Municipal High School
-
జేసీ కుమారుడు సర్కార్ బడికి..
సాక్షి, విజయనగరం: కుటుంబ పోషణ కోసం రోజం తా కష్టపడే కూలీ సైతం తమ పిల్లలను కార్పొరేట్ పాఠశాలల్లో చదివించాలని తపన పడుతున్న రోజులివి. వాటికి భిన్నంగా.. ప్రభుత్వ విద్యపై నమ్మకం కలిగించేలా.. తన తోటి అధికార యంత్రాంగానికి ఆదర్శంగా నిలిచేలా జేసీ–2 కూర్మనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఒక్కగానొక్క కుమారుడు ఆర్.త్రివిక్రమ్‌ను విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తోన్న కస్పా ఉన్నత పాఠశాలలో 9వ తరగతిలో సోమవారం ఉదయం చేర్పిం చారు. హెచ్ఎం శంకరరావు నుంచి ప్రవేశ ధ్రువీ కరణపత్రం తీసుకున్నారు. అనంతరం స్వయం గా తనే తరగతి గదికి కుమారుడిని తీసుకెళ్లి సహ విద్యార్థుల మధ్య కూర్చోబెట్టారు. ప్రభుత్వ విద్యపై నమ్మకం పెంచేందుకే... రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తోంది.. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వి నియోగం చేసుకునేలా అవగాహన కల్పించేందుకు తన కొడుకుని ప్రభుత్వ బడిలో చేర్పించినట్టు జేసీ–2 కూర్మనాథ్ వెల్లడించారు. విద్యార్థి చిన్నతనం నుంచి నేర్చుకోవాల్సిన అంశాలన్నీ ప్రభుత్వ బడులలో అందుబాటులో ఉంటాయన్నారు. తద్వారా ఉన్నత స్థాయికి ఎదిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. కేవలం చదువులోనే కాకుండా శారీరక దారుఢ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్, సమాజం పట్ల అవగాహన ప్రభుత్వ పాఠశాలల్లో సాధ్యపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థుల కోసం మధ్యాహ్నభోజన పథకాన్ని అమలు చేయడంతో పాటు అమ్మఒడి పథకం అమలుకు శ్రీకారం చుట్టిందన్నారు. ఉపకార వేతనాలు అందజేస్తోందని తెలిపారు. వీటి కోసం బడ్జెట్లో అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తోందని చెప్పారు. తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చదివించేందుకు ముందుకు రావాలని కోరారు. ప్రభుత్వబడుల్లో చక్కగా బోధించే ఉపాధ్యాయులు ఉన్నారని, విద్యార్థులు చదువుకునే వాతావరణం ఇంటివద్ద కల్పిస్తే చాలన్నారు. -
ఏపీలోని మున్సిపల్ స్కూల్లో హౌస్‌ఫుల్ బోర్డు
సీట్లు లేవని బోర్డు పెట్టిన పాఠశాల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో హౌస్‌ఫుల్ బోర్డు పెట్టారు.. నిజమే.. ఏపీలోని నెల్లూరులోని కేఎన్నార్ మున్సిపల్ హైస్కూలు ముందు ఈ బోర్డు కనిపిస్తోంది. సాధారణంగా కార్పొరేట్ పాఠశాలల్లో ఇలాంటి దృశ్యాలు కనిపిస్తుంటాయి. ఇప్పుడు నెల్లూరు నగరపాలక సంస్థ పాఠశాలలో కూడా ఈ దృశ్యం కనిపించడం చర్చనీయాంశంగా మారింది. 7, 8, 9, 10 తరగతుల్లో సీట్లు లేవు అని ఇక్కడ బోర్డు పెట్టారు. ఏటా పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు వస్తుండటంతో పేద, మధ్యతరగతికి చెందిన ప్రజలు ఈ పాఠశాలలో పిల్లలను చేర్చేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లిష్, తెలుగు మీడియంలలో బోధిస్తున్నారు. ఇప్పటికే ఇంగ్లిష్, తెలుగు మీడియంలలో 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 200 నుంచి 220 మంది వరకు విద్యార్థులున్నారని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయప్రకాష్ తెలిపారు. కేవలం 6వ తరగతికి మాత్రమే బడి పునఃప్రారంభమైన 13వ తేదీ నుంచి కొత్తగా విద్యార్థులను చేర్చుకుంటామని చెప్పారు. ఏటా ఈ స్కూల్లో 1,200 మందికిపైగా విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. - నెల్లూరు టౌన్ -
గృహ ప్రవేశానికి వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు
యలమంచిలి (విశాఖ జిల్లా) : శుభకార్యానికి బయలుదేరిన కాకినాడకు చెందిన వృద్ధ దంపతులు యలమంచిలి మండలం రేగుపాలెం సమీపంలో జాతీయ రహదారిపై శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. కాకినాడ నుంచి గాజువాక వెళ్తున్న వీరి కారు రేగుపాలెం ఫ్లైవోవర్ దాటిన తర్వాత రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కుటుంబ యజమాని ఆచంట దక్షిణామూర్తి (79), భార్య అనసూయ (68) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు నడుపుతున్న దక్షిణామూర్తి రెండో కుమారుడు శ్రీనివాస్, ఆయన తనయుడు అనిల్ గాయాలతో బయటపడ్డారు. మరో గంటలో గమ్యస్థానానికి చేరుకోవాల్సిన వీరిని మృత్యువు లారీ రూపంలో కబళించడంతో విషాదం అలుముకుంది. మూడో కుమారుడి ఇంటికెళ్తూ... కాకినాడ భానుగుడి జంక్షన్ సమీపంలో శ్రీరామ్‌నగర్ మున్సిపల్ హైస్కూల్ వద్ద ఎంఎస్ రెసిడెన్సీలో ఉంటున్న దక్షిణామూర్తి, భార్య అనసూయ దంపతులు ఉంటున్నారు. వారి రెండో కుమారుడు శ్రీనివాస్, మనుమడు అనిల్‌లతో కలిసి గాజువాకలో ఉంటున్న మూడో కుమారుడు వీరరాజశేఖర్ ఇంటికి శనివారం ఉదయం 6 గంటలకు బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు రేగుపాలెం ఫ్లైఓవర్ దాటిన తర్వాత రోడ్డు పక్కగా ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. అతివేగమే కారణమా.. ప్రమాదం జరిగిన ప్రాంతంలో మలుపు ఉండటం, వాహనం వేగంగా ప్రయాణించడంతో అదుపు చేయడానికి సాధ్యపడలేదు. దీంతో ప్రమాదం జరిగిన వెంటనే దక్షిణామూర్తి, భార్య అనసూయ కొద్ది క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. కారు ముందుభాగం పూర్తిగా నుజ్జయింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే యలమంచిలి రూరల్ ఎస్సై సీహెచ్.వెంకట్రావు, హైవే పెట్రోలింగ్ ఎస్సై దయానిధి సిబ్బందితో ప్రమాదస్థలానికి చేరుకున్నారు. గాయపడిన తండ్రీ కొడుకులు శ్రీనివాస్, అనిల్‌లను యలమంచిలి ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వారిని మెరుగైన వైద్యం కోసం బంధువులు కాకినాడకు తరలించారు. మృతదేహాలను యలమంచిలి మార్చురీకి తరలించారు. మృతదేహాలపై ఉన్న బంగారు ఆభరణాలను యలమంచిలి రూరల్ ఎస్సై వెంకట్రావు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆనందంగా బయలుదేరి.. దక్షిణామూర్తి మూడో కుమారుడు వీరరాజశేఖర్ అనకాపల్లి టెలికాం డిపార్ట్మెంట్లో జేటీఓగా పనిచేస్తున్నారు. ఇటీవల ఇతను గాజువాకలో కొత్తగా ఇంటిని నిర్మించారు. సోమవారం గృహప్రవేశం చేయడానికి నిర్ణయించారు. దీని కోసం దక్షిణామూర్తి దంపతులు ఆనందంగా కుమారుడి ఇంటికి వస్తుండగా ఆగి ఉన్న లారీ రూపంలో మృత్యువు కబళించింది. ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ చేసిన ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మార్చురీ వద్ద మిన్నంటిన రోదనలు.. మృతి చెందిన దక్షిణామూర్తి దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు రాధాకృష్ణ శర్మ కాకినాడలోని విద్యాశాఖలో అకౌంట్స్ అధికారిగా పనిచేస్తున్నారు. రెండో కుమారుడు శ్రీనివాస్ ప్రమాదంలో గాయపడ్డారు. మూడో కుమారుడు వీరరాజశేఖర్. కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో యలమంచిలి మార్చురీ వద్దకు చేరుకున్నారు. దంపతులిద్దరి మృతదేహాలను చూసి బోరున విలపించారు. మార్చురీ వద్ద రోదనలు మిన్నంటాయి. -
తలపై ఇటుకలు పెట్టి..మోకాళ్లపై నిలబెట్టి
పాఠశాలల్లో విద్యార్థులు తప్పు చేస్తే ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవడం సహజం. అయితే అది విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉండకుండా వారిలో మార్పు తెచ్చేలా ఉంటే ఎవరూ అభ్యంతరం పెట్టరు. కానీ క్రమశిక్షణ పేరుతో విద్యార్థులకు తీవ్రమైన శిక్షలు విధించడం దారుణమే. ఇదిగో ఈ చిత్రంలో కనిపిస్తున్న శిక్ష అలాంటిదే. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్లో గత కొద్ది రోజులుగా ఓ ఉపాధ్యాయుడు దండన పేరుతో విద్యార్థుల నెత్తిపై నాలుగు ఇటుకలు పెట్టి గంటల తరబడి మోకాళ్లపై కూర్చోబెడుతున్నారు. ఈ శిక్షను భరించలేని విద్యార్థులు కొందరు రహస్యంగా సెల్ఫోన్లో ఆ దృశ్యాలను చిత్రీకరించి ‘సాక్షి’కి అందించారు. -ప్రొద్దుటూరు టౌన్ -
పైపై మెరుగులు
ఈ చిత్రంలో ఉన్న పాఠశాల జిల్లా కేంద్రంలోని కస్పా మున్సిపల్ హైస్కూల్. ఇక్కడ సుమారు 1400 మంది విద్యార్థులున్నారు. ఈ పాఠశాలలో మున్సిపల్ తాగునీటి కొళాయి కనెక్షన్ ఉన్నప్పటికీ నీటి నిల్వకు వాడే ట్యాంక్ చాలాచిన్నది. పెద్ద ట్యాంక్ ఏర్పాటు చేయాలని ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు పలుమార్లు పాఠశాల నిర్వాహకులను కోరారు. పైగా పైకప్పులేకుండా చెట్టు కింద ఉండడం వల్ల ట్యాంక్ నీళ్లలో ఆకులు, ఇతర చెత్త పడుతోంది. తాజాగా తీసుకున్న చర్యలతో బాగుపడుతుందని అటు తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు భావించారు. అదనపు నిధులు వెచ్చించి పెద్దట్యాంక్ను విద్యార్థులకు అందుబాటులో పరిశుభ్రమైన స్థలంలో ఏర్పాటు చేస్తారని ఆశించారు. కానీ అదే ట్యాంక్‌ను క్లీన్‌చేసి మరమ్మతు చేసిన జాబితాలో నమోదు చేశారు. జిల్లా కేంద్ర నడిబొడ్డున అధిక సంఖ్యలో విద్యార్థులున్న పాఠశాలలోనే ఈ పరిస్థితి ఉంటే జిల్లాలోని మారుమూల గ్రామాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. విజయనగరం అర్బన్: జిల్లాలో ఈ నెల 23న జరిగే సుప్రీం కోర్టు కమిటీ ఆకస్మిక పరిశీలన నేపథ్యంలో సర్కారు బడుల్లో మౌలిక సౌకర్యాల ఏర్పాట్లు అస్తవ్యస్తంగా సాగుతున్నాయి. పైపై మెరుగులు తప్పా పూర్తిస్థాయిలో మర్మమతులు జరగడం లేదు. నెల రో జుల క్రితం నుంచి జిల్లాలో ఈ ఏర్పాట్లు హడావుడి ఊపందుకుంది. సుప్రీంకోర్టు హెచ్చరికలతో స్పందించిన జిల్లా అధికారులు... మరుగుదొడ్లు లేని పాఠశాలల్లో తక్షణమే నిర్మించాలని కిందిస్థాయి అధికారులకు ఆదేశాలిచ్చి చేతులు దులుపుకొన్నారు. మరమ్మతుల కు, సౌకర్యాల కల్పనకు అవసరమైన నిధులను కేటాయించలేదు. దీంతో స్థానికంగా పాఠశాలల్లో ఉన్న అరకొర నిధులతో మరమ్మ తులు చేసి సుప్రీం కమిటీ పర్యటించి న ఒక్కరోజు పనిచేస్తే చాలన్నట్లు మమా అనిపిస్తున్నారు. సుమారు 30 శాతం పాఠశాలల్లో బోరు గానీ, తాగునీటి సరఫరా గానీ అందుబాటులో లేవు. తాగడానికి, మరుగుదొడ్లలో వినియోగించేందుకు నీటిని గ్రామాల్లో దూరంగా ఉన్న బోరు ల నుంచి పాఠశాల నిర్వాహకులు తెప్పించుకుంటున్నారు. నిజానికి నిరంతరం నీటి సరఫరా ఉంటేనే మరుగుదొడ్ల వినియోగం సాధ్యమవుతుంది. అలాంటి శాశ్వత చర్యలు తీసుకోక పోవడాన్ని స్థానికులు విమర్శిస్తున్నారు. నూరు శాతం సౌకర్యాలు కల్పించాం: ఆర్వీఎం పీఓ శారద జిల్లాలో ఉన్న 2,841 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలన్నింటిలోనూ తాగునీటి సరఫరా, మరుగుదొడ్ల నిర్మాణం తదితర సౌకర్యాలను నూరు శాతం కల్పించినట్టు రాజీవ్ విద్యామిషన్ పీఓ శారద తెలిపారు. నెల రోజుల క్రితం వరకు వివిధ కారణాల వల్ల పలు పాఠశాలల్లో ఈ సౌకర్యాలు లేవని తెలిపారు. తాజాగా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని పాఠశాలల్లోనూ మరుగుదొ డ్లు, తాగునీటి సౌకర్యాలను కల్పించామని తెలిపారు. 851 పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీటి పరికరాలకు మరమ్మతులు చేపట్టి నట్టు తెలిపారు. మరుగుదొడ్ల నిర్మాణానికి స్థలాలు లేని 26, ఏజెన్సీలోని హిల్ టాప్ ప్రాంతాల్లో ఉన్న 94 పాఠశాలలు మినహా అన్నిం టిలోనూ ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. -
కాటేస్తున్న...
సాక్షి ప్రతినిధి, కడప: జిల్లా కేంద్రమైన కడపలోని గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్లో సుబ్రమణ్యం క్రాప్ట్ టీచర్. విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేసేవాడు. మానవ హక్కుల వేదిక పోరాటం ఫలితంగా విచారణ చేపట్టారు. ఆరోపణలు వాస్తవమే.. చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌కు విద్యాశాఖ సిఫారసు చేసింది. ఇంక్రిమెంటు మాత్రమే కట్ చేశారు. ప్రస్తుతం సుబ్రమణ్యం అదే పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన ఓ యూనియన్‌కు నాయకుడు కూడా.. నాగేశ్వరనాయక్.. పుల్లంపేట మండలం వత్తలూరులో టీచర్. ఓ విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. విషయం తెలిసి గ్రామస్తులు దేహశుద్ధి చేశారు.. పోలీసులు కేసు నమోదు చేశారు. సస్పెండ్ కూడా అయ్యారు. ప్రస్తుతం మళ్లీ పనిచేస్తున్నారు. వనిపెంటలో రెడ్డయ్యనాయుడు టీచర్. విద్యార్థినిలను లైంగిక వేధింపులకు గురిచేస్తుండటంతో గ్రామస్తులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు స్టేషన్లో రాచమర్యాదలు పొందారు. కొన్నాళ్లు సస్పెండ్ అయి మళ్లీ విధులు నిర్వర్తిస్తున్నారు. బాల ఓబయ్య.. పోరుమామిళ్ల ఉర్దూహైస్కూల్లో హెడ్మాస్టర్. తొమ్మిదోతరగతి విద్యార్థినిలను లైంగిక వేధింపులకు గురి చేసేవాడు. ప్రజా సంఘాలు, పత్రికలు ఈ విషయమై నినదించాయి. విద్యాశాఖను దుమ్మెత్తి పోశాయి. ఆరు నెలలపాటు సస్పెండ్‌కు గురయ్యాడు. కౌన్సెలింగ్‌లో అదే పాఠశాలకు పోస్టింగ్ ఇచ్చారు. జిల్లాలో ఇలాంటి ఘటనలు తరుచూ వెలుగు చూస్తున్నా నియంత్రించడంలో విద్యాశాఖ విఫలమవుతోంది. ఇటువంటి సంఘటనలతో సమాజంలో గురువులకు తలవంపులు తెస్తున్నారు. ఇటువంటివారిపట్ల కఠినంగా వ్యవహరించకపోవడం విద్యాశాఖ ప్రథమ తప్పుగా