సీఎం జగన్‌తో పార్టీ కాపు నేతలు భేటీ | YSRCP Kapu leaders met CM Jagan Over Kapu Reservation Issue | Sakshi
Sakshi News home page

కాపు రిజర్వేషన్లకు మా మద్దతు ఉంటుంది: సీఎం జగన్‌

Published Mon, Jul 29 2019 1:44 PM | Last Updated on Mon, Jul 29 2019 6:32 PM

YSRCP Kapu leaders met CM Jagan Over Kapu Reservation Issue - Sakshi

సాక్షి, అమరావతి: కాపు రిజర్వేషన్ల అంశాన్ని తెలుగుదేశం పార్టీ తన స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవడానికి ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు తీసుకున్న చర్యల వల్ల ఇవాళ కాపులు బీసీలా? ఓసీలా? అన్న పరిస్థితి తలెత్తిందని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్సార్ సీపీ కాపు ప్రజా ప్రతినిధులు (మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు)  సోమవారం ముఖ్యమంత్రిని అసెంబ్లీ ఛాంబర్‌లో కలిశారు. ఈ సందర్భంగా కాపు రిజర్వేషన్ల అంశంపై తాజా పరిణామాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. కాపు రిజర్వేషన్ల అంశంపై సీఎం జగన్‌ మాట్లాడుతూ.. కాపుల రిజర్వేషన్ల విషయం వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పులేదని, మేనిఫెస్టోలో చెప్పినదానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. కాపు రిజర్వేషన్లపై మంజునాథ్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికను పరిశీలించాల్సిందిగా పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, కురసాల కన్నబాబుకు సూచించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ... ‘ కాపులను బీసీల్లో చేరుస్తూ 2017లో చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ పంపారు. తర్వాత ఈబీసీల్లో కాపులకు 5శాతం రిజర్వేషన్లు ఇస్తూ మరొక లేఖ రాశారు. అసలు కాపులను బీసీల్లో చేరుస్తూ ఇంతుకు ముందు పంపిన బిల్లు పరిశీలనలో ఉంచదలచుకున్నారా? దానికి కట్టుబడి ఉన‍్నారా? లేక ఉపసంహరించాలనుకుంటున్నారా? దీనిపై వెంటనే సమాధానం ఇవ్వాలని చంద్రబాబు సర్కార్‌ను కేంద్రం కోరింది. దీనిపై ఈ ఏడాది ఏప్రిల్‌ 4న కేంద్రం రాసిన లేఖకు చంద్రబాబు సమాధానం పంపలేదు. పేదరికం ప్రాతిపదికగా ఓసీల్లో పేదలకు ఈ పదిశాతం రిజర్వేషన్లు ఇచ్చారు. దాంట్లో కులాన్ని ప్రాతిపదికగా తీసుకునే అవకాశమే లేదు. కులాల పరంగా విభజించే హక్కులేదని తెలిసి కూడా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఎలా ఇచ్చారు?. 

చంద్రబాబు కాపులను బీసీల్లో చేర్చడంపైనా, ఈసీబీల్లో ఇచ్చిన 5శాతం కోటాలపైనా న్యాయస్థానాల్లో కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అడుగు ముందుకు వస్తే ఈ కోట కింద సీట్లు, ఉద్యోగాలు పొందినవారి పరిస్థితి ఏమవుతుంది?. ఈబీసీ కోటాలో కాపులకు తాను ఇచ్చిన 5శాతం రిజర్వేషన‍్లు వాస్తవమే అయితే ఈ ఏడాది వైద్య, పీజీ సీట్లలో చంద్రబాబు సర్కార్‌ ఎందుకు అమలు చేయలేదు?. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో కూడా ఇదే పేర్కొన్నారు కదా?. పిల్లల భవిష్యత్‌ ప్రశ్నార్థకమైతే ఎవరు బాధ్యత వహిస్తారు?. ఓబీసీ జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే...అందులో కాపుల జనాభా యాభైశాతం కన్నా ఎక్కువే ఉంది కదా?. అలాంటప్పుడు దాన్ని 5శాతానికే కట్టడి చేస్తే వారికి అన్యాయం జరగదా?. 

ఈబీసీల్లో పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసింది. దానికి విరుద్ధంగా అడుగులు వేయగలమా?. కేంద్రం ఈబీసీలకు రిజర్వేషన్లు ప్రకటించిన వారంలోపే మార్గదర్శకాలు ఇచ్చేసింది, కానీ చంద్రబాబు మాత్రం 2019, ఏప్రిల్‌ 11న ఎన‍్నికలు జరిగితే.. మే 6న మార్గదర్శకాల కోసం కమిటీ వేశారు. ఈబీసీలకు కేంద్రం ఇచ్చిన కోటాలో అయిదు శాతం రిజర్వేషన్లు ఇస్తాననడం ద్వారా, ఇంతకు ముందు బీసీల్లో చేర్చే అవకాశం ఉందన్న కాపులకు కల్పించిన ఆశలమీద కూడా చంద్రబాబే నీళ్లు జల్లారు. కాపుల రిజర్వేషన్ల విషయం వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎప్పుడూ మార్పులేదు. మొదటి నుంచి మేం చెబుతున్నట్లే బీసీల హక్కులకు భంగం కలగకుండా, వారి ప్రయోజనాలకు నష్టం రాకుండా జరిగే కాపు రిజర్వేషన్లకు మనం వ్యతిరేకం కాదు. కాపు రిజర్వేషన్లకు ఎప్పుడూ మద్దతు ఉంటుంది, మేనిఫెస్టోలో చెప్పినదానికి కట్టుబడి ఉన్నాం. ఈ బడ్జెట్‌లో కాపులకు రూ.2వేల కోట్లు కేటాయించాం. కానీ చంద్రబాబు అయిదేళ్ల పాలనలో ఖర్చు చేసింది కేవలం రూ.1340 కోట్లే’ అని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement