రండి బాబూ రండి! | Municipal Corporation, Best City Award | Sakshi
Sakshi News home page

రండి బాబూ రండి!

Published Tue, May 5 2015 4:05 AM | Last Updated on Sun, Sep 3 2017 1:25 AM

రండి బాబూ రండి!

రండి బాబూ రండి!

నేనండీ నగరపాలక  సంస్థను. ది బెస్ట్ సిటీ అవార్డును దక్కించుకున్న కార్పొరేషన్‌ను. నా దగ్గర పనిచేసిన అధికారులు ఎందరో అవార్డులు సాధించారు. ఇదంతా గతం. ఒకప్పుడు వీఎంసీలో పనిచేయాలంటే పోటీపడే అధికారులు ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. ఇదివరకు పెత్తనం వెలగబెట్టిన ప్రజాప్రతినిధులు నిర్దాక్షిణ్యంగా పీకల్లోతు అప్పుల ఊబిలోకి నెట్టేశారు. అధికారులు నాకు అవినీతి మకిలి అంటించి అల్లరిపాల్జేశారు. ఇప్పుడు పనిచేసేందుకు పిలుస్తుంటే వామ్మో అంటూ అధికారులు వెనుదిరిగిపోతున్నారు. విధులు నిర్వర్తిస్తున్నవారు సైతం నన్నొదిలి  వెళ్లిపోయేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఏడాదికి  వెయ్యి కోట్ల బడ్జెట్ ఉన్న నా దగ్గర పనిచేసేందుకు అధికారుల్ని తీసుకురాలేకపోతున్నామనే బాధ పాలకుల్లో కనిపించడం లేదు. బదిలీలపై త్వరలో బ్యాన్ సడలిస్తున్న  నేపథ్యంలోనైనా అధికారుల్ని తీసుకొచ్చే బాధ్యతను పాలకులు తీసుకుంటే బాగుంటుందని నా ఆశ..    
 
విజయవాడ సెంట్రల్ :   నగరపాలక సంస్థలో  పనిచేసేందుకు అధికారులు ససేమిరా అంటున్నారు. దీంతో కీలక విభాగాల్లో  నెలల తరబడి ఇన్‌చార్జులదే పాలన. మరికొన్ని ప్రధాన విభాగాలు ఖాళీ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయని సమాచారం. సిటీప్లానర్‌గా ఎస్.చక్రపాణి క్యాపిటల్ రీజియల్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్‌డీఏ)కు వెళ్లేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారని సమాచారం. అకౌంట్స్ ఆఫీసర్ కె.అంబేద్కర్ 15 రోజులు మెడికల్ లీవ్ పెట్టారు. బదిలీ ప్రయత్నాలకోసమేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. అసిస్టెంట్ అగ్జామినర్ పోస్టు మూడు నెలలుగా ఖాళీగానే ఉంది. దీన్ని భర్తీ చేయాలని ఆడిట్ శాఖ డెరైక్టర్‌కు అధికారులు లేఖ రాశారు. ఇక్కడ పనిచేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం వల్లే పోస్ట్ భర్తీ కావడం లేదని  సమాచారం. టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేసే నలుగురు బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు టీపీఎస్‌లు పదోన్నతులపై వివిధ ప్రాంతాలకు బదిలీ అయ్యారు. వాళ్లు రిలీవ్ అయితే టౌన్‌ప్లానింగ్ విభాగం సగం ఖాళీ అవుతుంది.
 సీట్లు ఖాళీ..  చీఫ్ ఇంజినీర్ పోస్టుకి ఏడాదిన్నరగా ఇన్‌చార్జే ఉన్నారు. 2013లో పనిచేసిన సీఈ కొండలరావు, నాటి కమిషనర్ పండాదాస్‌ల మధ్య వివాదం తలెత్తడంతో సీఈని మాతృశాఖ మెప్మాకు సరెండర్ చేశారు. నాటి నుంచి ఇక్కడ పనిచేసేందుకు సీఈ స్థాయి అధికారి ముందుకు రావడం లేదు. 

యూసీడీ పీవో పోస్టు మూడు నెలలుగా ఇన్‌చార్జి పాలనలోనే ఉంది. గతంలో పీవోగా పనిచేసిన ఎం.శకుంతల ఇక్కడ పనిచేసేందుకు ఏమాత్రం సుముఖత చూపలేదు. కింది స్థాయి సిబ్బంది  సహకరించడం లేదని నాటి కమిషనర్ హరికిరణ్‌కు పలుమార్లు మొరపెట్టుకున్నా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. పనితీరు బాగోలేదని కమిషనర్ జి.వీరపాండియన్ ఫిబ్రవరిలో ఆమెను సరెండర్ చేశారు. సూపరింటెండెంట్ విజయలక్ష్మిని పీవో ఇన్‌చార్జిగా నియమించారు. పని ఒత్తిడితో ఆమె ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎప్పుడెప్పుడు బయటపడదామా అనే ఆలోచనలో ఉన్నారు. లీగల్ సెల్, సెక్రటరీ సెల్, ప్రాజెక్ట్ విభాగాల్లో  ఇన్‌చార్జులతో కాలం గడిపేస్తున్నారు.  డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) డి.వెంకటలక్ష్మిని ఈ ఏడాది జనవరిలో సెక్రటేరియెట్‌కు బదిలీ చేస్తూ ఎంఏయూడీ ఉత్తర్వులు జారీ చేసింది. రిలీవర్ లేని కారణంగా ఆమె ఇక్కడే విధులు నిర్వర్తించాల్సి వస్తోంది.

 ప్రజాప్రతినిధుల జోక్యం..

 పెరిగిన పనిభారం, రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఇక్కడ పనిచేయడం కష్టం అనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలు నేరుగా పాలనలో జోక్యం చేసుకోవడం, మేయర్ దానికి అభ్యంతరం చెప్పడం తదితర కారణాల నేపథ్యంలో నలిగిపోతున్నామని కొందరు అధికారులు వాపోతున్నారు. మొత్తానికి వీఎంసీలో కొలువంటే అధికారులు బెంబేలెత్తుతున్నారు.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement