
'వెనక్కి తగ్గం, బెదిరింపులకు భయపడం'
సాక్షి, కిర్లంపూడి: గాంధేయ మార్గంలో పాదయాత్ర చేస్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం సరికాదని కాపు జేఏసీ నాయకుడు వాసిరెడ్డి ఏసుదాసు అన్నారు. తమను పశువుల్లా చేస్తున్నారని, ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీకి డీజీపీ సాంబశివరావు తొత్తులా మారారని, రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. రిజర్వేషన్లపై తమకు ఇచ్చిన హామీని నెరవేర్చేవరకు వెనక్కి తగ్గబోమని, ప్రభుత్వ బెదిరింపులకు భయపడబోమని అన్నారు. కాపు జాతి ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు.
కాగా, ముద్రగడ పద్మనాభం పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంతో కాపు జేఏసీ నేతలు అభ్యంతరం చెప్పారు. ఈ సందర్భంగా ఏసుదాసు కాలికి గాయమైంది. కాకినాడలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయనను వైఎస్సార్ సీపీ నాయకుడు అంబటి రాంబాబు పరామర్శించారు.