ఎప్పటిలాగే.. ఎదురుదాడి | chandrababu naidu press meet on kapu agitation | Sakshi
Sakshi News home page

ఎప్పటిలాగే.. ఎదురుదాడి

Published Mon, Feb 1 2016 8:48 AM | Last Updated on Mon, Jul 30 2018 6:25 PM

chandrababu naidu press meet on kapu agitation

తుని ఘటనల నేపథ్యంలో చంద్రబాబు మీడియా సమావేశం
కాపులకు రిజర్వేషన్లపై ఎలాంటి ప్రకటనా చేయని వైనం
అసలు విషయాన్ని పక్కనబెట్టి విమర్శల పర్వం
తన వైఫల్యాలను ఇతర పార్టీలపైకి నెట్టే యత్నం
ఎన్నికల్లో హామీ ఇచ్చింది బాబే.. ఇప్పుడు మాట తప్పిందీ ఆయనే

 
సాక్షి, హైదరాబాద్: తుని సంఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడలో స్పందించిన తీరు ఎప్పటిలాగే ఆయన చేసిన ఎదురుదాడికి నిదర్శనం అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా ఆయన వ్యవహార శైలి ఉందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అసలు విషయాలను పక్క దారి పట్టించడంలో తాను సిద్ధహస్తుడనని చంద్రబాబు అనేక సందర్భాలలో నిరూపించుకున్నారు.

తాజాగా కాపు ఐక్య గర్జన సందర్భంగా చోటుచేసుకున్న సంఘటల విషయంలో కూడా ఇదే విధంగా వ్యవహరించారు. తానే స్వయంగా హామీ ఇచ్చి, టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో సైతం పొందుపరిచినకాపులకు రిజర్వేషన్ల అంశంపై లక్షలాది మంది కాపులు తునిలో చేరి గళమెత్తితే.. ఆ తరువాత ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి స్పందించినప్పుడు ఏదైనా ఆశాజనకమైన ప్రకటన వెలువడుతుందని అంతా ఎదురు చూశారు. కానీ చంద్రబాబు మాత్రం వారి డిమాండ్ల గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా అనవసరమైన అనేక విషయాలను మాట్లాడారనే భావన మేధావులు, విజ్ఞుల్లో సైతం వ్యక్తం అవుతోంది.

అధికారంలోకి రాగానే కాపులను బీసీలో చేర్చుతానని ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొన్న టీడీపీ అధినేత అధికారంలోకి వచ్చి 22 నెలలైనా ఆ విషయం పూర్తిగా విస్మరించారు. కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి ఏడాదికి రూ.1,000 కోట్లు ఇస్తామనిపకటించి, ఇప్పటివరకు రూ.100 కోట్లకు మించనివ్వలేదు. తాజాగా రిజర్వేషన్ల హామీలను నెరవేర్చడంలో తన వైఫల్యాన్ని ఇతరులపై నెట్టేందుకు, బురద జల్లేందుకు బాబు విఫలయత్నం చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అసెంబ్లీలో సైతం ఏ విధంగా అయితే ప్రతిపక్షంపై ఎదురుదాడికి పూనుకుని సమస్యలు చర్చకు రాకుండా చంద్రబాబు పక్కదోవ పట్టించారో, ఇప్పుడు కాపుల అంశంలోనూ అలాగే వ్యవహరిస్తున్నారనే భావన వ్యక్తం అవుతోంది. అప్పటికప్పుడు చోటు చేసుకున్న సంఘటనలను అసలు ఈ వ్యవహారంతో ఏ మాత్రం సంబంధం లేని వారికి ఆపాదించడంతో పాటు, రాజకీయం చేయడం విమర్శలకు తావిస్తోంది.
 
ఏది జరిగినా ప్రతిపక్షంపై నిందలేనా..?!
రాష్ట్రంలో ఏది జరిగినా ప్రతిపక్షాలపై ఆ నిందలు వేయడం విచక్షణ ఉన్న పాలకుడు చేసే పని ఎంత మాత్రం కాదని మేధావులు అంటున్నారు. అసలు సమస్యకు మూలమేంటో గ్రహించినా పట్టించుకోని విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  టీడీపీ అధికారంలోకి వస్తే ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసి ఒక నిర్ణీత కాల వ్యవధిలోపుగా రిజర్వేషన్లు ఇస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు ప్రకటించారు. ఏటా రూ.1,000 కోట్లు కాపుల సంక్షేమానికి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు నిధులు విడుదల చేయాలని కోరుతూ ముద్రగడ ఇప్పటికే రెండుసార్లు లేఖ రాసినా చంద్రబాబు పట్టించుకోలేదు.

