపీలో రైళ్ళని ఆపితే ప్రత్యేక హోదా ఎందుకు రాదు? ’ అని లేఖలో పేర్కొన్నారు. విలేకరులతో విడిగా మాట్లాడుతూ.. జనసేన కోశాధికారి రాఘవయ్య ఇటీవల మా ఇంటికి వచ్చినప్పుడు సూచనలు ఇచ్చానే తప్ప పార్టీలో చేరతాననలేదని వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సినిమాలను వీడి పూర్తి గా రాజకీయాల్లో ఉంటేనే రాణిస్తారు అని రాఘవయ్యకు సూచించానని ముద్రగడ తెలిపారు. -
ఉద్యమానికి 3 నెలల విరామం
- వెల్లడించిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం - బీసీ జాబితాలో చేర్చడానికి చంద్రబాబుకు డిసెంబర్ 6 వరకూ గడువు జగ్గంపేట: కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు సర్కారుకు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరో అల్టిమేటమ్ ఇచ్చారు. అంబేడ్కర్ వర్ధంతి అయిన డిసెంబర్ 6 వరకు ఉద్యమానికి విరామం ప్రకటిస్తున్నామని, ఈలోగా కాపులను బీసీల జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పాటు 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరసనలు ఊహకందని విధంగా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో బుధవారం రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన కాపు జేఏసీ నేతలతో కీలక సమావేశం నిర్వహించిన అనంతరం ముద్రగడ మీడియాతో మాట్లాడారు. జేఏసీ పెద్దల సూచనలకు అనుగుణంగా తదుపరి ఉద్యమం ఉంటుందన్నారు. మూడు నెలలు ఉద్యమానికి విరామం ప్రకటిస్తున్నామని, ఈలోగా కాపులను చైతన్య పరిచేందుకు నియోజకవర్గ లేదా జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. సీఎం చంద్రబాబు కాపులపై చిన్నచూపు మానుకుని ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు చిత్తశుద్ధిని ప్రదర్శించాలన్నారు. ఆనాడు కాపులకు రిజర్వేషన్ల తొలగింపునకు అడ్డు చెప్పిన మహానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ వర్ధంతి వరకు ముఖ్యమంత్రికి గడువు ఇస్తున్నామని పేర్కొన్నారు. -
'చంద్రబాబు పద్ధతి మార్చుకోవాలి'
-
'చంద్రబాబు పద్ధతి మార్చుకోవాలి'
సాక్షి, కిర్లంపూడి: రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. బుధవారం కాపు జేఏసీ నేతలతో సమావేశమై ఆయన భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. డిసెంబర్ 6 వరకు పాదయాత్ర వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. త్వరలో మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. రెండు నెలల్లో మంజునాథ నివేదిక వస్తుందని సీఎం చంద్రబాబు చెప్పినందున, ప్రభుత్వానికి రెండు నెలల గడువు ఇస్తున్నామన్నారు. అంబేద్కర్ వర్థంతి డిసెంబర్ 6లోపు రిజర్వేషన్ అమలు చేయకుంటే ముఖ్యమంత్రికి తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. డిసెంబర్ 6 తర్వాత నిరసన కార్యక్రమాలు చాలా తీవ్రంగా ఉంటాయన్నారు. ప్రభుత్వం ఏంచేసినా వెనక్కు తగ్గబోమని స్పష్టం చేశారు. ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, నిజాలు చెప్పే వ్యక్తిని ఆ స్థానంలో చంద్రబాబు నియమించాలని సూచించారు. పోలీసులతో పాలించే ప్రభుత్వాలు ఎల్లకాలం ఉండవని, చంద్రబాబు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలన్నారు. ఉద్యమకారులపై అణచివేత ఆపాలని ముద్రగడ డిమాండ్ చేశారు. -
'ఉక్కుపాదం మోపడం దారుణం'
సాక్షి, కాకినాడ: రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న కాపులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం దారుణమని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. హామీలు అమలు చేయమని అడిగితే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. పోలీసుల దాడిలో గాయపడి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాపు జేఏసీ నాయకుడు వాసిరెడ్డి ఏసుదాసును ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా, లేదా అని నిలదీశారు. తమ జాతి ప్రయోజనాల కోసం ముద్రగడ పద్మనాభంకు పాదయాత్ర చేసే హక్కు లేదా అని అడిగారు. ఆయనకు ఏం జరిగినా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. పోలీసుల వల్లే ఏసుదాసు కాలికి గాయమైందని, ఉద్యమకారులతో వ్యవహరించడం అలాగేనా అని ప్రశ్నించారు. కాగా, తూర్పుగోదావరి జిల్లా వీరవరం వద్ద ముద్రగడ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను తమ వ్యానులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళుతున్నారనేది పోలీసులు వెల్లడించలేదు. వ్యానులోంచి ముద్రగడ తన మద్దతుదారులకు అభివాదం చేశారు. -
'వెనక్కి తగ్గం, బెదిరింపులకు భయపడం'
సాక్షి, కిర్లంపూడి: గాంధేయ మార్గంలో పాదయాత్ర చేస్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం సరికాదని కాపు జేఏసీ నాయకుడు వాసిరెడ్డి ఏసుదాసు అన్నారు. తమను పశువుల్లా చేస్తున్నారని, ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీకి డీజీపీ సాంబశివరావు తొత్తులా మారారని, రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. రిజర్వేషన్లపై తమకు ఇచ్చిన హామీని నెరవేర్చేవరకు వెనక్కి తగ్గబోమని, ప్రభుత్వ బెదిరింపులకు భయపడబోమని అన్నారు. కాపు జాతి ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. కాగా, ముద్రగడ పద్మనాభం పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంతో కాపు జేఏసీ నేతలు అభ్యంతరం చెప్పారు. ఈ సందర్భంగా ఏసుదాసు కాలికి గాయమైంది. కాకినాడలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయనను వైఎస్సార్ సీపీ నాయకుడు అంబటి రాంబాబు పరామర్శించారు. -
కాపుల సమస్యల పరిష్కారానికి సబ్ కమిటీ
విజయవాడ: కాపుల సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ సబ్ కమిటీని నియమించింది. బుధవారం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినేట్ సమావేశంలో ఆరుగురు మంత్రులతో కూడిన కేబినేట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సబ్ కమిటీలో మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, నారాయణ, కేఈ కృష్ణమూర్తి, కొల్లు రవీంద్ర, గంటా శ్రీనివాసరావు సభ్యులుగా ఉంటారు. మరోవైపు వచ్చే బడ్జెట్లో కాపు కార్పొరేషన్‌కు వెయ్యి కోట్లు కేటాయించాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది. సబ్ కమిటీ అందరితో మాట్లాడతారని చంద్రబాబు తెలిపారు. -
ఏది జరిగినా జగన్‌కు ఆపాదించడమేనా?
బాబు సర్కారుపై వైఎస్సార్సీపీ నేత బొత్స ధ్వజం సాక్షి, హైదరాబాద్: ప్రతిదానికీ రామ భజన చేసినట్టు.. రాష్ట్రంలో ఏ సంఘటన చోటుచేసుకున్నా చంద్రబాబు సర్కారు దానికి సంబంధించిన తప్పులన్నింటినీ తమ అధినేత జగన్మోహన్రెడ్డికి ఆపాదించడమే పనిగా పెట్టుకుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో అధికారపార్టీకి చెందిన కొందరు వ్యక్తులు రైతుల పంటల్ని కాల్చివేస్తే, అదికూడా జగన్, వైఎస్సార్సీపీ చేయించినట్టు సీఎం ఆరోపించడాన్ని ఆయన గుర్తుచేశారు. ఆ ఆరోపణ చేసి ఏడాదవుతున్నదని.. కేసును మాత్రం తేల్చలేదని బొత్స తూర్పారపట్టారు. ‘కాపు గర్జన’ విజయవంతం అవుతుండడంతో గుబులుపుట్టి ప్రభుత్వ పెద్దలే అల్లరి మూకలద్వారా కార్యక్రమంలో అలజడి సృష్టించి.. నిందలు మాత్రం సంఘీభావం చెప్పడానికి వెళ్లిన పార్టీలు, నేతలపై వేస్తున్నారని మండిపడ్డారు. ‘‘ఎవరైనా సంఘీభావానికి వెళ్లితే, వాళ్లను నిందిస్తారా? 1994లో ముద్రగడగారు ఇదే అంశంపై కిర్లంపూడిలో నిరాహార దీక్ష చేస్తే, ఆరోజు చంద్రబాబు ప్రత్యక్షంగా అక్కడికెళ్లి సంఘీభావం తెలిపారు. మీరెళితే మంచి.. ఇంకొకరు వెళితే తప్పా... ఇదెక్కడి నీతి? ఇదెక్కడి చోద్యం?’’ అని బొత్స ప్రశ్నించారు. ఆత్మహత్యపైనా రాజకీయాలేనా? కాపులను బీసీల్లో చేర్చాలన్న ఆకాంక్షను వ్యక్తం చేస్తూ వెంకటరమణ ఆత్మహత్యకు పాల్పడడం చాలా బాధాకరమని బొత్స అన్నారు. అతడి మృతికి పార్టీ తరఫున, వ్యక్తిగతంగాను సంతాపం తెలియజేస్తున్నట్టు చెప్పారు. అయితే ఈ ఆత్మహత్యపై ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, టీడీపీ నేతలు స్పందించకపోవడం దారుణమన్నారు. వెంకటరమణ ఆత్మహత్యపైనా సీఎం హేళనగా మాట్లాడడం అత్యంత బాధాకరమన్నారు. దాన్ని కూడా రాజకీయంగా ఎవరికో ఒకరికి అంటగట్టడానికి ప్రయత్నించడం అధికారపార్టీ సంస్కృతిని తెలియజేస్తుందన్నారు. అమాయక కాపు యువతపై అక్రమ కేసులు పెడితే ఊరుకోం తునిలో జరిగిన సంఘటనలను అడ్డం పెట్టుకుని అమాయక కాపు యువతపై అక్రమ కేసులు బనాయించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బొత్స ఆరోపించారు. అలాంటి పనులు చేసి, ఇంకా ఆ కులంలో ఆవేశాలు రేకెత్తించవద్దని సూచించారు. ఆధారాలుంటే తప్పుచేసిన వారిపై చర్య తీసుకోండిగానీ రాజకీయ లబ్ధికోసం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని హితవు పలికారు. -
'నిరాహారదీక్ష ఎందుకో ముద్రగడ చెప్పాలి'
విజయవాడ: ముద్రగడ పద్మనాభం ఎందుకు నిరాహార దీక్షకు దిగుతున్నారో స్పష్టం చేయాలని మంత్రి నారాయణ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కాపులను బీసీల్లో చేర్చే 30 నంబరు జీవో వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని తెలిపారు. ఈ రోజు సాయంత్రం కాపు నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమవుతారని చెప్పారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించకుంటే ఈ నెల 5 నుంచి తన సతీమణితో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ముద్రగడ పద్మనాభం సోమవారం ప్రకటించిన నేపథ్యంలో నారాయణ స్పందించారు. కాగా, సీఆర్ డీఏ పరిధిలో రహదారుల కోసం 6 గ్రామాల్లో 1200 ఇళ్లు తొలగించాల్సివుంటుందని తెలిపారు. రాజధాని మాస్టర్ ప్లాన్ పై చర్చించేందుకు రేపు సింగపూర్ బృందం వస్తోందన్నారు. మాస్టర్ ప్లాన్ గడువును మరో వారం పాటు పోడిగించినట్టు చెప్పారు. -
పవన్ కల్యాణ్ కోసం ఎదురు చూశాం
కాపులను బీసీల్లో చేర్చాలంటూ బలిదానం కాకినాడ కలెక్టరేట్లో ఓ వ్యక్తి ఆత్మహత్య కాపు విద్యార్థులకు భవిష్యత్తు ఉండడం లేదని ఆవేదన పవన్ పార్టీ ప్రశ్నలు లేని పార్టీగా మిగిలిందని ఆగ్రహం కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని లేఖలో డిమాండ్ సాక్షి, కాకినాడ: కాపు రిజర్వేషన్ల ఉద్యమం కొత్త మలుపు తీసుకుంది. నిన్న తునిలో జరిగిన విధ్వంసకాండ మంటలు చల్లారకముందే ఓ కాపు సామాజిక వర్గీయుడు బలిదానం చేశాడు. న్యాయం కావాలి.. న్యాయం జరగాలి.. మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వం ఇకనైనా మేల్కొని కాపులకి మిగిలిన కులాలతో సమానంగా హక్కులు కల్పించాలి... అంటూ సూసైడ్ నోటు రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో కలెక్టరేట్లో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాకినాడ డెయిరీ ఫారం సెంటర్ రాజీవ్ గృహకల్పకు చెందిన చీకట్ల వెంకటరమణమూర్తి (53) సినిమారోడ్డులోని డీజిల్ హౌస్‌లో డీజిల్ మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య పార్వతి, కుమార్తెలు రాజేశ్వరి, చాముండేశ్వరి, కుమారుడు రాజేష్ ఉన్నారు. పెద్ద కుమార్తె రాజేశ్వరికి వివాహం కావడం తో ఆమె వేరుగా ఉంటోంది. వెంకటరమణమూర్తి సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని బెన్నెట్ క్లబ్ మేడపైకి ఎక్కి అక్కడ ఏర్పాటు చేసిన టీవీ డిష్‌కు నైలాన్ తాడు కట్టుకుని కిందికి దూకడంతో మెడకు తాడు బిగిసి అక్కడికక్కడే మృతి చెందారు. పవన్‌ది ప్రశ్నలు లేని పార్టీ.. సామాజిక, ఆర్థిక రంగాల్లో కాపులు ఎంతో వెనుకబడి ఉన్నారని, 90 శాతం మార్కులు సంపాదించినా కాపు విద్యార్థులకు భవిష్యత్తు ఉండడం లేదని వెంకటరమణమూర్తి తన ఆత్మహత్య లేఖలో రాశారు. సినీ నటుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి కాపులను ఉద్ధరిస్తాడనుకున్నామని... తమది ప్రశ్నించే పార్టీ అని స్థాపించి, ప్రశ్నలు లేని పార్టీగా మిగిల్చారని లేఖలో రాయడం చర్చనీయాంశమైంది. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం, ఎమ్మెల్యే లు జ్యోతుల నెహ్రూ, దాడిశెట్టి రాజా, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, జెడ్పీ చైర్మన్ నామన రాం బాబు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు, నగర అధ్యక్షుడు నున్న దొరబాబు, కాకినాడ ఆర్డీఓ బీఆర్ అంబేడ్కర్ తదితరులు మార్చురీ వద్ద మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. డీఎస్పీలు సూర్యదేవర వెంకటేశ్వరరావు, పిట్టా సోమశేఖర్‌ల నేతృత్వంలో పోలీసు సిబ్బంది ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. సూసైడ్ నోట్లో వెంకటరమణ ప్రస్తావించిన అంశాలు.. మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వం ఇకనైనా మేల్కొని కాపులకి మిగిలిన కులాలతో సమానంగా హక్కులు కల్పించాలి. సమాజంలో ఒక వ్యక్తి ఆర్థిక స్థితిగతులు కులంపై ఆధారపడి ఉండవని ప్రభుత్వం ఇకనైనా తెలుసుకోవాలి. కాపులు ఐదేళ్ల కోసారి ఓట్లు వేయడానికి తప్ప ప్రభుత్వం నుంచి ఆర్థికంగా సహాయం పొందడానికి అర్హులు కారా! కాపు విద్యార్థి 90 శాతం మార్కులు సాధించినా సీట్లు సంపాదించడానికి పాట్లు పడుతున్నారు. 90 శాతం మార్కులు వచ్చిన అధిక ఫీజులు చెల్లించాలని వారి ఆశయాలను చంపుకుని తమ చదువును సగంలోనే నిలిపి వేస్తున్నారు. కాపు కులస్తులు 90 శాతం మంది మధ్య తరగతిలో ఉన్నారు. ఆర్థికంగా మిగిలిన కులస్తులుతో పోల్చినా కాపులు ప్రతీ రంగంలోను వెనుకబడి ఉన్నారు. పవన్ కళ్యాణ్ కాపులకు ఏదో ఒక న్యాయం చేస్తారని ఎదురుచూశాం. చివరికి మాకు ఎదురు చూపు మాత్రమే మిగిలింది. మాది ప్రశ్నించే పార్టీ అని విన్నవించుకున్నారు. కాని చివరకు ప్రశ్నలు లేని పార్టీగా మిగిలిపోయింది. ఈ కాపు సింహ గర్జన ద్వారా అయినా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. -
జగన్‌ను టార్గెట్ చేయండి
సాక్షి, విజయవాడ బ్యూరో: తూర్పుగోదావరి జిల్లా తుని ఘటనపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని టార్గెట్ చేయాలని, మూకుమ్మడిగా ఎదురుదాడికి దిగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలను ఆదేశించారు. ఇదంతా జగన్ వల్లే జరిగిందని, ఆయనే చేయించాడనే పరిస్థితిని సృష్టించాలని దిశానిర్దేశం చేశారు. మరోవైపు కాపు నాయకులు, పెద్దలతో మాట్లాడి ప్రభుత్వం వారికి అనుకూలంగా ఉన్నట్లు చెప్పి నమ్మించాలని సూచించినట్లు సమాచారం. కాపు ఐక్యగర్జన తర్వాత పరిణామాలు టీడీపీకి పూర్తి వ్యతిరేకంగా మారడంతో ఎలా తిప్పికొట్టాలనే దానిపై సోమవారమంతా చంద్రబాబు తన క్యాంపు కార్యాలయంలో సమాలోచనలు జరిపారు. అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దుచేసుకున్న ఆయన ఉదయం నుంచి పలువురు కాపు ప్రజాప్రతినిధులు, నేతలతో మాట్లాడి మధ్యాహ్నం మంత్రులు, ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. కాపు గర్జన తర్వాత పరిణామాలు, అక్కడ పరిస్థితి, దాని ప్రభావం జిల్లాల్లో ఎలా ఉందనే అంశాలపై చర్చించారు. అంతకుముందు మంత్రులు తమకు తెలిసిన సమాచారాన్ని చెప్పగా మొదట జగన్‌పై విమర్శల దాడి పెంచాలని సూచించారు. పులివెందుల రౌడీలే తునికి వచ్చి ఇదంతా చేసినట్లు జనంలోకి తీసుకెళ్లాలని పదేపదే చెప్పడం, ఈ విషయాన్ని కిందిస్థాయి నాయకులు, క్యాడర్ క్కూడా చెప్పి ప్రచారం చేయించాలని నిర్దేశించారు. సీఎంను కలిసేందుకు అంగీకరించని కాపు నేతలు కాపు పెద్దలతో ఇప్పటికిప్పుడే మాట్లాడాలని చంద్రబాబు సూచించడంతో మంత్రులు తమ జిల్లాల్లోని కాపు నేతలు, ఇతర పార్టీల్లోని కాపు నాయకులకు ఫోన్లు చేసినట్లు తెలిసింది. కాపులకు అనుకూలంగా ఉన్నామని చెబుతూనే, బీసీల్లో వ్యతిరేకత రాకుండా వారితో కూడా మాట్లాడాలని సీఎం సూచించారు. కాపు నాయకులు, పెద్దలను తన వద్దకు తీసుకురావాలని సీఎం కోరడంతో.. మంత్రులు ఆహ్వానించినా ఎవరూ అందుకు అంగీకరించలేదని తెలిసింది. కొందరు ఎమ్మెల్యేలు, నాయకులు కాపు నేతల్ని తీసుకొస్తామని చెప్పినా కాపులు గౌరవించే స్థాయిలో ఉన్న వారితోనే మాట్లాడాలని సూచించినట్లు సమాచారం. పెద్ద నేతలు ఎవరూ ముఖ్యమంత్రి వద్దకొచ్చే పరిస్థితి లేకపోవడంతో త్వరలో కాపు ప్రజాప్రతినిధులు, నాయకులు, పెద్దలతో సమావేశం కావాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. పలువురు మంత్రులు ముద్రగడ పద్మనాభంతో చర్చించాలని సూచించినా చంద్రబాబు అంగీకరించలేదని సమాచారం. ఆయనతో మాట్లాడితే ప్రభుత్వం దిగివచ్చినట్లు అవుతుందని అందుకే ఆయనపైనా ఆరోపణలు గుప్పించాలని ఆదేశించారు. జగన్, ముద్రగడ కలసి ఇదంతా చేస్తున్నారనే వాదనను జనంలోకి తీసుకెళ్లాలని సూచించారు. ముద్రగడను ఏకాకిని చేసేలా కాపు నాయకులతో ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడించాలని, అలా ఎవరు ఉన్నారో గుర్తించాలని చెప్పినట్లు సమాచారం. ఆయన నిరవధిక దీక్ష ప్రారంభించే లోపు ఉద్యమాన్ని పక్కదారి పట్టించాలని నేతలను ఆదేశించారు. సీఎం సూచనలతో మంత్రులు, నేతలు క్యాంపు కార్యాలయంలోని మీడియా పాయింట్‌కు క్యూకట్టి విమర్శల వర్షం కురిపించారు. -
ఎప్పటిలాగే.. ఎదురుదాడి
తుని ఘటనల నేపథ్యంలో చంద్రబాబు మీడియా సమావేశం కాపులకు రిజర్వేషన్లపై ఎలాంటి ప్రకటనా చేయని వైనం అసలు విషయాన్ని పక్కనబెట్టి విమర్శల పర్వం తన వైఫల్యాలను ఇతర పార్టీలపైకి నెట్టే యత్నం ఎన్నికల్లో హామీ ఇచ్చింది బాబే.. ఇప్పుడు మాట తప్పిందీ ఆయనే సాక్షి, హైదరాబాద్: తుని సంఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడలో స్పందించిన తీరు ఎప్పటిలాగే ఆయన చేసిన ఎదురుదాడికి నిదర్శనం అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా ఆయన వ్యవహార శైలి ఉందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అసలు విషయాలను పక్క దారి పట్టించడంలో తాను సిద్ధహస్తుడనని చంద్రబాబు అనేక సందర్భాలలో నిరూపించుకున్నారు. తాజాగా కాపు ఐక్య గర్జన సందర్భంగా చోటుచేసుకున్న సంఘటల విషయంలో కూడా ఇదే విధంగా వ్యవహరించారు. తానే స్వయంగా హామీ ఇచ్చి, టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో సైతం పొందుపరిచినకాపులకు రిజర్వేషన్ల అంశంపై లక్షలాది మంది కాపులు తునిలో చేరి గళమెత్తితే.. ఆ తరువాత ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి స్పందించినప్పుడు ఏదైనా ఆశాజనకమైన ప్రకటన వెలువడుతుందని అంతా ఎదురు చూశారు. కానీ చంద్రబాబు మాత్రం వారి డిమాండ్ల గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా అనవసరమైన అనేక విషయాలను మాట్లాడారనే భావన మేధావులు, విజ్ఞుల్లో సైతం వ్యక్తం అవుతోంది. అధికారంలోకి రాగానే కాపులను బీసీలో చేర్చుతానని ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొన్న టీడీపీ అధినేత అధికారంలోకి వచ్చి 22 నెలలైనా ఆ విషయం పూర్తిగా విస్మరించారు. కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి ఏడాదికి రూ.1,000 కోట్లు ఇస్తామనిపకటించి, ఇప్పటివరకు రూ.100 కోట్లకు మించనివ్వలేదు. తాజాగా రిజర్వేషన్ల హామీలను నెరవేర్చడంలో తన వైఫల్యాన్ని ఇతరులపై నెట్టేందుకు, బురద జల్లేందుకు బాబు విఫలయత్నం చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీలో సైతం ఏ విధంగా అయితే ప్రతిపక్షంపై ఎదురుదాడికి పూనుకుని సమస్యలు చర్చకు రాకుండా చంద్రబాబు పక్కదోవ పట్టించారో, ఇప్పుడు కాపుల అంశంలోనూ అలాగే వ్యవహరిస్తున్నారనే భావన వ్యక్తం అవుతోంది. అప్పటికప్పుడు చోటు చేసుకున్న సంఘటనలను అసలు ఈ వ్యవహారంతో ఏ మాత్రం సంబంధం లేని వారికి ఆపాదించడంతో పాటు, రాజకీయం చేయడం విమర్శలకు తావిస్తోంది. ఏది జరిగినా ప్రతిపక్షంపై నిందలేనా..?! రాష్ట్రంలో ఏది జరిగినా ప్రతిపక్షాలపై ఆ నిందలు వేయడం విచక్షణ ఉన్న పాలకుడు చేసే పని ఎంత మాత్రం కాదని మేధావులు అంటున్నారు. అసలు సమస్యకు మూలమేంటో గ్రహించినా పట్టించుకోని విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీ అధికారంలోకి వస్తే ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసి ఒక నిర్ణీత కాల వ్యవధిలోపుగా రిజర్వేషన్లు ఇస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు ప్రకటించారు. ఏటా రూ.1,000 కోట్లు కాపుల సంక్షేమానికి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు నిధులు విడుదల చేయాలని కోరుతూ ముద్రగడ ఇప్పటికే రెండుసార్లు లేఖ రాసినా చంద్రబాబు పట్టించుకోలేదు. తుని సభలో కాపులు అడిగింది కూడా అదే. కానీ చంద్రబాబు తుని సంఘటనలపై స్పందించడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ రెండు ప్రధాన డిమాండ్లపై కాపులకు సంతృప్తి కలిగించే విధంగా ప్రకటన చేయకపోగా పూర్తి రాజకీయ కోణంలో విమర్శలు చేస్తూ పోయారు. కాపుల సమస్యలతో సంబంధంలేని కాల్‌మనీ వ్యవహారాన్ని ముడిపెడుతూ మాట్లాడారు. అంతే కాదు, రాజధానికి అడ్డుపడుతున్నారని, శాంతియుతంగా ఉన్న రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారనీ హూంకరించారు. చివరకు విలేకరులు అడిగిన ఏ ప్రశ్నకూ సూటిగా సమాధానం చెప్పకుండా దబాయించే యత్నం చేయడం స్పష్టంగా కన్పించింది. చిత్తశుద్ధి లేదని తేలిపోయింది.. అధికారంలోకి వచ్చి 20 నెలలు పూర్తయిన తరుణంలో కూడా రిజర్వేషన్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నానని, అధ్యయనం కోసం కమిషన్ వేశామని చెప్పడం.. చంద్రబాబుకు దీనిపై చిత్తశుద్ధి లేదనే విషయాన్ని స్పష్టం చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. కమిషన్ పేరిట కాలయాపనకే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారనేది సుస్పష్టం. వాస్తవానికి ఇప్పటికే కులగణన ఆధారంగా కాపులు ఎంతమంది ఉన్నారు, వారి ఆర్థిక జీవన స్థితిగతులపై వివరాలుండగా ఇంకా జాప్యం చేయడం ఏమిటని రాజకీయవేత్తల్లో ఉత్పన్నం అవుతున్న ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడానికి ఇప్పుడు ఇన్ని కారణాలు చెబుతున్న చంద్రబాబుకు.. ఈ అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చేటపుడు అవి గుర్తుకురాలేదా? ఎలాంటి ఆలోచనలు చేయకుండానే హామీ ఇచ్చారా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. తానే అడ్డుకుంటూ.. బీసీ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పడం అసలు సమస్యను పూర్తిగా తప్పుదోవ పట్టించడానికేనని కూడా అంటున్నారు. బీసీ నేత ఆర్.కృష్ణయ్య టీడీపీ టికెట్‌పై ఎమ్మెల్యేగా 2014 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అప్పటికే కాపులకు రిజర్వేషన్లను కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఈ హామీ దృష్ట్యా తన పార్టీలోనే ఉన్న బీసీ నేత కృష్ణయ్యకు చంద్రబాబు నచ్చ జెప్పేందుకు ప్రయత్నించకుండా ఇంకా ఎక్కడినుంచో అడ్డంకులు ఉన్నాయని మాట్లాడ్డం కూడా అర్థరహితంగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. కృష్ణయ్యను చంద్రబాబు ఎందుకు కట్టడి చేయడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఎవరో అడ్డుకుంటున్నారని, ఎక్కడినుంచో అడ్డంకులు ఉన్నాయని చెబుతున్న చంద్రబాబు.. రాజకీయాలకు అతీతంగా తమ సామాజిక వర్గ ప్రయోజనాల కోసం గర్జన చేస్తున్నామని కాపు నేతలు చెప్పినా.. తెలుగుదేశం పార్టీకి చెందినవారెవరూ అటువైపు వెళ్లవద్దని ఎందుకు అడ్డుకున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాజకీయాలతో సంబంధం లేని అనేకమంది పారిశ్రామికవేత్తలు, మేధావులు, సినీ ప్రముఖులు గర్జనకు మద్దతు పలికినా.. దాన్ని విఫలం చేసేందుకు ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగారు. గర్జనకు వాహనాలు ఇవ్వద్దంటూ ఆంక్షలు విధించడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. తప్పులన్నీ తానే చేసి.. మేనిఫెస్టోలో హామీలు ఇచ్చింది చంద్రబాబు. ఇప్పుడు వాటిని నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నదీ చంద్రబాబే. ఇలా తప్పులన్నీ తానే చేసిన చంద్రబాబు ఇప్పుడు నెపం ఇతరులపై నెట్టడాన్ని అన్ని వర్గాలూ ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు వైఎస్సార్ కాంగ్రెస్‌ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే రాజకీయంగా వైఎస్సార్సీపీ వల్లనే భవిష్యత్తులో బాబుకు ఇబ్బంది. అందుకనే ఏ విషయమైనా సరే.. సంబంధం ఉన్నా లేకున్నా అభాండాలు వేయడం బాబుకు పరిపాటిగా మారింది. బీజేపీకి చెందిన కన్నా లక్ష్మీనారాయణ కూడా తన అనుచరులతో కలిసి గర్జనకు హాజరయ్యారు. మరి ఆ పార్టీ గురించి బాబెందుకు మాట్లాడరు? బీజేపీతో స్నేహం ఉన్నందుకేనా? అని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు.