ఇంతకీ కాపులు ఓసీలా? బీసీలా?  | Kapu Community Under Backward Category OR Other Caste, says ummareddy | Sakshi
Sakshi News home page

ఇంతకీ కాపులు ఓసీలా? బీసీలా? 

Published Fri, Feb 8 2019 4:47 PM | Last Updated on Fri, Feb 8 2019 5:44 PM

Kapu Community Under Backward Category  OR Other Caste, says ummareddy - Sakshi

హైదరాబాద్: ప్రత్యేక హోదా కోసం ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ కర్నూరు జిల్లా నంద్యాలలో న్యాయవాది అనిల్‌ ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన మాట్లాడుతూ... హోదా కోసం ఎవరూ సూసైడ్ చేసుకోవద‍్దని కోరారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు శుక్రవారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ..అధికారం కోసమే చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

ఢిల్లీలో ధర్మపోరాటం యాత్ర చేయాలనే ఆలోచన చంద్రబాబుకు నాలుగేళ్ల తొమ్మిది నెలల తర్వాత వచ్చిందంటూ ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ మొదటి నుంచి పోరాడుతుందన్నారు. రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని, ఢిల్లీ దీక్షకు జనాలను తరలించేందుకు అధికారులకు టార్గెట్‌లు పెట్టారన్నారు. నాడు హోదా అని ఉద్యమిస్తే పీడీ యాక్ట్ కింద కేసులు పెడతానని హెచ్చరించిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఇప్పుడు ప్రభుత్వ డబ్బుతో దుబారా దీక్ష చేయబోతున్నారని విమర్శించారు. 

కాపులు ఓసీలా? బీసీలా? 
కాపులకు ఐదు శాతం రిజర్వేషన్‌పై అసెంబ్లీలో పెట్టిన బిల్లు చూస్తే ప్రభుత్వానికి ఏమాత్రం అవగాహన లేదని తేలిపోతుందని ఉమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు. కాపులను కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. 2014కు ముందు కాపులను బీసీలలో చేరుస్తానికి తాము నిర్ణయం తీసుకున్నామని చెప్పిన చంద్రబాబు...2017 డిసెంబర్ 1న మంజునాథ కమిషన్ వేశారని ఆయన గుర్తు చేశారు. ఆరు నెలల్లో నివేదిక కావాలని చెప్పి పలుమార్లు పొడిగింపు ఇచ్చి...చివరికి బలవంతంగా చైర్మన్ సంతకం లేకుండానే ఇద్దరు సభ్యుల నుంచి నివేదిక తీసుకున్నారన్నారు. మరి కాపులు ఓసీలా? బీసీలా? అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు జిమ్మిక్కులు చేయడం చంద్రబాబుకు అలవాటేనని అన్నారు. 

అసెంబ్లీలో ఆ నివేదకను పెట్టి కాపులను బీసీలలో చేరుస్తున్నామని తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని చెప్పిన చంద్రబాబు...కేంద్రం ఆర్థికంగా వెనుకబడిన వారికి ఇచ్చిన పదిశాతం రిజర్వేషన్లలో కాపులకు సగం ఇస్తున్నట్లు ప్రకటించారన్నారు. కాపులకు అయిదు శాతం రిజర్వేషన్లు బిల్లు పెట్టడం కాపులను మోసం చేయడమే అని అన్నారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు కాపులను బీసీలలో చేర్చాలనే ప్రతిపాదన ఏదీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి రాలేదని కేంద్రం తేల్చి చెప్పిందని ఉమ్మారెడ్డి వెల్లడించారు. ఎన్నికల ముందు జిమ్మికులు చేయడం బాబుకు అలవాటేనని అన్నారు. అయిదు శాతం రిజర్వేషన్లు కాపులకు ఇవ్వడానికి రాష్ట్రానికి అధికారం లేదన్నారు. కాపులను అటు బీసీలకు, ఇటు ఓసీలకు దూరం చేస్తున్నారని ఆయన ఆక్షేపించారు. చంద్రబాబు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని అన్నారు. ఆర్థిక వెనకబాటుతనం మీద మాత్రమే 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని, కాపులకు 5శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత తేగలరా అంటూ ఉమ్మారెడ్డి ఈ సందర్భంగా సవాల్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement