సాక్షి, అమరావతి: కాపుల రిజర్వేషన్లపై ఎన్నికల సమయంలో తాము ఏ విషయం అయితే చెప్పామో.. దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా ఎన్నో కులాలు రిజర్వేషన్ల కోసం పోరాటాలు చేస్తున్నాయని, కానీ సుప్రీంకోర్టు తీర్పులను అనుసరించి తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నామని సీఎం వివరించారు. రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాలని సీఎం అన్నారు. కాపు కార్పొరేషన్‌కు ఏడాదికి రెండు వేల కోట్లు కేటాయిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామన్న విషయాన్ని సీఎం ప్రస్తావించారు. దానికి అనుగుణంగానే తొలి బడ్జెట్‌లోనే వారి సంక్షేమం కోసం రెండువేల కోట్ల రూపాయలను కేటాయించినట్లు వైఎస్ జగన్ చెప్పారు.
మంగళవారం బడ్జెట్‌పై చర్చలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. కాపుల సంక్షేమంపై మీ వైఖరి ఏంటో స్పష్టంగా చెప్పాలంటూ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు వేసిన ప్రశ్నకు సీఎం వివరంగా జవాబిచ్చారు. సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. గడిచిన ఐదేళ్ల కాలంలో కాపుల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు చేసింది శూన్యమని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాపులను బీసీల్లో కలుపుతామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. 2014 ఎన్నికల సమయంలో కాపుల సంక్షేమం కోసం చంద్రబాబు అనేక హామీలను ఇచ్చారని.. వాటిలో ఏఒక్కటి కూడా అమలు చేయలేదని సీఎం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
కాపు, తెలగ, బలిజ కులాలకు ఐదేళ్లలో ఐదువేల కోట్లు కేటాయిస్తామని చంద్రబాబు గత ఎన్నికల సమయంలో చెప్పారని, కానీ ఏ బడ్జెట్‌లో కూడా పూర్తి నిధులను ఖర్చు చేయలేదని గుర్తుచేశారు. నిధుల కేటాయింపు విషయంలో కాపులను ఏవిధంగా మోసం చేశారో.. రిజర్వేషన్లలో కూడా అదే విధంగా మోసం చేశారని మండిపడ్డారు. కాపులను నిర్లక్ష్యానికి గురి చేశారు కనుకే చంద్రబాబు ఈరోజు ప్రతిపక్షంలో కూర్చున్నారని, టీడీపీ బలంగా ఉన్న గోదావరి జిల్లాలో ఎన్ని సీట్లు వచ్చాయో ఒక్కసారి పరిశీలించుకోవాలని సీఎం అన్నారు. ఐదేళ్ల కాలంలో కాపులకు ఏం చేశారో కూడా చెప్పలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment