
'ఉక్కుపాదం మోపడం దారుణం'
సాక్షి, కాకినాడ: రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న కాపులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం దారుణమని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. హామీలు అమలు చేయమని అడిగితే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. పోలీసుల దాడిలో గాయపడి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాపు జేఏసీ నాయకుడు వాసిరెడ్డి ఏసుదాసును ఆయన పరామర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా, లేదా అని నిలదీశారు. తమ జాతి ప్రయోజనాల కోసం ముద్రగడ పద్మనాభంకు పాదయాత్ర చేసే హక్కు లేదా అని అడిగారు. ఆయనకు ఏం జరిగినా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. పోలీసుల వల్లే ఏసుదాసు కాలికి గాయమైందని, ఉద్యమకారులతో వ్యవహరించడం అలాగేనా అని ప్రశ్నించారు.
కాగా, తూర్పుగోదావరి జిల్లా వీరవరం వద్ద ముద్రగడ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను తమ వ్యానులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళుతున్నారనేది పోలీసులు వెల్లడించలేదు. వ్యానులోంచి ముద్రగడ తన మద్దతుదారులకు అభివాదం చేశారు.