తుని సభలో కాపులు అడిగింది కూడా అదే. కానీ చంద్రబాబు తుని సంఘటనలపై స్పందించడానికి ఏర్పాటు చేసిన  విలేకరుల సమావేశంలో ఈ రెండు ప్రధాన డిమాండ్లపై కాపులకు సంతృప్తి కలిగించే విధంగా ప్రకటన చేయకపోగా పూర్తి రాజకీయ కోణంలో విమర్శలు చేస్తూ పోయారు. కాపుల సమస్యలతో సంబంధంలేని కాల్‌మనీ వ్యవహారాన్ని ముడిపెడుతూ మాట్లాడారు. అంతే కాదు, రాజధానికి అడ్డుపడుతున్నారని, శాంతియుతంగా ఉన్న రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారనీ హూంకరించారు. చివరకు విలేకరులు అడిగిన ఏ ప్రశ్నకూ సూటిగా సమాధానం చెప్పకుండా దబాయించే యత్నం చేయడం స్పష్టంగా కన్పించింది.
 
చిత్తశుద్ధి లేదని తేలిపోయింది..
అధికారంలోకి వచ్చి 20 నెలలు పూర్తయిన తరుణంలో కూడా రిజర్వేషన్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నానని, అధ్యయనం కోసం కమిషన్ వేశామని చెప్పడం.. చంద్రబాబుకు దీనిపై చిత్తశుద్ధి లేదనే  విషయాన్ని స్పష్టం చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. కమిషన్ పేరిట కాలయాపనకే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారనేది సుస్పష్టం. వాస్తవానికి ఇప్పటికే కులగణన ఆధారంగా కాపులు ఎంతమంది ఉన్నారు, వారి ఆర్థిక జీవన స్థితిగతులపై వివరాలుండగా ఇంకా జాప్యం చేయడం ఏమిటని రాజకీయవేత్తల్లో ఉత్పన్నం అవుతున్న ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడానికి ఇప్పుడు ఇన్ని కారణాలు చెబుతున్న చంద్రబాబుకు.. ఈ అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చేటపుడు అవి గుర్తుకురాలేదా? ఎలాంటి ఆలోచనలు చేయకుండానే హామీ ఇచ్చారా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
 
తానే అడ్డుకుంటూ..
బీసీ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పడం అసలు సమస్యను పూర్తిగా తప్పుదోవ పట్టించడానికేనని కూడా అంటున్నారు. బీసీ నేత ఆర్.కృష్ణయ్య టీడీపీ టికెట్‌పై ఎమ్మెల్యేగా 2014 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అప్పటికే కాపులకు రిజర్వేషన్లను కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఈ హామీ దృష్ట్యా తన పార్టీలోనే ఉన్న బీసీ నేత కృష్ణయ్యకు చంద్రబాబు నచ్చ జెప్పేందుకు ప్రయత్నించకుండా ఇంకా ఎక్కడినుంచో అడ్డంకులు ఉన్నాయని మాట్లాడ్డం కూడా అర్థరహితంగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. కృష్ణయ్యను చంద్రబాబు ఎందుకు కట్టడి చేయడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు.

ఎవరో అడ్డుకుంటున్నారని, ఎక్కడినుంచో అడ్డంకులు ఉన్నాయని చెబుతున్న చంద్రబాబు.. రాజకీయాలకు అతీతంగా తమ సామాజిక వర్గ ప్రయోజనాల కోసం గర్జన చేస్తున్నామని కాపు నేతలు చెప్పినా.. తెలుగుదేశం పార్టీకి చెందినవారెవరూ అటువైపు వెళ్లవద్దని ఎందుకు అడ్డుకున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాజకీయాలతో సంబంధం లేని అనేకమంది పారిశ్రామికవేత్తలు, మేధావులు, సినీ ప్రముఖులు గర్జనకు మద్దతు పలికినా.. దాన్ని విఫలం చేసేందుకు ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగారు. గర్జనకు వాహనాలు ఇవ్వద్దంటూ ఆంక్షలు విధించడాన్ని వారు గుర్తు చేస్తున్నారు.
 
తప్పులన్నీ తానే చేసి..
మేనిఫెస్టోలో హామీలు ఇచ్చింది చంద్రబాబు. ఇప్పుడు వాటిని నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నదీ చంద్రబాబే. ఇలా తప్పులన్నీ తానే చేసిన చంద్రబాబు ఇప్పుడు నెపం ఇతరులపై నెట్టడాన్ని అన్ని వర్గాలూ ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు వైఎస్సార్ కాంగ్రెస్‌ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే రాజకీయంగా వైఎస్సార్‌సీపీ వల్లనే భవిష్యత్తులో బాబుకు ఇబ్బంది. అందుకనే ఏ విషయమైనా సరే.. సంబంధం ఉన్నా లేకున్నా అభాండాలు వేయడం బాబుకు పరిపాటిగా మారింది. బీజేపీకి చెందిన కన్నా లక్ష్మీనారాయణ కూడా తన అనుచరులతో కలిసి గర్జనకు హాజరయ్యారు.  మరి ఆ పార్టీ గురించి బాబెందుకు మాట్లాడరు? బీజేపీతో స్నేహం ఉన్నందుకేనా? అని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement