
‘దేశం’ నుంచి మున్సిపల్ చైర్మన్ కోత సస్పెన్షన్
ఉత్తర్వులు జారీ చేసిన అధిష్టానవర్గం
పూర్ణచంద్రరావుకు మద్దతుగా ఏడుగురు కౌన్సిలర్లు టీడీపీకి రాజీనామా
కాశీబుగ్గ: పలాస తెలుగుదేశం పార్టీలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. పలాస–కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో అతన్ని టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ ఎన్టీఆర్ భవన్ నుంచి మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. మున్సిపల్ చైర్మన్‌గా బాధ్యత గల పదవిని నిర్వహిస్తూ పార్టీ క్రమశిక్షణకు భంగం వాటిల్లేలా వ్యవహరిస్తున్నందున పార్టీ అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ కేంద్ర కార్యాలయాల కమిటీ కన్వీనర్, ఎంఎల్‌సీ వీవీవీ చౌదరి పేరుతో పంపించిన లేఖలో స్పషం చేశారు.
పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీకి, మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావుల మధ్య ఇటీవల విభేదాలు నెలకొన్నాయి. పలాస ఎమ్మెల్యే స్థానాన్ని శివాజీ కుమార్తె, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు శిరీషా ఆశిస్తుండగా...దాన్ని పూర్ణచంద్రరావు వ్యతిరేకిస్తున్నారనే ప్రచారం ఇటీవల జరిగింది. ఈ విషయం వీరిరువురి మధ్య విభేదాలకు దారి తీసింది. ఈ క్రమంలోనే శివాజీ అల్లుడు వెంకన్నచౌదరి, మంత్రి అచ్చెన్నాయుడు ఒత్తిడితో కోతను పార్టీ నుంచి సస్పెండ్ చేయించారనే గుసగుసలు పలాస పట్టణంలో షికారు చేస్తున్నాయి.
స్థానికేతరులను వెంటబెడతాం
పలాస ఎమ్మెల్యే శివాజీ తీరుపై రాజీమానా చేసిన కౌన్సిలర్లు మండిపడ్డారు. నియోజకవర్గంలో రాచరిక పాలన నడుస్తోందని, స్థానికంగా పోలీసులను తొత్తులుగా వాడుకొని భయభ్రాంతులకు గురి చేసి ఎమ్మెల్యే శివాజీ పబ్బం గడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి నుంచి వచ్చిన రాజకీయాలను కూతురుకి అందజేయాలనే తాపత్రయంలో నియోజకవర్గ అభివృద్ధిని మరిచి పదవినే ఎమ్మెల్యే చూసుకుంటున్నారని, కనీసం విచారణ చేయకుండా సస్పెండ్ చేయడంతో షాక్‌కు గురయ్యామని 24వ వార్డు కౌన్సిలర్ పాతాళ ముకుందరావు విలేకరుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.
హుద్‌హుద్ ఇళ్ల కోసం మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే ఆడదాన్నని కూడా చూడకుండా తమపై కేసులు నమోదు చేశారని దీనికి నిరసనగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నామని, దీంతోపాటు పార్టీ నిర్ణయానికి నిరసన తెలియజేస్తున్నామని కోఆప్సన్ సభ్యురాలు లక్ష్మీప్రధాన్ అన్నారు. స్థానికేతరులు పలాస ప్రజలను అభివృద్ధి చేయకుండా రాజకీయాలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతామని పలువురు కౌన్సిలర్లు హెచస్చరించారు.
విచారణ జరిపించి ఉంటే బాగుండేది
పలాస నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై పార్టీ అధిష్టానం విచారణ జరిపి చర్యలు చేపట్టి ఉంటే బాగుండేది. వాస్తవంగా గ్రౌండ్‌స్థాయిలో ఏం జరుగుతుందో పూర్తిగా తెలుసుకోకుండా సస్పెండ్ చేయడం బాగోలేదు. కనీసం వివరణ కూడా కోరలేదు. ఇదివరకు పార్టీలో ఎవరైనా క్రమశిక్షణ చర్యలకు పాల్పడితే వారితో మాట్లాడడం జరిగేది. సంబంధిత పరిస్థితులపై పూర్తిస్థాయి విచారణ జరిపించాల్సి ఉండగా ఏకపక్షంగా మాత్రమే ప్రవర్తించడం దారుణం. ప్రస్తుతం మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలే నిర్ణయిస్తారు.
– కోత పూర్ణచంద్రరావు, మున్సిపల్ చైర్మన్, పలాస–కాశీబుగ్గ.