సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కాపుల పట్ల చంద్రబాబు నాయుడు మొదటి నుంచీ మోసపూరిత వైఖరే అనుసరిస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. ఈబీసీలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 10 శాతం రిజర్వేషన్లలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇస్తూ కేంద్రానికి హడావుడిగా బిల్లును పంపారని, రాజకీయ లబ్ధి కోసం కేవలం ఎన్నికల ముందు కాపులను మభ్య పెట్టడానికే ఇలా చేశారని ధ్వజమెత్తారు. కాపు రిజర్వేషన్ల అంశంపై తాజా పరిణామాలను వివరించేందుకు కాపు సామాజికవర్గం మంత్రులు, వైఎస్సార్‌సీపీకి చెందిన కాపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సోమవారం ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వారితో మాట్లాడుతూ... కాపు రిజర్వేషన్ల అంశాన్ని తెలుగుదేశం పార్టీ స్వార్థ రాజకీయాలకు ఉపయోగించుకోవాలని చూస్తోందని చెప్పారు. కాపులను టీడీపీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకుంటోందన్నారు. చంద్రబాబు చర్యల వల్ల ఇవాళ కాపులు బీసీలా? ఓసీలా? అన్న ప్రశ్న తలెత్తిందని పేర్కొన్నారు. కాపు ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే..
‘‘కాపు రిజర్వేషన్ల విషయంలో మంజునాథ కమిషన్ నివేదికపై చైర్మన్ సంతకం లేకుండానే చంద్రబాబు దాన్ని అసెంబ్లీలో పెట్టి, తీర్మానం చేశారు. కాపులను బీసీల్లో చేరుస్తూ 2017లో కేంద్రానికి ఒక బిల్లును పంపారు. ఆ తరువాత కేంద్రం ఈబీసీలకు ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం రిజర్వేషన్లను కాపులకు కేటాయిస్తూ మరో బిల్లు పంపారు. కాపులను బీసీల్లో చేరుస్తూ ఇంతకు ముందు పంపిన బిల్లుకు కట్టుబడి ఉన్నారా? లేక ఉపసంహరించుకుంటారా? దీనిపై వెంటనే సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లేఖ రాస్తే దానికి చంద్రబాబు సమాధానం ఇవ్వకుండా నాన్చారు. ఈ అంశంపై కేంద్రం 2019 ఏప్రిల్ 4న లేఖ రాస్తే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు సమాధానం పంపనే లేదు. కాపుల వ్యవహారంలో చంద్రబాబుది తొలి నుంచీ అవకాశవాద ధోరణే అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ ద్వారా అగ్రకులాల్లోని ఆర్థికంగా వెనుకబడిన(ఈబీసీ) వారికి కల్పించిన రిజర్వేషన్లలో కులాల వారీగా విభజించే అవకాశం ఉండదని తెలిసి కూడా చంద్రబాబు ఎన్నికల ముందు కాపులను మభ్య పెడుతూ అందులో 5 శాతం రిజర్వేషన్లను వారికి ఇస్తున్నట్లు నటించారు. పేదరికం ప్రాతిపదికగా ఓసీల్లోని పేదలకు ఈ 10 శాతం రిజర్వేషన్లను కేంద్రం ఇచ్చింది. ఇందులో కులాన్ని ప్రాతిపదికగా తీసుకునే అవకాశమే లేదు. అసలు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఎలా ఇస్తారు? చంద్రబాబు కాపులను బీసీల్లో చేరుస్తూ చేసిన తీర్మానంపై, ఈబీసీ రిజర్వేషన్లలో 5 శాతం రిజర్వేషన్లను కాపులకు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాలపై న్యాయస్థానాల్లో కేసులున్నాయి. వీటిని కోర్టులు కొట్టేస్తే పరిస్థితి ఏమిటి? ఇలాంటి పరిస్థితుల్లో అడుగు ముందుకు వేస్తే ఈ కోటా కింద సీట్లు, ఉద్యోగాలు పొందిన వారి గతి ఏమవుతుంది? కాపులకు ఈబీసీ కోటా నుంచి 5 శాతం రిజర్వేషన్లను చంద్రబాబు ఇవ్వడం వాస్తవమే అయితే ఈ ఏడాది వైద్య పీజీ సీట్ల భర్తీలో దీన్ని ఎందుకు అమలు చేయలేదు? ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చింది. దీనికి విరుద్ధంగా అడుగులు వేయగలమా?
కాపుల ఆశలపై నీళ్లు చల్లారు
ఈబీసీలకు రిజర్వేషన్లు కల్పించిన వారం రోజుల్లోపే కేంద్రం దీనిపై మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ, చంద్రబాబు మాత్రం ఏప్రిల్ 11న ఎన్నికలు అయితే మే 6న మార్గదర్శకాల కోసం కమిటీ వేశారు. ఈబీసీలకు కేంద్రం ఇచ్చిన కోటాలో 5 శాతం రిజర్వేషన్లను కాపులకు ఇస్తామనడం ద్వారా బీసీల్లో చేరుస్తామంటూ గతంలో వారికి కల్పించిన ఆశలపై కూడా చంద్రబాబు నీళ్లు చల్లారు. కాపు రిజర్వేషన్లపై వైఎస్సార్‌సీపీ తొలినుంచీ ఒకే వైఖరితో ఉంది. రాజ్యాంగం నిర్దేశించిన మేరకు మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా, బీసీల ప్రయోజనాలకు నష్టం జరగకుండా, వారి హక్కులకు భంగం కలగకుండా కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలన్నదే మేము మొదటి నుంచీ చెబుతున్న విధానం. కాపుల రిజర్వేషన్లకు మేము ఎప్పుడూ వ్యతిరేకం కాదు. వారి రిజర్వేషన్లకు మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది.
మంజునాథ కమిషన్ నివేదికను పరిశీలించండి
ఎన్నికల ముందు ప్రకటించిన విధంగా కాపుల సంక్షేమానికి ప్రతి ఏటా రూ.2,000 కోట్లు కేటాయిస్తాం. ప్రస్తుత బడ్జెట్‌లో రూ.2,000 కోట్లు కేటాయించాం. కాపుల ప్రగతి కోసం ఏటా రూ.1,000 కోట్ల చొప్పున ఇస్తానన్న చంద్రబాబు గత ఐదేళ్లలో కేవలం రూ.1,340 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు’’ అని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆక్షేపించారు. కాపు రిజర్వేషన్లపై మంజునాథ కమిషన్ ఇచ్చిన నివేదికను చూడకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని ఆయన చెప్పారు. అందుకే కమిషన్ నివేదికను పరిశీలించాలని మంత్రి కన్నబాబు, శాసన మండలిలో చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే అంబటి రాంబాబును ముఖ్యమంత్రి ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment