సాక్షి, విజయవాడ : పోలవరం ప్రాజెక్ట్ అంశాన్ని ప్రజల దృష్టిని మరల్చేందుకే చంద్రబాబు నాయుడు... కాపు రిజర్వేషన్లను తెరపైకి తీసుకొచ్చారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. శాస్త్రీయత లేని నివేదికలను ఆధారంగా చేసుకొని తీర్మానాలు చేస్తే భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వం మరోసారి కాపులను మోసం చేస్తుందని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.
ఆయన శనివారం విజయవాడలోని వైఎస్‌ఆర్ సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘కాపులను బీసీల్లో చేర్చే చిత్తశుద్ధి బాబులో కనిపించలేదు. కాపులను బీసీల్లో చేర్చే ప్రక్రియ శాస్త్రీయ పద్ధతిలో జరగలేదు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో రిజర్వేషన్లు ఇస్తామని బాబు మూడున్నరేళ్లు కాలయాపన చేశారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఉద్యమానికి దిగటంతో గత్యంతరం లేక 19 నెలల తర్వాత మంజునాథ కమిషన్ వేశారు. కమిషన్ నివేదిక రాకుండానే అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు. శాస్త్రీయత లేని నివేదిక ఆధారంగా బిల్లు పాస్‌చేస్తే... కాపులకు న్యాయం జరుగుతుందా?. అశాస్త్రీయ విధానం ద్వారా రిజర్వేషన్లు ఇస్తే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవు. తన బాధ్యతను ప్రధాని మోదీ నెత్తిన పెట్టి కాపులను మోసం చేయాలని చంద్రబాబు చూస్తున్నారు.
50 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వాలంటే సమగ్ర అధ్యయనం చేయాలని ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కానీ...చంద్రబాబు సర్కార్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. మంజునాథ నివేదిక రాకుండానే తీర్మానం పేరుతో కాపులను మోసం చేయాలని చూస్తున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇంత తొందరపాటు ఎందుకు?.శాస్త్రీయంగా నివేదిక వచ్చిన తర్వాత బిల్లు పాస్ చేయొచ్చు కదా?. ఏ లెక్క ప్రకారం అయిదు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. శాస్త్రీయ పద్ధతి లేకుండా మోసపూరితంగా వ్యవహరించడం దురదృష్టకరం. హడావుడిగా నిర్ణయాలు తీసుకుంటే కోర్టులు జోక‍్యం చేసుకుని కొట్టివేసే ప్రమాదం ఉంది. కోట్ల విజయభాస్కరరెడ్డి హయంలోనూ అదే జరిగింది. ప్రస్తుతం చంద్రబాబు చేస్తున్నది కూడా అలాంటి దుర్మార్గపు చర్యే. ఇప్పటికైనా పునరాలోచించి మంజునాథ కమిషన్ నివేదిక బహిర్గతం చేయండి. లేకుంటే చంద్రబాబును కాపులు క్షమించరు.
ప్రభుత్వానికి మంజునాథ్ కమిషన్ రిపోర్టు చేసిన దాఖలాలు లేవు. మంజునాథ కమిషన్ నివేదిక ఎందుకు వెలుగులోకి రాలేదు. మెజార్టీ సభ్యులు ఇచ్చిన ప్రతిపాదననే పరిగణనలోకి తీసుకున్నారు. మంజునాథ కమిషన్ నివేదికను అసెంబ్లీలో ఎందుకు చర్చించలేదు?. అసెంబ్లీలో హడావుడిగా తీర్మానం చేసి... కాపులంతా సంతోషంగా ఉన్నారనే భ్రమను చంద్రబాబు సర్కార్ చేస్తోంది. మంజునాథ్ కమిషన్ తీర్మానాలను చర్చించకుండా బిల్లును ఆసెంబ్లీలో ఆమోదించారు. కాపులకు 5శాతం రిజర్వేషన్ బిల్లును సభలో తీర్మానం చేసి, కేంద్రం నెత్తిన పడేసే యత్నం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ మీద నీలినీడలు మిమ్మల్ని భయపెడుతున్నాయి. ఆ దృష్టిని మరల్చేందుకే మంజునాథ కమిషన్ రిపోర్టును తెరమీదకి తెచ్చారు. మరోసారి కాపులను మోసం చేసే యత్నం చంద్రబాబు చేస్తున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేతులు దులుపుకుని ఓట్ల కోసం చంద్రబాబు చేసిన యత్నమే ఇది.’ అని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment