పైపై మెరుగులు
ఈ చిత్రంలో ఉన్న పాఠశాల జిల్లా కేంద్రంలోని కస్పా మున్సిపల్ హైస్కూల్. ఇక్కడ సుమారు 1400 మంది విద్యార్థులున్నారు. ఈ పాఠశాలలో మున్సిపల్ తాగునీటి కొళాయి కనెక్షన్ ఉన్నప్పటికీ నీటి నిల్వకు వాడే ట్యాంక్ చాలాచిన్నది. పెద్ద ట్యాంక్ ఏర్పాటు చేయాలని ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు పలుమార్లు పాఠశాల నిర్వాహకులను కోరారు. పైగా పైకప్పులేకుండా చెట్టు కింద ఉండడం వల్ల ట్యాంక్ నీళ్లలో ఆకులు, ఇతర చెత్త పడుతోంది. తాజాగా తీసుకున్న చర్యలతో బాగుపడుతుందని అటు తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు భావించారు.
అదనపు నిధులు వెచ్చించి పెద్దట్యాంక్‌ను విద్యార్థులకు అందుబాటులో పరిశుభ్రమైన స్థలంలో ఏర్పాటు చేస్తారని ఆశించారు. కానీ అదే ట్యాంక్‌ను క్లీన్‌చేసి మరమ్మతు చేసిన జాబితాలో నమోదు చేశారు. జిల్లా కేంద్ర నడిబొడ్డున అధిక సంఖ్యలో విద్యార్థులున్న పాఠశాలలోనే ఈ పరిస్థితి ఉంటే జిల్లాలోని మారుమూల గ్రామాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. విజయనగరం అర్బన్: జిల్లాలో ఈ నెల 23న జరిగే సుప్రీం కోర్టు కమిటీ ఆకస్మిక పరిశీలన నేపథ్యంలో సర్కారు బడుల్లో మౌలిక సౌకర్యాల ఏర్పాట్లు అస్తవ్యస్తంగా సాగుతున్నాయి. పైపై మెరుగులు తప్పా పూర్తిస్థాయిలో మర్మమతులు జరగడం లేదు. నెల రో జుల క్రితం నుంచి జిల్లాలో ఈ ఏర్పాట్లు హడావుడి ఊపందుకుంది.
సుప్రీంకోర్టు హెచ్చరికలతో స్పందించిన జిల్లా అధికారులు... మరుగుదొడ్లు లేని పాఠశాలల్లో తక్షణమే నిర్మించాలని కిందిస్థాయి అధికారులకు ఆదేశాలిచ్చి చేతులు దులుపుకొన్నారు. మరమ్మతుల కు, సౌకర్యాల కల్పనకు అవసరమైన నిధులను కేటాయించలేదు. దీంతో స్థానికంగా పాఠశాలల్లో ఉన్న అరకొర నిధులతో మరమ్మ తులు చేసి సుప్రీం కమిటీ పర్యటించి న ఒక్కరోజు పనిచేస్తే చాలన్నట్లు మమా అనిపిస్తున్నారు. సుమారు 30 శాతం పాఠశాలల్లో బోరు గానీ, తాగునీటి సరఫరా గానీ అందుబాటులో లేవు. తాగడానికి, మరుగుదొడ్లలో వినియోగించేందుకు నీటిని గ్రామాల్లో దూరంగా ఉన్న బోరు ల నుంచి పాఠశాల నిర్వాహకులు తెప్పించుకుంటున్నారు. నిజానికి నిరంతరం నీటి సరఫరా ఉంటేనే మరుగుదొడ్ల వినియోగం సాధ్యమవుతుంది. అలాంటి శాశ్వత చర్యలు తీసుకోక పోవడాన్ని స్థానికులు విమర్శిస్తున్నారు.
నూరు శాతం సౌకర్యాలు కల్పించాం: ఆర్వీఎం పీఓ శారద
జిల్లాలో ఉన్న 2,841 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలన్నింటిలోనూ తాగునీటి సరఫరా, మరుగుదొడ్ల నిర్మాణం తదితర సౌకర్యాలను నూరు శాతం కల్పించినట్టు రాజీవ్ విద్యామిషన్ పీఓ శారద తెలిపారు. నెల రోజుల క్రితం వరకు వివిధ కారణాల వల్ల పలు పాఠశాలల్లో ఈ సౌకర్యాలు లేవని తెలిపారు. తాజాగా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని పాఠశాలల్లోనూ మరుగుదొ డ్లు, తాగునీటి సౌకర్యాలను కల్పించామని తెలిపారు. 851 పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీటి పరికరాలకు మరమ్మతులు చేపట్టి నట్టు తెలిపారు. మరుగుదొడ్ల నిర్మాణానికి స్థలాలు లేని 26, ఏజెన్సీలోని హిల్ టాప్ ప్రాంతాల్లో ఉన్న 94 పాఠశాలలు మినహా అన్నిం టిలోనూ ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.