పలువురు భావిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుల ప్రలోభాలకు లొంగిపోయి తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో విద్యార్థినులపై లైంగిక వేధింపులు కొనసాగుతునే ఉన్నాయి. ప్రైవేటు కళాశాల కరెస్పాండెంట్ పద్మనాభరెడ్డి మొదలు, హెడ్మాస్టర్ బాలఓబయ్య, జంక్షన్ నాయక్, రెడ్డెప్పనాయుడు, నాగేశ్వరరావునాయక్, సుబ్రమణ్యం, బోయనపల్లె ఉపాధ్యాయుడు ఆర్థర్ వరకు లైంగిక వేధింపులు, అత్యాచార ఘటనలు పునరావృతం అవుతునే ఉన్నాయి. గౌరవం కోల్పోతున్న గురువులు .... ఆచార్య దేవోభవా! అనే పదానికి కాలదోషం పడుతోంది. తల్లి, తండ్రితర్వాత స్థానంలో ఉపాధ్యాయులను చూడాలన్న నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు. గురువుల చూపుల్లోని తేడాలు పసిబుగ్గలపై పురుగుల్లా పారాడుతున్నాయి. ఉపాధ్యాయ సహచరులు సైతం తమకెందుకులే అన్న భావనతో ఉండడం వల్ల మళ్లీ మళ్లీ ఇలాంటివి పునరావృతం అవుతున్నాయి. అభం శుభం తెలియని విద్యార్థినుల పట్ల నీచాతి నీచంగా ప్రవర్తిస్తున్న గురువులపై క్రిమినల్ కేసులతోపాటు, నిర్భయ చట్టం అమల్లోకి తెచ్చి, ఉద్యోగం కోల్పొయేలా చర్యలుంటే తప్ప ఇలాంటి ఘటనలను నియంత్రించే అవకాశం లేదని పలువురు భావిస్తున్నారు. పోలీసు రిక్రూట్మెంట్లో వ్యక్తిగత ప్రవర్తనతోపాటు కుటుంబ చరిత్రను పరిగణలోకి తీసుకునే నిబంధన ఉంది. ఆ విధంగా ఉపాధ్యాయుడిని కూడా కుటుంబ నేపధ్యాన్ని వ్యక్తిగత ప్రవర్తనపై విచారించి నియమించుకోవాలనే నిబంధన ఉంది. అయితే మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ (డీఎస్సీ)లో పాసైతే ఉద్యోగం రెడీ అవుతోంది. నైతిక ప్రవర్తన మీద ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం లేదు. ఫలితంగా ఒకరి తర్వాత మరొకరు వక్రబుద్ధి గురువుల జాబితాలో చేరుతున్నారు. ఢిల్లీ నిర్భయ తరహాలో ఉద్యమిస్తేనే.... దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నత చదువు చదువుతున్న విద్యార్థిని నిర్భయ అత్యాచారం పట్ల ఉద్యమించినట్లుగా ప్రజానీకం చైతన్యవంతులయ్యేంత వరకు ఉపాధ్యాయుల నుంచి ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉంటాయని విశ్లేషకుల అభిప్రాయం. తమ చిన్నారి లైంగిక వేధింపులకు గురైందని తెలిసినా సమాజానికి బయపడి తల్లిదండ్రులే ఆ ఘటనను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అత్యాచార ఘటనలను తీవ్రంగా తప్పుబట్టాల్సిన పై అధికారులు తేలికగా పరిగణిస్తున్నారు. దీంతోనే రాజంపేట ఎంఈఓ కృష్ణకుమార్‌ను గ్రామస్తులు చితకబాదారు. విద్యార్థినులపై అఘాయిత్యాలకు పాల్పడే గురువులపై నిర్భయ చట్టం అమలు చేయాలని ఈ సందర్భంగా పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
జయహో
ప్రొద్దుటూరు కల్చరల్, న్యూస్‌లైన్: జాతీయగీతం రచించి 103 సంవత్సరాలు అయిన సందర్భంగా శుక్రవారం స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ క్రీడా మైదానంలో ‘జయహో జనగణమన’ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జనగణమన గీతం వందేళ్లు నిండిన సందర్భంగా రెండేళ్లుగా విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించేందుకు ఈ మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజర్ మహబూబ్‌బాష, మల్లిఖార్జునరావు, నడిగడ్డ సుధాకర్, కోనేటి సుధాకరరెడ్డిలు తెలిపారు. ఈ ఉత్సవాల సందర్భంగా అథ్లెటిక్స్, పాటలపోటీ, చెస్, వక్తృత్వ, చిత్రలేఖన తదితర పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను పంపిణీ చేశారు. జయహోజనగణమనలో 40 పాఠశాలలకు చెందిన 6 వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. 6 వేల మంది పైగా విద్యార్థులు, ప్రజలు, ఉపాధ్యాయులు ఒకేసారి జాతీయ గీతాన్ని ఆలపించడంతో ఆ ప్రాంతం అంతా జనగణమన అని మారుమోగింది. ఉత్సవాలలో భాగంగా విద్యార్థులు ఆలపించిన దేశభక్తి గీతాలు, నృత్యాలు అందర్నీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ముందుగా ఎమ్మెల్యే లింగారెడ్డి సతీమణి మల్లెల లక్ష్మిప్రసన్న జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో అనిబిసెంట్ పాఠశాల పూర్వవిద్యార్థుల సంఘం అధ్యక్షులు ఆడిటర్ సదాశివ శర్మ, ప్రధానోపాధ్యాయుడు కాశీప్రసాద్, వైవీ న్యాయవాది ముడిమెల కొండారెడ్డి, ఉత్తమ ఉపాధ్యాయుడు ప్రభుకుమార్, మళయాలస్వామి టీపీటీ కళాశాల ప్రిన్సిపల్ గోపీనాయుడు, వ్యాయామ ఉపాధ్యాయుడు రమణయ్య, రాఘవ,గౌతమ్హైస్కూల్, గోపీకృష్ణ, కావేరీ, అనిబిసెంట్, ైవె వీఎస్ తదితర పాఠశాలల విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. -
వినాయక చవితికి భారీగా ఏర్పాట్లు
సాక్షి, బళ్లారి : వినాయకున్ని పూజించి పనులు చేపడితే సర్వ విఘ్నాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అందుకే సోమవారం వినాయక చవితి ని పురస్కరించుకుని పలు వార్డుల్లో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసేం దుకు ఆయా కాలనీల్లో మండళ్లను ము స్తాబు చేశారు. నగరంలోని దాదాపు 500కు పైగా విగ్రహాలు కూర్చోబెట్టేం దుకు సన్నాహాలు పూర్తి చేశారు. ప్ర ముఖ కాలనీలైన అనంతపురం రోడ్డు, మున్సిపల్ హైస్కూల్ దగ్గర, ఎస్పీ సర్కిల్, పటేల్‌నగర్, మిల్లార్‌పేట, బెంగళూరు రోడ్డులతోపాటు నగరంలోని 35 వార్డుల పరిధిలో విగ్రహాలు కూర్చోబెట్టేందుకు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో పూజా సామాగ్రిని కొనుగోలు చేసేం దుకు నగరంలో జనం కిక్కిరిసా రు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ చేతన్‌సింగ్ రాథోడ్ ఆదేశాలు జారీ చేశారు. విగ్రహాల రూపకల్పనలో మేటి ఓంకార్ బళ్లారి అర్బన్ : ఆంధ్రాళ్ గ్రామంలోని పవిత్ర ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఓంకార్ మధుసూధన్, మల్లికార్జునలు వినూత్న తరహాలో బొజ్జగణపయ్యలను తయారు చేసి చూపరులను ఆకట్టుకుంటున్నారు. వినాయక విగ్రహాలను చేయడంలో ఓంకార్‌ది ప్రత్యేకమైన శైలి. ఆయన ఉపేంద్ర గణపతి, జట్కాబండి గణపతి, జింకల గణపతి, రజనీకాంత్ కొచ్చడియన్ గణపతి, కొబ్బరిచెట్టు గణపతి, జాస్మిన్ పూవుపై ఉన్న సీతాకోక గణపతి, తబల గణపతి, ఏకలవ్య గణపతి, రుద్రాక్ష గణపతులను తయారు చేసి ప్రతిభను చాటారు. హోస్పేట : నగరంలోని పలు ముఖ్య వీధుల్లో వినూత్న రకాల గణేష్ విగ్రహాలు అమ్మకానికి ఉంచారు. ఈ విగ్రహాలను ఆదివారం జోరుగా కొనుగోలు చేశారు. అలాగే పూజకు కావాల్సిన సామాగ్రిని నగర వాసులు జోరుగా కొనుగోలు చేశారు. పండ్లు, పూలు, మామిడి ఆకులు, అరటి పిలకలు కొనుగోలు చేశారు.