
జగన్‌ను టార్గెట్ చేయండి
సాక్షి, విజయవాడ బ్యూరో: తూర్పుగోదావరి జిల్లా తుని ఘటనపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని టార్గెట్ చేయాలని, మూకుమ్మడిగా ఎదురుదాడికి దిగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలను ఆదేశించారు. ఇదంతా జగన్ వల్లే జరిగిందని, ఆయనే చేయించాడనే పరిస్థితిని సృష్టించాలని దిశానిర్దేశం చేశారు. మరోవైపు కాపు నాయకులు, పెద్దలతో మాట్లాడి ప్రభుత్వం వారికి అనుకూలంగా ఉన్నట్లు చెప్పి నమ్మించాలని సూచించినట్లు సమాచారం.
కాపు ఐక్యగర్జన తర్వాత పరిణామాలు టీడీపీకి పూర్తి వ్యతిరేకంగా మారడంతో ఎలా తిప్పికొట్టాలనే దానిపై సోమవారమంతా చంద్రబాబు తన క్యాంపు కార్యాలయంలో సమాలోచనలు జరిపారు. అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దుచేసుకున్న ఆయన ఉదయం నుంచి పలువురు కాపు ప్రజాప్రతినిధులు, నేతలతో మాట్లాడి మధ్యాహ్నం మంత్రులు, ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. కాపు గర్జన తర్వాత పరిణామాలు, అక్కడ పరిస్థితి, దాని ప్రభావం జిల్లాల్లో ఎలా ఉందనే అంశాలపై చర్చించారు.
అంతకుముందు మంత్రులు తమకు తెలిసిన సమాచారాన్ని చెప్పగా మొదట జగన్‌పై విమర్శల దాడి పెంచాలని సూచించారు. పులివెందుల రౌడీలే తునికి వచ్చి ఇదంతా చేసినట్లు జనంలోకి తీసుకెళ్లాలని పదేపదే చెప్పడం, ఈ విషయాన్ని కిందిస్థాయి నాయకులు, క్యాడర్ క్కూడా చెప్పి ప్రచారం చేయించాలని నిర్దేశించారు.
సీఎంను కలిసేందుకు అంగీకరించని కాపు నేతలు
కాపు పెద్దలతో ఇప్పటికిప్పుడే మాట్లాడాలని చంద్రబాబు సూచించడంతో మంత్రులు తమ జిల్లాల్లోని కాపు నేతలు, ఇతర పార్టీల్లోని కాపు నాయకులకు ఫోన్లు చేసినట్లు తెలిసింది. కాపులకు అనుకూలంగా ఉన్నామని చెబుతూనే, బీసీల్లో వ్యతిరేకత రాకుండా వారితో కూడా మాట్లాడాలని సీఎం సూచించారు. కాపు నాయకులు, పెద్దలను తన వద్దకు తీసుకురావాలని సీఎం కోరడంతో.. మంత్రులు ఆహ్వానించినా ఎవరూ అందుకు అంగీకరించలేదని తెలిసింది. కొందరు ఎమ్మెల్యేలు, నాయకులు కాపు నేతల్ని తీసుకొస్తామని చెప్పినా కాపులు గౌరవించే స్థాయిలో ఉన్న వారితోనే మాట్లాడాలని సూచించినట్లు సమాచారం.
పెద్ద నేతలు ఎవరూ ముఖ్యమంత్రి వద్దకొచ్చే పరిస్థితి లేకపోవడంతో త్వరలో కాపు ప్రజాప్రతినిధులు, నాయకులు, పెద్దలతో సమావేశం కావాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. పలువురు మంత్రులు ముద్రగడ పద్మనాభంతో చర్చించాలని సూచించినా చంద్రబాబు అంగీకరించలేదని సమాచారం. ఆయనతో మాట్లాడితే ప్రభుత్వం దిగివచ్చినట్లు అవుతుందని అందుకే ఆయనపైనా ఆరోపణలు గుప్పించాలని ఆదేశించారు.
జగన్, ముద్రగడ కలసి ఇదంతా చేస్తున్నారనే వాదనను జనంలోకి తీసుకెళ్లాలని సూచించారు. ముద్రగడను ఏకాకిని చేసేలా కాపు నాయకులతో ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడించాలని, అలా ఎవరు ఉన్నారో గుర్తించాలని చెప్పినట్లు సమాచారం. ఆయన నిరవధిక దీక్ష ప్రారంభించే లోపు ఉద్యమాన్ని పక్కదారి పట్టించాలని నేతలను ఆదేశించారు. సీఎం సూచనలతో మంత్రులు, నేతలు క్యాంపు కార్యాలయంలోని మీడియా పాయింట్‌కు క్యూకట్టి విమర్శల వర్షం కురిపించారు.