సాక్షి, అమరావతి : కాపులను బీసీల్లో చేర్చడంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంజునాథ కమిషన్ నివేదికపై ఏపీ బీసీ కమిషన్ చైర్మన్ మంజునాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఇచ్చే నివేదికే కమిటీ నివేదిక అని, కమిషన్ నివేదిక సెప్టెంబరులోనే పూర్తయిందని...ఈ నివేదిక ఏపీలో అన్ని వర్గాల వారికి ఆమోదయోగ్యంగా ఉంటుందని అన్నారు. శనివారం మంజునాథ్ ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ...కమిషన్ నివేదికను ఒకట్రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. ఆ నివేదిక ఇవ్వడానికి తాను వెళ్లడం లేదని, కమిషన్ కార్యదర్శి కృష్ణమోహన్ వెళతారన్నారు.
కమిషన్‌లోని మిగిలిన ముగ్గురు సభ్యులు వ్యక్తిగతంగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన సంగతి తనను అడగవద్దని, ఆ విషయాన్ని వాళ్లనే అడగాలని మంజునాథ్ అన్నారు. ఇప్పటివరకూ బీసీ కమిషన్ తరపున ఏపీ ప్రభుత్వానికి తాను ఎలాంటి నివేదిక ఇవ్వలేదన్నారు. బీసీ కమిషన్ నిబంధనల ప్రకారం నివేదిక పూర్తైన తర్వాత సభ్యులందరు కలిసి నివేదికపై తీర్మానం చేసిన తర్వాతనే ప్రభుత్వానికి ఇవ్వాలన్నారు. కమిషన్ సభ్యులందరి సంతకాలు లేకుంటే చట్టపరంగా అది బీసీ కమిషన్ నివేదిక కాదన్నారు. తనకు అప్పగించిన బాధ్యతను పూర్తి చేశానని, బీసీ కమిషన్ నివేదిక ప్రభుత్వానికి అందచేస్తామన్నారు. రేపటి నుంచి ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో తమ నివేదికను ప్రధాన కార్యదర్శి లేదా బీసీ సంక్షేమ కార్యదర్శికి అందచేస్తామని తెలిపారు.
కాగా కాపు రిజర్వేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలను బీసీల జాబితాలో చేర్చి ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ సర్కార్ ...నిన్న సభలో బిల్లును ప్రవేశపెట్టింది. అసెంబ్లీ ఏకగ్రీవంగా ఈ బిల్లును ఆమోదించింది.
Comments
Please login to add a commentAdd a comment