నిలువెత్తు మోసంపై నిందల ముసుగు | Chandrababu's attitude towards Kapu reservation | Sakshi
Sakshi News home page

నిలువెత్తు మోసంపై నిందల ముసుగు

Published Thu, Aug 2 2018 4:08 AM | Last Updated on Tue, Aug 14 2018 7:49 PM

Chandrababu's attitude towards Kapu reservation - Sakshi

సాక్షి, అమరావతి: కాపు సామాజికవర్గంతోపాటు అన్ని కులాలకు ఎన్నికల మేనిఫెస్టోలో పలు హామీలు గుప్పించిన చంద్రబాబునాయుడు ఆదినుంచి మోసపూరిత ఎత్తుగడలతోనే ముందుకు సాగుతున్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చకుండా తన అనుకూల ఎల్లో మీడియా సహాయంతో వక్రీకరణలు చేస్తూ మభ్యపెడు తున్నారు. మోసాల నుంచి బయట పడేందుకు, ఎన్నికలకు ముందు కాపు సామాజిక వర్గాన్ని మరోసారి వంచించేందుకు కొత్త డ్రామాలకు తెర తీశారు.

ఇన్నేళ్లుగా కాపు సామాజిక వర్గాన్ని మభ్యపెట్టిన చంద్రబాబు కొందరు నేతలతో తనకు అనుకూలంగా ప్రకటనలు చేయించుకుంటూ ఎన్నికల గండం గట్టెక్కేందుకు ఎత్తులు వేస్తున్నారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో నెలకొంటున్న పరిణామాలే ఇందుకు తార్కా ణంగా నిలుస్తున్నాయి. గత ఎన్నికలకు ముందు టీడీపీ అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోగా కాపులకు రిజర్వేషన్లు అమలు చేస్తానని ఇచ్చిన హామీని చంద్రబాబు అమలు చేయకపోగా ఇతరులపై నెట్టేసేలా తెరవెనుక కుట్రలు చేస్తున్నారు. కాపు రిజర్వేషన్లకు సంబంధించి నిబంధనల ప్రకారం వెనకబాటు తనంపై అధికా రిక గణాంకాలు, సరైన నివేదికలతో తీర్మానాన్ని పంపించకుండా ఇక కేంద్రమే నిర్ణయం తీసుకోవాలంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు.

మోసం బాబుది.. నెపం ఇతరులపైనా?
ఏ వర్గానికైనా అత్యంత వెనకబాటుతనం ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తారు. గత ఎన్నికలకు ముందు ఆర్నెళ్లలోగా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తానని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. రిజర్వేషన్ల కోసం దీర్ఘకాలం వేచి చూసిన కాపు సామాజిక వర్గం ఆందోళనకు దిగడంతో చంద్రబాబు హడావుడిగా జస్టిస్‌ మంజునాథ్‌ కమిషన్‌ వేశారే తప్ప.. ఆ కమిషన్‌ ద్వారా కాపుల వెనకబాటుతనానికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని సేకరించేందుకు అనువైన పరిస్థితులను కల్పించలేదు. కమిషన్‌కు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందించకుండా పలు ఆటంకాలు సృష్టించారు.

కమిషన్‌ గడువును పదేపదే పొడిగిస్తూ కాలయాపన చేశారు. చివరకు కమిషన్‌ చైర్మన్‌ ఎలాంటి నివేదిక ఇవ్వకుండానే హడావుడిగా సభ్యులతో తూతూమంత్రంగా ఒక నివేదికను సిద్ధం చేసి దాన్నే అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించి కేంద్రానికి తీర్మానం పంపి చేతులు దులుపుకొన్నారు. ఇక తన పని అయిపోయిందని, కేంద్రమే కాపుల రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోవాలని చేతులెత్తేశారు. కేవలం అసెంబ్లీలో తీర్మానం చేశారే తప్ప ఆ తీర్మానాన్నిబలపరిచే గణాంకాలు, నివేదికను కేంద్రానికి అందించకుండా తన మోసపూరిత వైఖరిని చంద్రబాబు మరోసారి చాటుకున్నారు.

ఒకేమాటపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ
కాపుల రిజర్వేషన్లపై వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి నుంచి ఒకటే మాట చెబుతున్నారు. కాపుల డిమాండ్‌ న్యాయబద్ధమైనదని, వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని పలుమార్లు గట్టిగా చెప్పారు. బీసీల రిజర్వేషన్‌ కోటాకు ఇబ్బంది లేకుండా, వారి హక్కులకు భంగం కలుగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని పలుమార్లు జగన్‌  స్పష్టం చేశారు. దీనికి తమ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తోందని అనేక సందర్భాల్లో చెప్పారు.

మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండరాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంటుందని, అందువల్ల కేంద్రం ఈ అంశంలో చర్యలు చేపట్టాల్సి ఉంటుందని కూడా ఆయన వివరిస్తూ వచ్చారు. ఇదే విషయాన్ని ఇటీవల జగ్గంపేటలో ప్రకటించారు. అయితే దీన్ని టీడీపీ నేతలు వక్రీకరించి దుష్ప్రచారానికి దిగారు. వైఎస్సార్‌ సీపీ కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకమన్నట్లుగా తప్పుడు ప్రచారానికి ఒడిగట్టారు.

కాపుల రిజర్వేషన్ల డిమాండ్‌ న్యాయబద్ధమైనదని, బీసీ రిజర్వేషన్లకు భంగం వాటిల్లకుండా వారికి ఆ ప్రయోజనం కల్పించాల్సి ఉంటుందని, దీనిపై కేంద్రం చర్యలు తీసుకోవలసి ఉంటుంది కనుక ఆ మేరకు తాము అధికారంలోకి రాగా>నే ప్రయత్నిస్తామని జగన్‌ మరోసారి పిఠాపురం సభలో స్పష్టం చేశారు. అయినా కూడా చంద్రబాబునాయుడు, పచ్చమీడియా, కొందరు నేతలు వైఎస్సార్‌ సీపీపై తెరవెనుక కుట్రలను కొనసాగిస్తూనే ఉన్నారు.

బాబుకు చిత్తశుద్ధి ఏది?
కాపులకు రిజర్వేషన్లపై చంద్రబాబుకు మొదటినుంచి చిత్తశుద్ధి లేదు. కాపు సామాజిక వర్గానికి ఐదేళ్లలో రూ.ఐదు వేల కోట్లు ఇస్తామని ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసిన టీడీపీ హామీని నిలబెట్టుకోలేదు. ఇప్పటివరకు ఇచ్చింది రూ.వెయ్యికోట్లకు మించలేదు. తన మోసాలను కప్పిపుచ్చుకోవడానికి తాజాగా కాపు రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్‌లో కేంద్రంతో గొడవపడాలంటూ తన పార్టీ ఎంపీలను ఆదేశించినట్లు పచ్చ మీడియాలో వార్తలు వండివార్చారు.

2014 ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోగా కాపులను బీసీల్లో చేర్చి రిజర్వేషన్లు కల్పిస్తామంటూ చంద్రబాబు హామీ ఇవ్వడం తెలిసిందే. దీనిపై చాలాకాలం ఓపికతో ఎదురుచూసిన కాపు సామాజికవర్గం గత్యంతరం లేక కాపు జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) పేరుతో ఉద్యమాలు చేపట్టింది. కాపుల ఉద్యమాన్ని అణచివేసేందుకు చంద్రబాబు నానా ప్రయత్నాలు చేశారు. కాపు జేఏసీ ఉద్యమం తీవ్రరూపం దాల్చిన సమయంలో తునిలో జరిగిన అవాంఛనీయ ఘటనల వెనక ప్రభుత్వ కుట్ర దాగినట్లు ఆరోపణలున్నాయి.  

హడావుడిగా అసెంబ్లీలో బిల్లు
పోలవరం పనుల్లో అక్రమాలు బహిర్గతం కావడం, ప్రాజెక్టు పనులపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి పెట్టటంతో రాష్ట్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది. టీడీపీ సర్కారు అవినీతి వ్యవహారాలు కేంద్రం రాసిన లేఖతో బట్టబయలు కావడంతో రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హడావుడిగా కాపు రిజర్వేషన్ల బిల్లు అంశాన్ని తెరపైకి తెచ్చారు.

కమిషన్‌ చైర్మన్‌ అప్పటికి ఇంకా నివేదిక ఇవ్వకున్నా, ఆయనతో సంబంధం లేకుండా ఇతర సభ్యులతో ఇప్పించుకున్న నివేదికనే అసెంబ్లీలో ప్రవేశపెట్టి తూతూమంత్రంగా తీర్మానం చేసి కాపులకు రిజర్వేషన్లను కల్పించాలంటూ కేంద్రానికి తీరా>్మనం  పంపారు. తాను ఎలాంటి నివేదిక ఇవ్వలేదని, సభ్యులు నివేదిక ఇచ్చిన సంగతి తనకు తెలియదని అప్పట్లోనే కమిటీ ఛైర్మన్‌ జస్టిస్‌ మంజునాథ్‌ ఖండించారు. దీన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం తప్పదోవ పట్టిస్తూ కాపు రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రంపైకి నెట్టేసింది.

గణాంకాలు పంపకుండా వంచన
వాస్తవానికి కమిషన్‌ నివేదికపై ప్రజాభిప్రాయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఏదైనా కులానికి రిజర్వేషన్లు కల్పించాలంటే సామాజిక, ఆర్థిక తదితర అంశాల్లో వెనుకబాటుతనానికి సంబంధించి సవివర నివేదికను రూపొందించాల్సి ఉంటుంది. రిజర్వేషన్లు 50 శాతానికి మించితే పార్లమెంట్‌లో చర్చించి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాల్సి ఉంటుంది.  అలా చేర్చాలంటే ఆయా కులాలకు వెనుకబాటుతనానికి సంబంధించి సమగ్ర సమాచారం జత చేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది.

ఇన్ని నిబంధనలు పాటించాల్సి ఉన్నా చంద్రబాబు ఏ ఒక్కటీ పట్టించుకోలేదు. అసలు చైర్మన్‌ సంతకం లేకుండానే మంజునాథ్‌ కమిషన్‌ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టడమే చంద్రబాబు మోసపూరిత వైఖరిని రుజువు చేస్తోంది. కీలకమైన వెనుకబాటుతనానికి సంబంధించిన గణాంకాల నివేదికను జత చేయకుండానే తీర్మానాన్ని పంపడంపై కేంద్ర న్యాయశాఖ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలా ఇన్ని రకాలుగా తప్పులు, మోసాలతో చంద్రబాబు కాపు సామాజికవర్గాన్ని వంచించారు. ఇప్పడు ఆయనే కేంద్రంపై పోరాడాలంటూ తన ఎంపీలను ఉద్బోధించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement