మార్కెట్‌లో టీడీపీ కార్యకర్తలకు కేటాయించిన డీజే కాంప్లెక్స్, మార్కెట్‌లోని డీజే కాంప్లెక్స్
సాక్షి, ఒంగోలు అర్బన్: అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, నాటి నగరపాలక కమిషనర్ వెంకటకృష్ణ కుమ్మక్కై కోట్ల విలువైన స్థలాన్ని తెలుగు తమ్ముళ్లకు కట్టబెట్టారు. నగరపాలక సంస్థకు చెందిన దామోదరం సంజీవయ్య కూరగాయల మార్కెట్‌లో ఎటువంటి అనుమతులు లేకుండా తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 షాపులు నిర్మించి ధారాదత్తం చేశారు. మార్కెట్ విలువ ప్రకారం సదరు స్థలం రూ.3 కోట్లపైనే ఉంటుంది. ఆ కాంప్లెక్స్‌కు డీజే (దామచర్ల జనార్దన్) కాంప్లెక్స్ అని కూడా నామకరణం చేశారు. సదరు డీజే కాంప్లెక్స్‌కు సంబంధించి ఇంజినీరింగ్ విభాగం అధికారులు, అసిస్టెంట్ కమిషనర్, రెవెన్యూ అధికారి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు ఒకరికి ఒకరు పొంతన లేని వివరణలు ఇవ్వడం విశేషం. అధికారుల తడబాటును చూస్తే కచ్చితంగా కూరగాయల మార్కెట్‌లోని డీజే కాంప్లెక్స్ అనధికారిక నిర్మాణం అని తేటతెల్లమవుతోంది.
స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడికి నగరపాలక అధికారులు ఎంత నలిగిపోతున్నారో డీజే కాంప్లెక్స్‌పై వివరణలు చెప్పడంలో అర్థమవుతోంది. ఇంకా ఎవరికీ షాపులు కేటాయించలేదని ఒక అధికారి అంటుంటే మరొకరు వేలం వేసి కేటాయించామని అంటున్నారు. ఇంకొకరు మాకేం సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే ఆయన హయాంలో ఒక్క పేదవాడికి ఒక్క పట్టా ఇచ్చిన దాఖలాలు లేవు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన బాలినేని సుమారు 10 వేల పట్టాలు పేదలకు ఇళ్ల స్థలాలకు సంబంధించి పంపిణీ చేసిన సంగతి తెలిసిందే.
మొదట్లో ఊరచెరువు సర్వే నంబర్ 14/1లోని 7 ఎకరాల స్థలంలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ నిర్మాణాలు చేసి అగ్రికల్చర్ మార్కెట్‌ను ఏర్పాటు చేసుకుంది. 2007లో సదరు 7 ఎకరాలను నగరపాలక సంస్థ ఏఎంసీతో ఒప్పందాలు చేసుకుని స్వాధీన పరుచుకుంది. అప్పటి నుంచి దామోదరం సంజీవయ్య కూరగాయల మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. మార్కెట్‌లో పడమర వైపు రిటైల్ కూరగాయల వ్యాపారం కోసం షాపులు కేటాయించగా, తూర్పు వైపు డిజైన్ ప్రకారం హోల్‌సేల్ మార్కెట్ షాపులు కేటాయించారు. హోల్‌సేల్ షాపులకు దక్షిణం వైపున డిజైన్ ప్రకారం లోడ్‌తో వచ్చిన లారీలను పార్కింగ్ చేసుకునేందుకు స్థలం కేటాయించారు.
స్థానిక ఎమ్మెల్యే కన్ను ఆ స్థలంపై పడింది. అంతే వెంటనే నాటి ఓఎంసీ కమిషనర్‌కు హుకుం జారీ చేసి ఆ స్థలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు షాపుల కేటాయించాలని వారే స్వయంగా నిర్మించుకుంటారని చెప్పడంతో వెంటనే షాపుల నిర్మాణం జరిగిపోయి డీజే కాంప్లెక్స్‌గా వెలిసింది. డీజే కాంప్లెక్స్ ఏర్పడేందుకు సహకరించిన కమిషనర్‌కు, దానికి ఆదేశాలు జారీ చేసిన ఎమ్మెల్యేకు దాదాపుగా రూ.10 లక్షలు ముట్టినట్లు సమాచారం.
ముస్లింల నోరుకొట్టి..
అక్రమంగా నిర్మించి టీడీపీ కార్యకర్తలకు కేటాయించిన డీజే కాంప్లెక్స్‌కు పడమర వైపు కూతవేటు దూరంలో ఉన్న బండ్లమిట్టలో గత 30 ఏళ్లుగా చిన్నపాటి వ్యాపారాలు చేసుకుని జీవిస్తున్న ముస్లింలకు చెందిన షెడ్లను స్థానిక ఎమ్మెల్యే, కమిషనర్‌లు పోలీసు బందోబస్తుతో పొక్లయినర్‌లతో బలవంతంగా 2015లో తొలగించారు. ఆ సమయంలో తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. కేవలం బాలినేని అభిమానులు కావడం వలనే 30 ఏళ్ల నాటి వ్యాపార కేంద్రాలను కూలదోశారనే విమర్శలు వెల్లువెత్తాయి. ముస్లింల షాపుల తొలగింపుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు.
కోర్టు ఉత్తర్వులు ధిక్కరించి మరీ..
14/1 ఊరచెరువుకు సంబంధించి మొత్తం 77 ఎకరాల స్థలం ఉండగా దానిలో 7 ఎకరాల్లో దామోదరం సంజీవయ్య కూరగాయల మార్కెట్ ఉంది. ఒక ప్రైవేటు వ్యక్తి స్థలానికి సంబంధించి నగరపాలక సంస్థతో వివాదం ఉండటంతో హైకోర్టును (రిట్ పిటిషన్ 7981/2012) ఆశ్రయించాడు. దీంతో హైకోర్టు సదరు సర్వే నంబర్‌ను వాటర్ బాడీగా భావిస్తూ ఆ సర్వే నంబర్‌లో ఎటువంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదని ఒకవేళ ఇస్తే కోర్టు ధిక్కారం కింద వస్తుందని ఉత్తర్వులు జారీ చేసింది.
కోర్టు ఉత్తర్వులను సైతం బేఖాతరు చేస్తూ స్థానిక ఎమ్మెల్యే తన అనుచరులచే కాంప్లెక్స్ నిర్మాణం చేసి షాపులను కేటాయించారు. దానికి నాటి కమిషనర్ పూర్తిస్థాయిలో సహకరించి నగరపాలక ఆస్తులను ధారాదత్తం చేశారు. మొత్తం మీద టీడీపీ కార్యకర్తలకు షాపులు ఇచ్చినా బిజినెస్ బిజినెస్సే.. బావమరిది బావమరిదే అన్నట్లు లక్షల్లో వసూలు చేసుకున్నారు. దీనిపై వివరణ అడిగితే నగరపాలక అధికారులు పొంతన లేని సమాధానాలు ఇస్తున్నారు.
ఎన్నికలయ్యాక వేలం నిర్వహిస్తాం..
బాధ్యతలు స్వీకరించే సమయానికే కాంప్లెక్స్ ఉంది. అయితే ఆ షాపులు ఇంకా ఎవరికీ కేటాయించలేదు. ఎన్నికల కోడ్ ఉన్నందున ఆ ప్రక్రియ నిలిపివేశాం. ఎన్నికల అనంతరం వేలం నిర్వహించి పద్ధతి ప్రకారం షాపుల కేటాయిస్తాం.
– శకుంతల ప్రస్తుత కమిషనర్
మార్కెట్ లోపల నిర్మాణాలకు మాకు సంబంధం లేదు
మార్కెట్ లోపల జరిగిన నిర్మాణాలకు, మాకు ఎటువంటి సంబంధంలేదు. ఏ విధంగా కేటాయించారు, ఎలా నిర్మించారనే వివరాలు మాకు తెలియవు. ఆ కాంప్లెక్స్‌కు సంబంధించి మాకు ఎలాంటి ఉత్తర్వులు పై అధికారుల నుంచి రాలేదు. కమిషనర్ ద్వారా వివరాలు తీసుకోండి.
– కె.వెంకటేశ్వర్లు అసిస్టెంట్ సిటీ ప్లానర్
కౌన్సిల్ తీర్మానం అయింది కలెక్టర్ ఉత్తర్వులు రావాలి
డీజే కాంప్లెక్స్‌లోని షాపులకు వేలం నిర్వహించాం. దానికి సంబంధించిన తీర్మానం కూడా చేశాం. అయితే ప్రత్యేక అధికారి అయిన కలెక్టర్ నుంచి అప్రూవల్ రావాలి. షాపునకు వెయ్యి రూపాయల లెక్కన వేలం నిర్వహిస్తే రూ.1200, రూ.1300 లెక్కన పాట జరిగింది.
– శంకర్(ఆర్‌ఓ) రెవెన్యూ అధికారి
వివరాలు ఆర్‌ఓని అడగాలి
డీజే కాంప్లెక్స్‌కు సంబంధించి ఎటువంటి పన్నులు లేవు. కేవలం లీజు మాత్రమే ఉంటుంది. అయినా పూర్తి వివరాలు రెవెన్యూ అధికారిని అడగాలి.
– బ్రహ్మయ్య అసిస్టెంట్ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment