నిందితుడు, జనసేన నేత సత్యవెంకటకృష్ణ
మరికొందరు బాలికలపైనా అకృత్యాలకు ఒడిగట్టాడంటున్న పోలీసులు.. కేసు రాజీకి కూటమి నేతల ఒత్తిళ్లు
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్సార్‌సీపీ నేతలు
అండగా ఉంటామని భరోసా
ఐ.పోలవరం: రాష్ట్రంలో కూటమి నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అక్రమాలు, దౌర్జన్యాలు, మహిళలు, బాలికలపై అఘాయిత్యాల్లో కూటమి నేతలు ముందుంటున్నారు. కాకినాడ జిల్లా తునిలో ఇటీవల గురుకుల పాఠశాల విద్యార్థినిపై టీడీపీ నాయకుడు నారాయణరావు అఘాయిత్యానికి పాల్పడటం, ఆనక అతడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తెలిసిందే. ఇప్పుడు అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఓ జనసేన నాయకుడు ఆరో తరగతి చదువుతున్న బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
తండ్రి లేని 11 ఏళ్ల బాలికకు చాక్లెట్లు ఇచ్చి, మాయమాటలతో లోబరుచుకుని పలు పర్యాయాలు లైంగిక దాడి జరిపాడు. ఈ బాగోతం బయటపడితే పరువు పోతుందని కొందరు కూటమి నేతలు ఆ బాలిక తల్లితో పాటు బంధువులతో కేసు లేకుండా రాజీ చేసేందుకు యత్నించారు. రాజకీయంగా తీవ్ర ఒత్తిళ్లు కూడా తెచ్చారు. అయినప్పటికీ బాలిక తల్లి ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
బాలిక తల్లి నిలదీయడంతో..
అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం సమీప గ్రామానికి చెందిన బాలికపై బాణాపురానికి చెందిన జనసేన యువజన నాయకుడు రాయపురెడ్డి సత్యవెంకటకృష్ణ (బాబీ) ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆ బాలిక తన తల్లితో కలసి పూరి గుడిసెలో నివసిస్తోంది. ఆ బాలికకు బాబీ మాయమాటలు చెప్పి పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడినట్టు కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచి్చన ఫిర్యాదులో పేర్కొన్నారు.
గ్రామ సమీపంలోని ఒక భవనం నుంచి ఆ బాలికతో కలసి బాబీ గురువారం బయటకు వస్తుండగా ఆమె తల్లి అనుమానంతో నిలదీసింది. దీంతో తనపై బాబీ అనేక పర్యాయాలు అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆ బాలిక చెప్పింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయగా.. వారు గురువారం రాత్రి జిల్లా ఎస్పీ రాహుల్ మీనాను కలిసి ఫిర్యాదు చేశారు. వెంకట కృష్ణపై పోక్సో, బీఎన్‌ఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు.
రాజీకి తీవ్ర యత్నాలు
బాబీని కేసు నుంచి తప్పించేందుకు, రాజీ చేసేందుకు జనసేన, టీడీపీ నేతలు తెరవెనుక తీవ్రంగా యతి్నంచారు. అయితే, బాలిక తల్లి సహా కుటుంబ సభ్యులు ససేమిరా అనడంతో చివరకు అమలాపురం డీఎస్పీ ప్రసాద్ శుక్రవారం కేసు నమోదు చేసి, విచారణ జరిపారు. డీఎస్పీ కథనం ప్రకారం.. నిందితుడు బాబీ ఐ.పోలవరం జెడ్పీ హైసూ్కల్‌లో విద్యాకమిటీ సభ్యుడు. క్రీడాకారుడు కావడంతో విద్యార్థులకు క్రీడా శిక్షణ ఇస్తుంటాడు.
బాధితురాలు నిందితుడికి సమీప బంధువు. ఆమె తండ్రి రెండేళ్ల క్రితం మృతి చెందారు. తల్లి ఆక్వా కార్మికురాలు. నిందితుడు ఆ బాలికకు తరచూ చాక్లెట్లు కొనిపెడుతూ తన బంధువుకు చెందిన ఖాళీగా ఉన్న ఇంట్లో అఘాయిత్యానికి బరితెగిస్తున్నట్టు విచారణలో తేలిందని డీఎస్పీ చెప్పారు. నిందితుడి బారిన పడిన వారిలో ఇంకొందరు బాలికలూ ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. పరారీలో ఉన్న నిందితుడు బాబీని త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు.
వైఎస్సార్‌సీపీ నేతల పరామర్శ
బాధిత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ ముమ్మిడివరం నియోజకవర్గ కో–ఆర్డినేటర్ పొన్నాడ వెంకటసతీష్ కుమార్, పార్టీ సీఈసీ సభ్యుడు పితాని బాలకృష్ణ, కాశి మునిబాలకుమారి తదితరులు పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.


